close

తాజా వార్తలు

నడిపించే నాయకుడే.. ‘విశ్వ విజేత’

ప్రపంచకప్‌ జట్ల సారథులు-సామర్థ్యాలు

నాయకుడంటే ముందుండి నడిపించేవాడు. ముళ్ల పొదల్లోంచి నడిచి సరికొత్త బాటను చూపించేవాడు. తనను అనుసరించే వారూ నాయకులే అవ్వాలని కోరుకొనేవాడు. అవసరమైన వనరులు లేకున్నా కొండంత ఆత్మవిశ్వాసం నిండినవాడు. తనకున్న బలం, బలగంతోనే ప్రత్యర్థిని చిత్తుచేసే వ్యూహాలు రచించేవాడు. మొత్తం ఒత్తిడి తనపై వేసుకొని అందరికీ సుఖాల్ని పంచేవాడు. అవసరమైతే త్యాగానికీ వెనకాడని వాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ అలాంటి నాయకులు ఉన్నారు. తమ దేశానికి ప్రపంచకప్‌ అందించాలని తహతహలాడుతున్నారు. వారి గుణగణాలు, సామర్థ్యాలేంటో చూద్దామా!!

విరాట్‌ ‘దూకుడు’

జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత మరింత రాటుదేలిన సారథుల్లో విరాట్‌ కోహ్లీది అగ్రస్థానం. ఛేదనలో మరింత చెలరేగే అతడు ‘ఛేదన రారాజు’గా పేరుగాంచాడు. జట్టును ముందుండి నడిపిస్తాడు. పరుగులు చేసేందుకు అస్సలు మొహమాట పడడు. సారథ్య బాధ్యతలతో ప్రదర్శన తగ్గిపోయిన ఎందరో మనకు తెలుసు. విరాట్‌ అందుకు పూర్తిగా భిన్నం. తానే ఎక్కువ పరుగులు చేస్తాడు. మూడేళ్ల ప్రదర్శనే అందుకు ఉదాహరణ. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడేళ్లుగా టాప్‌-3లోనే ఉంటున్నాడు. ఇప్పటి వరకు 68 వన్డేలకు సారథ్యం వహించిన కోహ్లీ 49 గెలిచాడు. 17 మ్యాచుల్లో ఓడాడు. విజయాల శాతం 73.88. జూనియర్లు అద్భుతంగా ఆడినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎంతో సత్తా ఉన్నప్పటికీ విరాట్‌లోనూ కొన్ని బలహీనతలూ ఉన్నాయి. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతుల్ని వెంటాడి వికెట్‌ ఇచ్చేస్తాడు. డీఆర్‌ఎస్‌పై ఇంకా పరిపూర్ణత సాధించలేదు. పిచ్‌ను అంచనా వేయడంలో భిన్నంగా ప్రవర్తిస్తాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని అలాగే చేజార్చాడని ఓ విమర్శ! అనుకున్న వ్యూహం ఫలించనప్పుడు వెంటవెంటనే బౌలర్లను మార్చేందుకు వెనుకాడతాడు. విరాట్‌ తొలిసారి ప్రపంచకప్‌నకు సారథ్యం వహిస్తున్నాడు.

మోర్గాన్‌ ‘పట్టుదల’

చరిత్రలో మునుపెన్నడూ లేనంత పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను ఇయాన్‌ మోర్గాన్‌ రెండోసారి ప్రపంచకప్‌లో నడిపిస్తున్నాడు. 2015 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత ఇంగ్లాండ్‌ దృక్పథమే మారపోయింది. రెండేళ్లుగా భయం లేని క్రికెట్‌ ఆడుతోంది. దానికి మోర్గార్‌ విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నాడు. వ్యక్తిగతంగా మూడేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌ మ్యాచుల్ని మినహాయించి 100 వన్డేలకు సారథ్యం వహించాడు. విజయాలు 62. ఓటములు 33. విజయాల శాతం 65.10. అత్యధిక వన్డేల్లో ఇంగ్లాండ్‌కు సారథ్యం వహించింది మోర్గాన్‌ ఒక్కడే. అలిస్టర్‌ కుక్‌ (69)ది తర్వాతి స్థానం. ఓపెన్‌ మైండ్‌తో ఆలోచించడం మోర్గాన్‌ బలం. ఒత్తిడిలో తడబడతాడు. ఏదేమైనా ఓ విధ్వంసకర జట్టును తయారు చేసింది మాత్రం అతడే. కుల్‌దీప్‌ తరహా స్పిన్నర్‌ తగిలితే జట్టును కాపాడుకోవడం కష్టం!

‘ఫించ్‌’ కొట్టుడే!

