close

తాజా వార్తలు

నేరస్థులకే ‘లక్కూ’ లాటరీ..!

టిక్కెట్‌ కొనకుండానే రూ.కోట్లు గెలిచారంటూ సందేశం 

హైదరాబాద్‌: ఎక్కడైనా ఓ టికెట్‌కు లాటరీ తగిలిందనుకోండి.. ఆ టికెట్‌ కొన్నవారి పంట పండుతుంది.. విజేతకు రూ.లక్షల్లో, కోట్లలో సొమ్ము చేతికందుతుంది.. కానీ ఇక్కడంతా రివర్స్‌.. టికెట్‌ కొనకుండానే రూ.కోట్లలో లాటరీ గెలిచావంటూ కంగ్రాట్స్‌ చెబుతారు.. కేవలం ఫార్మాలిటీస్‌ కోసమంటూ కొంత మొత్తం కట్టాలంటారు..అలా ఎంత వీలైతే అంత దండుకుంటారు.. వెరసి లాటరీ టికెట్‌తో నిమిత్తం లేకుండా, దాన్ని కొనుగోలు చేయకుండానే రివర్స్‌లో జేబు గుల్లవుతుంది.. అదే సైబర్‌ నేరగాళ్ల లాటరీ మోసం. 
ప్రభు ఏనాడూ లాటరీ టికెట్‌ కొని ఎరగడు. కానీ అతడి మెయిల్‌కు శామ్‌సంగ్‌ లాటరీ గెలిచావని లండన్‌ నుంచి సందేశం వచ్చింది. రూ.రెండు కోట్ల లాటరీ డబ్బు త్వరలోనే చేతికి అందుతుందనేది సారాంశం. టికెట్‌ కొనకపోయినా, అలా సందేశం పంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియకపోయినా సరే ప్రభు ఎగిరి గంతేశాడు. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడు అయిపోతానని కలలు కన్నాడు. చేతికందే డబ్బుతో ఏ కారు కొనాలి..? ఎలాంటి ఇల్లు కట్టాలి..? అని ఊహల్లో తేలిపోయాడు. పొరపాటున వేరొకరితో లాటరీ గురించి చెబితే ఎక్కడ వాటా అడుగుతాడోనని ఎవరితోనూ చర్చించలేదు. అంతలోనే లండన్‌ నుంచి అతడి మెయిల్‌కు మరికొన్ని సందేశాలు వచ్చాయి. లాటరీ సొమ్ము అందాలంటే ఫార్మాలిటీస్‌ కింద తాము సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత రుసుం వేయాలనేది సారాంశం. అలా రూ.20వేలతో ప్రారంభమైన చెల్లింపులు రూ.పది లక్షల వరకు చేరాకా గానీ ప్రభుకు జ్ఞానోదయం కలగలేదు. తీరా మోసపోయాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కి మోసగాళ్లు కటకటాల పాలైనా అతడి చేతికి ఒక్క పైసా సొమ్ము తిరిగి అందలేదు. అలాంటి అవకాశం ఏ కోశానా లేదని పోలీసులే మొహమ్మీద చెప్పేయడంతో ప్రభు ఆశ వదులుకున్నాడు. 
ఇదీ సంగతి.. 
కూకట్‌పల్లి ఐడీఎల్‌ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థను నిర్వహించే ఓ వ్యాపారికి గతంలో రూ.తొమ్మిది కోట్ల లాటరీ గెలిచావంటూ మెయిల్‌ వచ్చింది. గతంలో తానో ఖరీదైన కారును కొనుగోలు చేసిన సందర్భంగా ఆ సంస్థకు ఇచ్చిన వివరాలను అక్రమ మార్గంలో రాబట్టిన నైజీరియన్లు తెలివిగా వ్యాపారిని బుట్టలో వేశారు. ఈక్రమంలో పలు దఫాలుగా రూ.1.48కోట్లను ఆర్టీజీఎస్‌, ఇతర మార్గాల ద్వారా తమ ఖాతాల్లో వేయించుకున్నారు. ఆ తర్వాత బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. 
కూకట్‌పల్లికే చెందిన ఓ మహిళను నైజీరియన్లు ఇలాగే బురిడీ కొట్టించారు. రూ.125కోట్ల లాటరీ తగిలిందంటూ ఫిబ్రవరి-ఏప్రిల్‌ మాసాల్లో ఆమె వద్ద రూ.49లక్షలు కాజేశారు. తన వద్ద అంత డబ్బు లేకపోయినా సన్నిహితుల వద్ద అప్పు చేసి మరీ ఆమె నైజీరియన్ల ఖాతాల్లో వేశారు. తీరా మోసపోయాక ఆమెకు అప్పు ఇచ్చిన సన్నిహితులు అక్టోబరులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. ఆమె చెప్పిన వివరాలతో మహంకాళి పోలీసులు దిల్లీ నుంచి పాట్రిక్‌ ఓక్వాకిన్స్‌, ఫెస్టన్‌ ఐటె అనే నైజీరియన్లను అప్పట్లోనే అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. కానీ బాధితురాలికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. 
