close

తాజా వార్తలు

భారత క్రికెట్‌ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది!

అది 1983 ప్రపంచకప్‌. ఆ జట్టుపై ఎవరికి.. ఎక్కడా అస్సలు అంచనాలు లేవు. ప్రత్యర్థులు అరవీర భయంకరులు. వివియన్‌ రిచర్డ్స్‌ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులు వెయ్యడంలో నువ్వా నేనా అంటూ..  జోయెల్‌ గార్నర్‌, మాల్కమ్‌ మార్షల్‌, డెనిస్‌ లిల్లీ పోటీ పడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ పరుగుల యంత్రంగా జావెద్‌ మియాందాద్‌ పేరు పొందుతున్నాడు. ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా ఆ జట్టు అదరలేదు.. బెదర లేదు. ‘ధైర్యమే మన ఆయుధం, సమష్టితత్వం మన బలం’ అంటూ మెగా టోర్నీలో అండర్‌డాగ్స్‌లా అడుగుపెట్టింది. పసికూనలా దిగి ప్రత్యర్థులపై సింహనాదం చేసింది. చివరికి జగజ్జేతగా నిలిచింది. ప్రపంచమంతా ఆ జట్టు ప్రదర్శన చూసి నివ్వెరపోయింది. ఇప్పటికే అర్థమైపోయిందనుకుంటా.. అది భారత్‌ జట్టు అని. కపిల్‌సేన క్రికెట్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని నేటికి సరిగ్గా 36 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రపంచకప్‌ జరుగుతున్న సందర్భంగా ఆనాటి విశేషాలను ఓసారి గుర్తుచేసుకుంటూ తొలి ప్రపంచకప్‌ రుచిని మన దేశానికి అందించిన కపిల్‌ సేన ప్రయాణం ఎలా సాగిందో ఒక సారి చూద్దాం..! 

తొలి విజయం
తేది: జూన్‌ 9, మైదానం: మాంచెస్టర్‌, ప్రత్యర్థి: వెస్టిండీస్‌
భారత్‌కు తొలి మ్యాచ్‌ వెస్టిండీస్‌తో. అప్పటి కరీబియన్లను చూస్తే ప్రత్యర్థి జట్లన్నింటికీ వెన్నుల్లో వణుకే. విండీస్‌ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. యశ్‌పాల్‌ శర్మ (89, 120 బంతుల్లో 9×4) అద్భుత ఇన్నింగ్స్‌కు సందీప్‌ పాటిల్‌ (36) చక్కని సహకారం తోడవ్వడంతో.. టీమిండియా నిర్ణీత 60 ఓవర్లలో 262 పరుగులు చేసింది. అప్పట్లో 263 లక్ష్యం అంటే అంత సులువు కాదు. రోజర్‌ బిన్నీ (12-1-48-3), రవి శాస్త్రి (5.1-0-26-3) విజృంభించడంతో విండీస్‌ 228 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించి.. టోర్నీలో తొలి గెలుపు రుచిని చూసింది. 

జింబాబ్వేపై గెలుపు
తేది: జాన్‌ 11, మైదానం: లీసెస్టర్‌, ప్రత్యర్థి: జింబాబ్వే
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఓడించామనే రెట్టింపు ఉత్సాహంతో జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది భారత్‌. టాస్‌ గెలిచిన కపిల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ బౌలర్లు బెంబేలెత్తించడంతో జింబాబ్వే 155 పరుగులకే చాప చుట్టేసింది. మదన్‌లాల్‌ (10.4-0-27-3), రోజర్‌ బిన్నీ (11-2-25-2) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. సందీప్‌ పాటిల్‌ (50, 54 బంతుల్లో 7×4, 1×1), అమర్‌నాథ్‌ (44, 79 బంతుల్లో 4×4) రాణించడంతో 37 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో భారత్‌ ఖాతాలో మరోవిజయం పడింది.

