close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

 

 మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ అద్వితీయ విజయం సాధించింది. దాయాది జట్టును 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఆ జట్టుపై  ఇది ఏడో విజయం. సీనియర్లు కొనసాగిస్తున్న రికార్డును కోహ్లీసేన మరింత ముందుకు తీసుకువెళ్లింది. వర్షం కారణంగా పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా నిర్ణయించారు. టీమిండియా బౌలర్లు విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లతో దెబ్బకొట్టడంతో పాక్‌ 212/6కు పరిమితమైంది. ఫకర్‌ జమాన్‌ (62), బాబర్‌ ఆజామ్‌ (48), ఇమాద్‌ వసీమ్‌ (46*) రాణించారు. అంతకుముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(140; 113బంతుల్లో 14×4, 3×6) శతకంతో, కోహ్లీ (77; 65 బంతుల్లో 7×4), కేఎల్‌ రాహుల్‌ (57; 78 బంతుల్లో 304, 2×6) దూకుడుగా ఆడటంతో భారత్‌ 336 పరుగులు చేసింది. ఛేదనలో పాక్‌ 35 ఓవర్లకు 166/6తో నిలిచింది. ఆ సమయంలో వర్షం కురిసింది. దీంతో లక్ష్యాన్ని కుదించారు. 

హిట్‌మ్యాన్‌ షో..
భారత ఇన్నింగ్‌లో హిట్‌మ్యాన్‌ కీలకపాత్ర పోషించాడు. కేఎల్‌ రాహుల్‌(57; 78బంతుల్లో 3×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్‌  ఆరంభించిన రోహిత్‌.. ఆరంభం నుంచే పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఒకవైపు రాహుల్‌ ఇబ్బంది పడుతుంటే, రోహిత్‌ మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. ఈ క్రమంలోనే షెహదాబ్‌ వేసిన 12ఓవర్‌ చివరి బంతికి బౌండరీ సాధించి అర్ధశతకం చేరుకున్నాడు. తర్వాత దూకుడు పెంచిన రాహుల్‌ కూడా 22ఓవర్‌లో అర్ధశతకం అందుకున్నాడు. కానీ కాసేపటికే వాహబ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే ప్రయత్నంలో బాబర్‌ చేతికి చిక్కాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్‌ను నిలబెట్టాడు. అదే జోరులో 30ఓవర్‌లో రోహిత్‌ శతకం అందుకున్నాడు. అది కూడా కేవలం 85బంతుల్లోనే అందుకోవడం విశేషం. తర్వాత కూడా దూకుడుగా ఆడిన రోహిత్‌‌.. సెంచరీకి మరో 40పరుగులు జోడించి హసన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హార్ధిక్‌ పాండ్య(26; 19బంతుల్లో 2×4, 1×6) క్రీజులో ఉన్నంత వరకు మెరిపించి ఆమిర్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. ధోనీ(1) నిరాశ పరిచాడు. అప్పటికి భారత్‌ స్కోరు 4 వికెట్లకు 298. 

వరుణుడు ఆట మొదలు..
ముందు నుంచే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్లుగానే భారత ఇన్నింగ్‌ 46.4 ఓవర్‌లో వరుణుడు అతిథిలా వచ్చేశాడు. కాసేపు చిరుజల్లులు రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. కోహ్లీ అప్పటికీ క్రీజులో ఉండటంతో భారీ స్కోరుపై ఆశలు మెరుగ్గానే కనిపించాయి. కానీ వర్షం ముగిశాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో 7పరుగులు మాత్రమే జోడించి ఆమిర్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. చివర్లో విజయ్‌ శంకర్‌(15నాటౌట్‌), కేదార్‌ జాదవ్‌(9నాటౌట్‌) ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో భారత్‌ పోరాటం 336 పరుగుల వద్ద ముగిసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.