close

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..?

సైబర్‌ ముప్పు..  జరభద్రం
నేరస్థుల నుంచి తప్పించుకునే మార్గాలివిగో..

హైదరాబాద్‌: ఇంట్లో వంట చేసుకునేందుకు అవసరమైన కూరగాయలు కొనాలంటే మార్కెట్‌కు వెళ్లాల్సిందే.. ఇష్టమైన పిజ్జా తినాలంటే పిజ్జా హట్‌కు వెళ్లకతప్పదు.. పండగకి కొత్త దుస్తులు కొనాలంటే వస్త్ర దుకాణానికి వెళ్లి తీరాలి.. కానీ ఇదంతా గతం. ఒకప్పుడైతే తప్పనిసరిగా ఇలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీలుంటే వెళ్లొచ్చు. లేదంటే ఆవు పేడ నుంచి  పచారీ సరకుల వరకు అన్నీ ఇంటి ముంగిట్లోకి వచ్చి వాలాల్సిందే. అందుకు సులభమైన మార్గం ‘ఆన్‌లైన్‌ షాపింగ్‌’. ఇంట్లోనే కూర్చుని అంతర్జాలంలో ఆర్డర్‌ చేస్తే చాలు ఎక్కడికీ వెళ్లక్కర్లేకుండానే అవసరమైన సరకులన్నీ ఇంటికి చేర్చే సౌలభ్యం కలుగుతోంది. అయితే ప్రతి పార్శ్వానికి రెండు వైపులా ఉన్నట్లే.. వినియోగదారులకు సులభ రీతిలో సేవలందిస్తున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌కూ సైబర్‌ నేరాల ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ ఆధ్వర్యంలోని ‘ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌(ఐసియా)’ సంస్థ అవగాహన కల్పిస్తోంది.

వెబ్‌సైట్‌ భద్రమైనదేనా..?
సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేయాలంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వక తప్పదు. ఆ సమయంలో సదరు వెబ్‌సైట్‌ భద్రమైనదేనా..? అని తనిఖీ చేయడం తప్పనిసరి. వెబ్‌సైట్‌ను తెరిచేందుకు టైప్‌ చేసే అడ్రస్‌బార్‌ను పరిశీలించాలి. http అని మాత్రమే కాకుండా https  అని ఉంటే అది సురక్షితమైన వెబ్‌సైట్‌గా పరిగణించాలి. అలాగే అదే అడ్రస్‌ బార్‌లో తాళం మూసి ఉన్నట్లుగా గుర్తు ఉండటం అవసరమనే విషయాన్ని గుర్తించాలి.

కార్డు వివరాలు సేవ్‌ చేయొద్దు
తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు కొన్ని తప్పిదాలకు పాల్పడుతుంటారు. ప్రతీసారి వెబ్‌సైట్‌లో క్రెడిట్‌/డెబిట్‌కార్డు వివరాలు నమోదు చేయడం ఎందుకనే కారణంతో సేవ్‌ చేస్తుంటారు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఆ వివరాలు తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనికితోడు ప్రతీ నెల కార్డు లావాదేవీల వివరాల్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. మీకు తెలియని లావాదేవీలు ఏమైనా జరిగాయా..? మీరు ఏదైనా లావాదేవీ నిర్వహించిన కొంతసేపటికే మరెవరైనా మీ కార్డుపై ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసారా..? అని క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాంటివి జరిగినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత కార్డు వినియోగదారుల సేవాకేంద్రాన్ని సంప్రదించి కొత్త కార్డు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌లో కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వెంటనే ఆయా వివరాల్ని తొలగించాలి. తప్పనిసరిగా వెబ్‌బ్రౌజర్‌లోని కుకీస్‌ను తొలగించిన తర్వాతే కంప్యూటర్‌ను ఆఫ్‌ చేయాలి. లేదంటే హ్యాకర్లు ఆ వివరాల్ని తస్కరించి కార్డులోని డబ్బులు కొట్టేసేందుకు అవకాశముంటుంది. తరచూ పలు వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఉంటే గనక ప్రతీ వెబ్‌సైట్‌కో పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం ఉత్తమం. ఒకవేళ సైబర్‌ నేరగాళ్లు ఒక పాస్‌వర్డ్‌ను కనిపెడితే గనక మిగిలిన ఖాతాలకు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కువ కాలం ఒకే పాస్‌వర్డ్‌ను వినియోగించకుండా

తరచూ మార్చేయాలి.
ఫిషింగ్‌ మెయిల్స్‌లో జాగ్రత్త: మీ ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాల్ని పసిగట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు ఫిషింగ్‌ ఇ-మెయిళ్లు పంపిస్తుంటారు. ‘కన్ఫర్మ్‌ యువర్‌ పేమెంట్‌, పర్చేజ్‌ అండ్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌’ అంటూ సందేశాలొస్తే అసలు నమ్మొద్దు.ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తరచూ యాంటీవైరస్‌, యాంటీ స్పైవేర్‌, ఫైర్‌వాల్‌ లాంటి భద్రమైన ఫీచర్లతో అప్‌డేట్‌ చేయాలి.
అవగాహనకు.. అనుమానాల నివృత్తికి..: ఆన్‌లైన్‌ షాపింగ్‌ లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నంబరు 18004256235లో సంప్రదించి సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.

లింక్‌లు క్లిక్‌ చేయొద్దు
ఆన్‌లైన్‌లో ఎక్కువగా దేని కోసం వెతికితే అందుకు సంబంధించిన లింక్‌ల మన కంప్యూటర్‌లోకి వస్తుంటాయి. తమ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే రాయితీలు, బహుమతులొస్తాయని ఆశ పెడుతుంటారు. పలు సందర్భాల్లో ఆ లింక్‌లు సైబర్‌ నేరగాళ్లకు సంబంధించినవి అయి ఉండే అవకాశముంటుంది. అందుకే రాయితీలు, బహుమతులు నిజమైనవేనా అని ఒరిజినల్‌ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసిన తర్వాతే ఆర్డర్‌ చేయడం మంచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.