close

తాజా వార్తలు

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ వీడ్కోలు

భారత క్రికెట్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన హీరో 

ముంబయి: భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్‌ కోసం తన రక్తం, స్వేదం ధారపోశానన్నారు. క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమే తన తదుపరి లక్ష్యమని ప్రకటించిన యువీ..  జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని తెలిపారు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పిందని యువరాజ్‌ తెలిపారు. 

అంతర్జాతీయ క్రికెట్‌ ప్రస్థానం

యువీ 2000 సంవత్సరం అక్టోబర్‌లో కెన్యాపై అరంగేట్రం చేసి 304 వన్డేలు ఆడాడు.  ఈ ఫార్మాట్‌లో 14 శతకాలతోపాటు 42 అర్ధశతకాలు సాధించాడు. వన్డేల్లో 8701 పరుగులు పూర్తిచేయగా.. 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో కటక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (150) చేశాడు.  2003 అక్టోబర్‌లో సొంత మైదానం మొహాలీలో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. మొత్తం 40 టెస్టులు ఆడి మూడు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 1900 పరుగులు పూర్తి చేశాడు. అలాగే  టీ20ల్లో 58 మ్యాచ్‌లు ఆడి 1177పరుగులు చేయగా 9 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్‌  ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.

2011 ప్రపంచకప్‌: ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌
2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే అదే సమయంలో క్యాన్సర్‌తో పోరాడినా ఎవరికీ చెప్పలేదు. ప్రపంచకప్‌ తర్వాత విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకున్న యువీ.. ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచాడు.

2007 సిక్సర్ల హీరో


 

తొలిసారి 2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి క్రికెట్‌ ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా 2007, 2011లలో రెండు ప్రపంచకప్‌(టీ20, వన్డే)లు సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు.

ఇక నా లక్ష్యం అదే..
క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక యువీ బలంగా తిరిగొచ్చినా నిలకడలేని ఆటతీరు తనపై ప్రభావం చూపింది. అయినా రాజీపడకుండా ఐపీఎల్‌లో రాణించాడు. వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించి ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, పుణె వారియర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల తరఫున ఆడాడు. రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇకపై క్యాన్సర్‌ బాధితులకు సాయమందించడమే తన లక్ష్యమని యువీ తెలిపాడు. 

అవార్డులు 
⇒ 2012లో భారత ప్రభుత్వం క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుతో, 2014లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. 

 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.