ముమ్మాటికీ అత్యాశే..! 
తొలినాళ్లలో ఎక్కువగా నైజీరియన్‌ నేరగాళ్లే ఈ మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం ఎల్లలు దాటి అన్ని రకాల నేరగాళ్లు ఇలాంటి వలేస్తున్నారు. జంటనగరాల్లో తరచూ ఇలా లాటరీల పేరిట మోసాలకు వెలుగుచూస్తున్నా సరే మోసపోతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. బాధితుల అత్యాశే ఇందుకు కారణమని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్‌ఫోన్‌కో లేక మెయిల్‌కో లాటరీ గెలిచిన సందేశం వచ్చినట్లు మిత్రులతో బాధితులు పంచుకోకపోవడం వల్లే నైజీరియన్లు సులభంగా మోసం చేయగలుగుతున్నారు.  బాధితులు నిండా మునిగేవరకు విషయం బయటికి పొక్కడం లేదు. లాటరీ బాధితుల్లో ఇలా అత్యాశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకుంటున్న వారే ఎక్కువ శాతం ఉంటున్నారు. మరోవైపు బాధితుడు అత్యాశపరుడని గుర్తిస్తేనే నేరస్థులు మోసాల పరంపరలో ముందడుగు వేస్తుండటం గమనార్హం. తాము పంపే సందేశాలకు తిరిగి సమాధానమిచ్చే బాధితులనే అత్యాశపరులుగా గుర్తిస్తూ బుట్టలో వేస్తున్నారు. అనంతరం ‘టాక్స్‌ క్లియరెన్స్‌’, ‘యాంటీ టెర్రరిస్ట్‌ ఫండ్‌’, ‘ఆర్‌బీఐ టాక్స్‌ పేయింగ్‌’.. ఇలా ఏ పేరు మదిలో మెదిలితే ఆ పేర్లతో డబ్బులు దండుకుంటున్నారు. 
నైజీరియన్లనకు చిక్కితే అంతే..! 
రకరకాల పద్ధతుల్లో బాధితుల డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా తాము సూచించిన బ్యాంకు ఖాతాల్లో/వ్యాలెట్లలో వేయించుకుంటున్న నైజీరియన్లు.. ఆ వెంటనే డబ్బును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేస్తూ నయా పైసా నిల్వ ఉండకుండా చూసుకుంటున్నారు. అలా కొల్లగొట్టిన సొమ్ముతో దుస్తులు కొని ఓడల ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. లేదా ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, హవాలా మార్గాల్లో పంపించేస్తున్నారు. ఒకవేళ పోలీసులు పరిశోధన జరిపి కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా తమను పట్టుకున్నా డబ్బు దొరక్కుండా ఈ తరహా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాము కేసుల పాలై జైలుకెళ్లినా గరిష్ఠంగా మూడు నెలల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చే అవకాశముండటంతో తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు. ఓసారి సైబరాబాద్‌ పోలీసులు దిల్లీ నుంచి ఇద్దరు నైజీరియన్లను లాటరీ మోసాల కేసులో పట్టుకొచ్చినపుడు వారి వద్ద రూ.20వేలు మాత్రం దొరికాయి. పోలీసులు వారం రోజులు అక్కడే మకాం వేసి వారిని పట్టుకొచ్చేందుకు అయిన ఖర్చు రెట్టింపు కావడం గమనార్హం. ఆరేళ్ల కాలంలో బాధితులు పోగొట్టుకున్న సొత్తు సుమారు రూ.అయిదు కోట్ల వరకు ఉన్నా.. ఏ ఒక్క బాధితుడికీ సొత్తు పూర్తిగా తిరిగి రాకపోవడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.