close

తాజా వార్తలు

ఏమైంది.. ఎందుకిలా ఆడుతున్నారు?
ప్రస్తుత ప్రపంచకప్‌లో కొన్ని జట్లు అపజయాలు లేకుండా దూసుకెళ్తుంటే.. మరికొన్ని విజయాల కోసం పరితపిస్తున్నాయి. పోరాట పటిమ చూపించకుండా ప్రత్యర్థులకు లొంగిపోయే కొన్ని జట్లుంటే.. మరికొన్ని మాత్రం ఆఖరి బంతి వరకు పోరాడుతున్నాయి. ఆసీస్‌పై బంగ్లా, భారత్‌పై ఆఫ్గాన్‌, న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ చేసిన పోరాటం.. ఆద్యంతం అద్భుతం, అమోఘం. ప్రతి జట్టులోనూ హీరోలున్నారు. వారు విజృంభిస్తే మ్యాచ్‌ రూపురేఖలే మారిపోతాయి. కానీ వారు ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆశించిన రీతిలో రాణించట్లేదు. వారందరిని ఒక జట్టుగా తీస్తే ? ఆ టీమ్ ఎలా ఉంటుందంటే..

ఓపెనర్లు ఆమ్లా, గేల్‌..

దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ప్రపంచకప్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. దశాబ్దం నుంచి సఫారీల జట్టులో హషీమ్‌ ఆమ్లా ఎంతో నిలకడగా రాణిస్తూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ ఈ ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశపరిచాడు. తన కెరీర్‌లో మూడో ప్రపంచకప్‌ ఆడుతున్న ఆమ్లా తన మార్క్‌ ఇన్నింగ్స్‌ను ఒక్కటి కూడా ఆడలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 13, 6, 6, 41*, 2 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు. 

యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌కు బ్యాట్‌ కనెక్ట్‌ అయితే ప్రత్యర్థుల బౌలర్లకు వణుకే. ఐదో ప్రపంచకప్‌ ఆడుతున్న గేల్‌ తన అసలైన పంజా ఇప్పటి వరకు విసరలేదు. ఒక్క న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులతో రాణించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో 0, 36, 21, 50 పరుగులు మాత్రమే చేశాడు. సాంకేతికంగా వెస్టిండీస్‌ సెమీస్‌ రేసులో ఇంకా ఉండటంతో గేల్‌పై అభిమానులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు.    

పేలవంగా లంక మిడిలార్డర్‌

శ్రీలంక టాప్‌ఆర్డర్ భారాన్ని ఎన్నో మ్యాచ్‌ల్లో మోస్తున్న తిరుమానె ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వాటిలోనూ కేవలం 45 పరుగులే చేశాడు. సంగక్కర, జయవర్దనె రిటైర్మెంట్‌ తర్వాత ఏంజెలో మాథ్యూస్‌ జట్టు బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అనుభవజ్ఞుడిగా  ఎన్నో విజయాలను అందించాడు. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ మినహాయిస్తే అతడు చేసింది 9 పరుగులు మాత్రమే. న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌పై అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఆల్‌రౌండర్‌ రసెల్‌.. వికెట్‌కీపర్‌ సర్ఫరాజ్‌

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో బౌలర్లకు పీడకలగా మారిన కరీబియన్‌ ధీరుడు ఆండ్రూ రసెల్‌  ప్రస్తుత ప్రపంచకప్‌లో బ్యాట్‌ ఝుళిపించలేకపోతున్నాడు. తనకు బ్యాటింగ్‌ అవకాశం వచ్చిన మూడు ఇన్నింగ్స్‌లో 0, 15, 21 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఆసీస్‌పై రెండు వికెట్లు, బంగ్లాదేశ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా పేరున్న రసెల్‌ ఈ మెగాటోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. చివరికి గాయం కారణంగా ప్రపంచకప్‌కే దూరమయ్యాడు. 
పాకిస్థాన్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన బ్యాటింగ్‌ తడాఖా చూపలేకపోతున్నాడు. అభిమానుల నుంచి చేదు అనుభువాలు ఎదుర్కొంటున్న అతడు ఈ ప్రపంచకప్‌లో 117 పరుగులే చేశాడు. 2017లో ఛాంపియన్‌ ట్రోఫీని అందుకున్న రీతిలో ఈ టోర్నీలోనూ రాణించాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాపై విజయంతో పాక్‌ సెమీస్‌ అవకాశాలు ఇప్పటికి సజీవంగానే ఉన్నాయి.

బంతి తిప్పని ‘రషీద్‌’ ద్వయం

అతి కొద్ది కాలంలోనే అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్ స్టార్ ప్లేయర్‌గా మారాడు. రషీద్‌పై ఈ ప్రపంచకప్‌లో అభిమానులు, విశ్లేషకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను రషీద్‌ అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టి అందరిని నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. 
ఇంగ్లాండ్‌ జట్టులో ఆదిల్‌ రషీద్ నాణ్యమైన స్పిన్నర్‌.  జట్టు యాజమాన్యం అతడిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే అవకాశాలను ఇచ్చింది. కానీ అతడు ఈ మెగా టోర్నీలో ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టి అభిమానులను, యాజమాన్యాన్ని నిరాశపరిచాడు.

ప్రమాదకరంగా లేని పేస్‌..

వాహబ్ రియాజ్‌కు ప్రపంచంలోని ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడిగా పేరు. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మెన్‌కు తన తడాఖాను చూపించట్లేదు. వైవిధ్యమైన బంతులు, యార్కర్లు వెయ్యడంలో సిద్ధహస్తుడైన రియాజ్ ఈ టోర్నీలో ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. పాక్‌ మరో పేసర్‌ హసన్‌ అలీ కేవలం రెండు వికెట్లు తీసి తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. 
బంగ్లాదేశ్ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా బౌలింగ్‌ సత్తా ఏంటో క్రికెట్‌ ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జట్టుని ముందుండి నడిపిస్తూ విజయాలను అందుకుంటున్న అతడు  బౌలింగ్‌లో అంతగా రాణించడం లేదు. కేవలం ఒకే ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టడం గమనార్హం.

 - ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.