close

తాజా వార్తలు

అఫ్గాన్‌కు ఇంగ్లాండ్‌ లక్ష్యం 398

విధ్వంసం  సృష్టించిన ఇయాన్‌ మోర్గాన్‌, బెయిర్‌ స్టో, జో రూట్‌, మొయిన్‌ అలీ

మాంచెస్టర్‌: ఈ ప్రపంచకప్‌లో వరుణుడు వాన కురిపిస్తుంటే ఇంగ్లాండ్‌ మాత్రం పరుగుల వరద పారిస్తోంది. ప్రస్తుత మెగా టోర్నీలో అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్‌ ముందు కొండంత లక్ష్యం నిలిపింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 397 పరుగులు సాధించింది. మ్యాచ్‌ను ఏకపక్షం చేసేసింది. ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ (148; 71 బంతుల్లో 4×4, 17×6) ఊచకోతకు రికార్డులెన్నో బద్దలయ్యాయి. సిక్సర్ల మోత మోగించాడు.  అతడితోపాటు ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (90; 99 బంతుల్లో 8×4, 3×6), జో రూట్‌ (88; 82 బంతుల్లో 5×4, 1×6), మొయిన్‌ అలీ (31*; 9 బంతుల్లో 1×4, 4×6) విధ్వంసం సృస్టించారు. అఫ్గాన్‌ బౌలర్లు అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశారు.

మెల్లగా మొదలైంది

 

ఇంగ్లాండ్‌ తొలి పది ఓవర్లలో 46 పరుగులు చేసి ఓ వికెట్‌ చేజార్చుకుంది. ఓపెనర్‌ జేమ్స్‌ విన్సి (26) జట్టు స్కోరు 44 వద్ద వెనుదిరిగాడు. అఫ్గాన్‌కు అదొక్కటే సంతోషం! ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితి. అప్పటి వరకు నెమ్మదిగా ఆడుతున్న బెయిర్‌స్టో సహచరుడు జో రూట్‌ సహకారంతో వేగంగా ఆడి అర్ధశతకం అందుకున్నాడు. రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బౌండరీలు, సిక్సర్లతో భారీ విధ్వంసానికి శంఖారావం పూరించాడు. అయితే శతకానికి చేరువైన అతడిని 30వ ఓవర్లో గుల్బదిన్‌ నయీబ్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 164.

సుడిగాలిలా..

 

క్రీజులోకి రావడమే ఆలస్యం సారథి ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్లు బాదడం మొదలుపెట్టాడు. దీంతో రూట్‌ స్ట్రైకింగ్‌కు పరిమితం అయ్యాడు. మోర్గాన్‌ రెచ్చిపోయాడు. 36 బంతుల్లో అర్ధశతకం 67 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇది నాలుగో అత్యంత వేగవంతమైన శతకం. అప్పటికే అతడు 11 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్‌ 43.5 ఓవర్లకు 300 స్కోరు అందుకుంది. శతకం తర్వాత మరింత చెలరేగాడు మోర్గాన్‌. ఎడాపెడా సిక్సర్లు బాదాడు. అతడి ధాటికి అఫ్గాన్‌ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచలేదు. తన ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు బాదేశాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించాడు. క్రిస్‌గేల్‌ (16 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (16) ఘనతను తుడిచిపెట్టాడు. మరోవైపు రూట్‌ సైతం అర్ధశతకం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. జట్టు స్కోరు 350 దాటిన తర్వాత గుల్బదిన్‌ నయీబ్‌ వేసిన 47వ ఓవర్లో  వీరిద్దరూ పెవిలియన్‌ చేరారు. బెన్‌స్టోక్స్ (2), బట్లర్‌ (2) విఫలమైనా చివర్లో మొయిన్‌ అలీ తనదైన శైలిలో భారీ సిక్సర్లు బాది స్కోరు 397కు చేర్చాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి అతడు 1 పరుగే చేశాడు. లేదంటే స్కోరు 400కు చేరేదే.

పాపం రషీద్‌

 

అఫ్గాన్‌ బౌలర్లు చెత్త రికార్డులను మూట గట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు ఎంత మంచి పేరుందో అందరికీ తెలిసిందే. అలాంటిది అతడు కెరీర్‌లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. 9 ఓవర్లలో 12.22 ఎకానమీతో 110 పరుగులు ఇచ్చాడు. ఒక్కవికెట్‌ తీయలేదు. ప్రపంచకప్‌లో ఇదో చెత్త రికార్డు. గుల్బదిన్‌ నయీబ్‌ (3/68), ముజీబ్‌ (0/44) మినహా అందరూ ఇంగ్లాండ్‌ బ్యాటర్ల ఊచకోతకు బలయ్యారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.