close

తాజా వార్తలు

ఆ బెయిల్స్‌కి ఏమైంది? బంతి తాకినా పడట్లేదు

ఈ ప్రపంచకప్‌లో ఇది ఐదోసారి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఘటనలు ఒక్కోసారి ఫలితాలనే తారుమారు చేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన ఓ అంశం తాజాగా భారత్‌ X ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. గత కొన్నాళ్లుగా వికెట్లకు, వాటిపై ఉండే బెయిల్స్‌కు ఎల్‌ఈడీ లైట్స్‌ అమర్చిన విషయం తెలిసిందే. బంతి వికెట్లకు తాకినా కొన్నిసార్లు బెయిల్స్‌ కదలకపోవడంతో పాటు రనౌట్‌లు, స్టంపౌట్ల సమీక్షలకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే ఇటీవలి కాలంలో ఎల్‌ఈడీ అమర్చిన బెయిల్స్‌ కూడా బంతి తాకితే కిందపడటం లేదు. ఈ ప్రపంచకప్‌లోనే ఇప్పటివరకూ ఇలాంటి ఘటనలు ఐదు జరిగాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

భారత్‌ x ఆస్ట్రేలియా : 

ఓవల్‌ వేదికగా భారత్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఛేదనకు దిగిన డేవిడ్‌ వార్నర్‌ బుమ్రా వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికే బౌల్డయ్యాడు. డిఫెన్స్ ఆడబోయి బంతి బ్యాట్‌ అంచున తాకి లెగ్‌స్టంప్‌కు బలంగానే తగిలింది. అయితే బెయిల్స్‌ మాత్రం కదలకపోవడంతో వార్నర్‌ బతికిపోయాడు. అప్పటికి అతడు చేసింది ఒక్క పరుగే. 

ఇంగ్లాండ్‌ x బంగ్లాదేశ్‌ :

కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లాండ్‌ X బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లా బ్యాటింగ్‌ చేస్తుండగా అచ్చం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 46వ ఓవర్‌ వేసిన స్టోక్స్‌ బౌలింగ్‌లో సైఫుద్దీన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆ ఓవర్‌లో మూడోబంతి బ్యాట్స్‌మన్‌కు తాకి అది వికెట్లపై పడింది. బెయిల్స్‌ కదలలేదు, సైఫుద్దీన్‌ ఔటవ్వలేదు. 

న్యూజిలాండ్‌ x శ్రీలంక:

శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌లో కెప్టెన్‌ కరుణరత్నే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో బౌలింగ్‌ చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ నాలుగో బంతి కరుణరత్నే షాట్‌ ఆడబోయాడు. బంతి బ్యాట్‌కు తగిలి సరాసరి వికెట్లకు తగిలింది. కాగా బంతి తగిలిన అనంతరం వికెట్లపై ఉన్న బెయిల్స్‌ పైకి లేచి మళ్లీ అలాగే కుదురుకున్నాయి. ఏం జరిగిందో ఆటగాళ్లకి అర్థంకాలేదు. మొత్తానికి కరుణరత్నే ఔట్‌నుంచి తప్పించుకున్నాడు. 

ఆస్ట్రేలియా X వెస్టిండీస్‌: 

ఆస్ట్రేలియా X వెస్టిండీస్‌ మధ్య జరిగిన రసవత్తర పోరులోనూ క్రిస్‌గేల్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మిచెల్‌స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి గేల్‌ ఎల్బీ అయినట్టు అంపైర్‌ ఔటిచ్చాడు. బ్యాట్స్‌మన్‌ రివ్యూకి వెళ్లడంతో అందులో బంతి వికెట్లను ముద్దాడి వెళ్లినట్లు తేలింది. అయితే బెయిల్స్‌ పడకపోవడంతో పాటు ఆ బంతి ఎల్బీ కాదని తేలింది. దీంతో గెయిల్‌ ఒకే బంతికి రెండు ప్రమాదాలను తప్పించుకున్నాడు.

ఇంగ్లాండ్‌ X దక్షిణాఫ్రికా :

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేస్తుండగా అదిల్‌ రషీద్‌ 11వ ఓవర్‌ వేశాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న క్వింటన్‌ డికాక్‌ ఐదో బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్‌ అంచుకు తాకిన బాల్‌ స్టంప్స్‌ను కుదిపేస్తూ బౌండరీ చేరింది. అయితే బెయిల్స్‌ గాల్లోకి లేవడం లైట్స్‌ వెలుగొందడం చకచకా జరిగిపోయాయి. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వికెట్‌ తీసిన సంబరాల్లో మునిగిపోయారు. కాకపోతే బెయిల్స్‌ కిందపడకపోవడంతో డికాక్‌ నాటౌట్‌గా మిగిలాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.