close

తాజా వార్తలు

ఇంగ్లాండ్‌ నిలిచేనా.. పాక్‌ గెలిచేనా?

రసవత్తరంగా మారిన ప్రపంచకప్‌ నాకౌట్ అవకాశాలు

ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రపంచకప్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చప్పగా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు ఉత్కంఠగా మారాయి. నాకౌట్‌ దశ సమీపిస్తుండటంతో తొలి నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు సెమీస్‌ చేరడం కష్టమేమీ కానప్పటికీ తదుపరి ఆడే మ్యాచ్‌లు వాటికి కీలకంగా మారనున్నాయి. కాగా నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌పైనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

 ఇంగ్లాండ్‌ పరిస్థితి?

ఆతిథ్య జట్టు అభిమానులు ఆందోళన చెందడంలో అర్థముంది. క్రికెట్‌ కనిపెట్టిన దేశం ఇప్పటివరకూ ప్రపంచకప్‌ గెలవలేదు. దీంతో ప్రస్తుత మోర్గాన్‌సేనపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు అత్యంత ఫెవరెట్‌ జట్టుగా పేరొందినా.. పాకిస్థాన్, శ్రీలంక జట్లతో ఓటమిపాలవ్వడం ఇబ్బందిగా మారింది. ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటములతో ఎనిమిది పాయింట్లు సాధించింది. తదుపరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌ లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. కాగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఈ టోర్నీలో ఓటమిలేకుండా దూసుకుపోతున్నాయి. అలాగే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ మూడు జట్లపైనా ఆతిథ్య జట్టకు చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం మరోసారి ఆ జట్టుకు ఆశా భంగమే కానుంది.

బంగ్లా గర్జించేనా?

బంగ్లాదేశ్‌ పులులు గర్జిస్తున్నాయి. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా మూడింటిలో గెలిచి మరో మూడు ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌ల్లో భారత్‌, పాకిస్థాన్‌ లాంటి బలమైన జట్లతో పోటీపడాల్సి ఉంది. ఈ రెండింటిలో బంగ్లా గనుక గెలిచి.. మరోవైపు ఇంగ్లాండ్‌ మూడు మ్యాచ్‌లు ఓడిపోతే బంగ్లా పులులు సెమీస్‌ చేరే అవకాశముంది. కానీ అలా గెలవాలంటే దాయాదులతో అనూహ్యంగా నెగ్గుకురావాలి. అయితే బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకుంటే మాత్రం భారత్‌, పాకిస్థాన్‌లకు చుక్కలు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమదైన రోజు ఎంతటి జట్టునైనా ఓడించగల చరిత్ర బంగ్లా జట్టుకు ఉంది. 

పాకిస్థాన్‌ నిలిచేనా?

భారత్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ తిరిగి పుంజుకుంది. దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ప్రపంచకప్‌ నుంచి సాగనంపి ఇంకా టోర్నీపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓటమిపాలవ్వగా.. ఓ మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న సర్ఫరాజ్‌సేన.. న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. అలా గెలిస్తే మొత్తం 11 పాయింట్లతో నాకౌట్‌ చేరొచ్చు. కాగా అదే సమయంలో ఇంగ్లాండ్‌ ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెందితేనే పాకిస్థాన్‌కు అవకాశముంటుంది. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌.. బలంగా ఉన్న న్యూజిలాండ్‌ని ఓడించడం అంత తేలికకాదు. అయినప్పటికీ గట్టిగా పోరాడితేనే విజయం దక్కే అవకాశాలు ఉంటాయి.

శ్రీలంకా.. విండీసా?

శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు చెరో ఆరు మ్యాచ్‌లు ఆడాయి. శ్రీలంక రెండు, విండీస్‌ ఒకటి గెలిచాయి. కాగా వర్షం వల్ల లంక ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు.. విండీస్‌ ఆడాల్సిన ఒక మ్యాచ్‌ రద్దయింది. ప్రస్తుతం లంక ఆరు పాయింట్లతో కొనసాగుతుండగా.. మిగతా మ్యాచ్‌ల్లో సంచలనాలు సృష్టించాలి. దాంతో పాటు నాలుగో స్థానంలో ఉండే జట్టు కన్నా మెరుగైన రన్‌రేట్‌ సాధించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఈ జట్టు నాకౌట్‌ చేరుతుంది. ఇక విండీస్‌ మూడు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ జట్టు సెమీస్‌ చేరాలంటే తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.