బాల్‌ ట్యాంపరింగ్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ చీకటి కోణం. కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై నిషేధంతో ఆరోన్ ఫించ్‌ ఆసీస్‌కు ఆపద్ధర్మ నాయకుడిగా మారాడు. ఆత్మవిశ్వాస లేమితో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న జట్టును ఒడ్డుకు చేర్చాడు ఫించ్‌. ఈ క్రమంలో ఘోర ఓటములు వెక్కిరించాయి. ఫామ్‌ కోల్పోయాడు. కఠిన ఒత్తిడి అనుభవించాడు. అతడిని తీసేయాలని ఎంతో మంది సూచించారు. అయితే ప్రయాణంలో అన్నీ ఎదురవుతాయని గ్రహించాడు. ఓపిక పట్టాడు. తన ఆటగాళ్లను విశ్వసించాడు. ఆ ప్రక్రియలో తొలి విజయం దక్కింది. రెండోదీ వచ్చింది. జట్టులో క్రమంగా నమ్మకం, విశ్వాసం పెంచాడు. 2 మ్యాచులు ఓడి వరుసగా మూడు నెగ్గి భారత్‌పై వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవడంతో దశ మారింది. నిషేధం తర్వాత స్మిత్‌, వార్నర్‌ను ఫించ్‌ సాదరంగా స్వాగతించాడు. మూడే నెలల్లో జట్టును మళ్లీ పటిష్ఠంగా మార్చాడు. ప్రపంచకప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దించాడు. ఇందుకు ఫించ్‌ ఓర్పు, సహనం కారణం. ప్రపంచకప్‌ మినహాయిస్తే అతడు 18 వన్డేలకు సారథ్యం వహించాడు. విజయాలు 11. ఓటములు 8. విజయాల శాతం 57.89.

కేన్‌ ‘మిస్టర్‌ కూల్‌ 2’

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రశాంత సారథుల్లో న్యూజిలాండ్‌ నాయకుడు కేన్‌ విలియమ్సన్‌ ఒకరు. అద్భుతమైన ఆట. చక్కని స్ట్రోక్‌ ప్లే. ఒత్తిడికి తొణకడు. భావోద్వేగాలు ప్రదర్శించడు. ఇక కివీస్‌ అంటే క్రమశిక్షణ కలిగిన జట్టు. బృందస్ఫూర్తి తొణికిసలాడుతుంది. విరాట్‌ తరహాలోనే కేన్‌ కివీస్‌ను ముందుండి నడిపిస్తాడు. నిలకడగా పరుగులు చేస్తాడు. అందరినీ ప్రోత్సహిస్తాడు. బలమైన భాగస్వామ్యాలే విజయానికి పునాదులని నమ్మే ఆటగాడు అతడు. 66 వన్డేలకు సారథ్యం వహించాడు. విజయాలు 35. ఓటములు 29. గెలుపు శాతం 54.68. కేన్‌ మైదానంలో చురుగ్గా ఆలోచిస్తాడు. అవసరానికి తగినట్టు త్వరగా వ్యూహాలు మారుస్తాడు. అంతకు మించి అతడో అద్భుత ఫీల్డర్‌.

‘విధ్వంస’ సారథి హోల్డర్‌

ప్రపంచకప్‌లో అత్యంత విధ్వంసకర బృందం వెస్టిండీస్‌. దానికి సారథి జేసన్‌ హోల్డర్‌. కరీబియన్‌ జట్టుకు ఎక్కువ వన్డేల్లో సారథ్యం వహించిన ఐదో ఆటగాడు హోల్డర్‌.  75 వన్డేలకు సారథ్యం వహించాడు. విజయాలు 23. ఓటములు 46. టై 2. ఫలితం తేలనవి 4. విజయాల శాతం 33.80. విండీస్‌ బోర్డుతో విభేదాల కారణంగా స్టార్లు దూరమైన జట్టును అతడు యువకులతో సమర్థంగా నడిపించాడు. షానన్‌ గాబ్రియేల్‌, హెట్‌మైయిర్‌, ఎవిన్‌ లూయిస్‌, నికోలస్‌ పూరన్‌, ఓషేన్‌ థామస్‌ సహా చాలామంది కుర్రాళ్లు అతడి సారథ్యంలోనే జట్టులో ప్రవేశించారు. మంచి ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. ఆండ్రీ రసెల్‌, బ్రాత్‌వైట్‌, క్రిస్‌గేల్‌ వంటి సీనియర్లు అందుబాటులోకి రావడంతో కరీబియన్‌ జట్టు దుర్భేద్యంగా కనిపిస్తోంది. అలాంటి జట్టును హోల్డర్‌ చక్కగా నడిపిస్తున్నాడు. బౌలర్‌గా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. జట్టును సమతూకంగా ఎంపిక చేస్తున్నాడు. అతడు జట్టును కలిసికట్టుగా నడిపిస్తే విండీస్‌ సెమీస్‌ చేరడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్‌పై ఆటే అందుకు ఉదాహరణ.

‘డుప్లెసిస్‌’ తపన

వాస్తవంగా విజేతకు ఉండాల్సిన లక్షణాలన్నీ దక్షిణాఫ్రికా సొంతం. అందేంటో తెలీదు జట్టులో అరివీర భయంకరులు ఉన్నప్పటికీ ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడికి లొంగిపోతుంది. ‘చోకర్స్‌’ తమకు సరైన పేరు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. జట్టుకున్న ఆ అప్రతిష్ఠను తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రస్తుత నాయకుడు డుప్లెసిస్‌. అదేం విచిత్రమో! ఆ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడింది. స్వతహాగా డుప్లెసిస్‌ మంచి బ్యాట్స్‌మన్‌. మిడిలార్డర్‌కు, టాప్‌ ఆర్డర్‌కు అనుసంధాన కర్తగా ఉంటాడు. నిలకడగా ఆడుతూనే పరుగుల వరద పారించగల సమర్థుడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడతాడు. ప్రపంచకప్‌తో కలిసి డుప్లెసిస్‌ 32 వన్డేలకు సారథ్యం వహించాడు. గెలిచినవి 25. ఓడినవి 7. విజయాల శాతం 78.12. జట్టును అతడెంత సమర్థంగా నడిపించగలడో అన్న దానికి ఈ గణాంకాలే ఉదాహరణ. ఐసీసీ టోర్నీల్లో మాత్రం అతడిపై ఒత్తిడి కనిపిస్తూనే ఉంది. సమతూకంగా జట్టును ఎంపిక చేసి జోరు పెంచితే అతడికి ఏ బాధా ఉండదు.

‘అస్థిర’ సర్ఫరాజ్‌

ఎప్పుడెలా ఆడుతుందో తెలీని పాకిస్థాన్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌ సారథి. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ చేతిలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ జట్టునే కసిగా ఆడించి భారత్‌పై ఫైనల్లో ఘన విజయం అందించాడు. వికెట్‌ కీపర్‌ కావడంతో ఆట, పిచ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌పై అవగాహన అతడి సొంతం. మిడిలార్డర్‌లో కీలకం అవుతున్నాడు. అయితే నిలకడ లోపం ఉంది. ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఆటగాళ్లపై అరుస్తుంటాడు. ప్రపంచకప్‌ మినహాయిస్తే 40 వన్డేలకు సారథ్యం వహించాడు. గెలుపు 21, ఓటములు 17. విజయాల శాతం 55. అస్థిరతే అతడి బలహీనత.

‘గాండ్రించే పులి’ మొర్తజా

ప్రపంచకప్‌లో ఓ జట్టును నడిపిస్తున్న అనుభవజ్ఞుడు బంగ్లా సారథి మష్రఫె మొర్తజా. కుదిరినప్పుడు పెద్ద జట్లకు షాకులిచ్చే స్థితి నుంచి నిలకడైన జట్టుగా అతడి నాయకత్వంలోనే బంగ్లా రూపొందింది. అతడు నాయకత్వం వహించిన వన్డేలు 78. విజయాలు 45. ఓటములు 31. విజయాల శాతం 59.21. బంతితో నిప్పులు చెరిగే మొర్తజా బ్యాటుతోనూ రాణించగలడు. ఆపదలో జట్టును ఆదుకోగలడు. మైదానంలో, బయటా ఆటగాళ్లను క్రమశిక్షణగా ఉంచుతాడు. బౌలర్లను తెలివిగా వినియోగిస్తాడు. ప్రపంచకప్‌లో బంగ్లాను కనీసం సెమీస్‌ చేర్చాలనే లక్ష్యంతో మష్రఫె ఉన్నాడు.

‘కొత్త సారథి’ గుల్బదిన్‌

అఫ్గాన్‌ సారథి గుల్బదిన్‌ నయీబ్‌ నాయకత్వానికి కొత్త. 56 వన్డేల సారథ్య అనుభవం ఉన్న అస్ఘర్‌ స్టానిక్‌జాయ్‌ని కాదని అతడికి కెప్టెన్‌ చేసింది బోర్డు. అనుభవ లేమి లోటు. నాయకత్వ సామర్థ్యమేంటో తెలియదు. ప్రపంచకప్‌తో కలిసి 5 వన్డేలకు సారథ్యం వహించి 2 గెలిచాడు. 2 ఓడాడు. 56 వన్డేలు ఆడిన నయీబ్‌ 861 పరుగులు చేశాడు. 51 వికెట్లు తీశాడు.

‘ప్చ్‌..!’ కరుణరత్నె

జట్టులో చోటే అతడికి అనుమానం. ఇప్పటి వరకు ఆడింది 19 వన్డేలు. అలాంటి దిముతు కరుణరత్నెను శ్రీలంక బోర్డు జట్టు సారథిగా ఎంపిక చేసింది. నాయకుడిగా, ఆటగాడిగా అనుభవం శూన్యం. 19 వన్డేల్లో చేసిన పరుగులు 319. జట్టుపై పట్టులేదు. వ్యూహ రచన తెలీదు. ఆటగాళ్లను ఎలా నడిపించాలో అనుభవం లేదు. ఏ రకంగా చూసినా శ్రీలంక పరిస్థితి బాగాలేదు.

- ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.