హ్యాట్రిక్‌ మిస్‌!
తేది: జూన్‌ 3, మైదానం: నాటింగ్‌హామ్‌, ప్రత్యర్థి: ఆస్ట్రేలియా
హ్యాట్రిక్‌ విజయాలు అందుకోవాలనుకున్న భారత్‌ను ఆసీస్‌ దెబ్బ కొట్టింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ కిమ్‌ హ్యూస్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. ట్రెవర్‌ చాపెల్‌ (110, 131 బంతుల్లో 11×4) శతకం బాది భారత్‌కు 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చాడు. కపిల్‌ (12-2-43-5) బంతితో మెరిసినా ఇతరుల నుంచి సహకారం అందకపోవడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 158 పరుగులకే ఆలౌటైంది. కపిల్‌ (40, 27 బంతుల్లో 2×4, 1×1) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది. కెన్‌ మాక్లే (11.5-3-39-6) భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

మరో ఓటమి
తేది:జూన్‌ 15, మైదానం: ఓవెల్‌, ప్రత్యర్థి: వెస్టిండీస్‌ 
వెస్టిండీస్‌ ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఈ సారి విండీస్‌ కెప్టెన్ క్లైవ్‌ లాయిడ్‌ టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వివియన్‌ రిచర్డ్స్‌ (119, 146 బంతుల్లో 6×4, 1×1) శతకంతో చెలరేగగా విండీస్‌ 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 216 పరుగులకే కుప్పకూలింది. అమర్‌నాథ్‌ (80; 139 బంతుల్లో) పోరాటం వృథాగా మారింది. ఆదిలోనే ఓపెనర్లను కోల్పోవడం, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ గాయంతో బ్యాటింగ్‌ మధ్యలోనే నిష్ర్కమించడం.. భారత్‌ ఓటమికి కారణమయ్యాయి. 

చరిత్రలో ఓ మైలురాయి
తేది: జూన్‌ 18, మైదానం: ట్రెంట్‌బ్రిడ్జ్‌, ప్రత్యర్థి: జింబాబ్వే 
వరుసగా రెండు ఓటములను చవిచూసిన భారత్‌ జింబాబ్వేపై విజయం సాధించి సెమీస్‌ రేసులో నిలబడింది. జింబాబ్వే పోరులో కపిల్‌ దేవ్‌ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌ ప్రపంచం మరవలేనిది. 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని కపిల్‌ ఆదుకున్న తీరు మాటల్లో వర్ణించలేనిది. ఒంటరిగా కపిల్‌ పోరాడుతున్నా.. జింబాబ్వే బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ స్కోరు 77/7కు చేరింది.  కపిల్‌ అద్భుత పోరాటంతో శతకం చేసి జింబాబ్వేకు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఫ్లెచర్‌ సేన లక్ష్యాన్ని ఛేదించలేక 235 పరుగులకే ఆలౌటైంది. 138 బంతుల్లో 175* పరుగులు బాదిన కపిల్‌ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కపిల్‌ ఇన్నింగ్స్‌ చరిత్రలో ఓ మైలురాయి.  

ప్రతీకారం నెరవేరింది
తేది: జూన్‌ 20, మైదానం: చెమ్స్‌ఫర్డ్‌, ప్రత్యర్థి: ఆస్ట్రేలియా 
ఆసీస్‌ కొట్టిన దెబ్బకు భారత్‌ తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఆసీస్‌ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. కపిల్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి ఆసీస్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్.. భారత్‌ బౌలర్ల ధాటికి 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మదన్‌లాల్‌ (8.2-3-30-4), రోజర్‌ బిన్నీ (8-2-29-4) చెలరేడంతో కంగారూలు సెమీస్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయారు. 

‘అమర్‌’ విజయం
సెమీస్‌, తేది: జూన్‌ 22, మైదానం: మాంచెస్టర్‌, ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌
బలమైన ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడమంటే ఆషామాషీ కాదు. భారత్‌ కథ ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంగ్లాండ్‌పై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 213 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సమష్టిగా రాణించి 32 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అమర్‌నాథ్‌ (49, 27/2) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో భారత్‌ తొలిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. 

జగజ్జేతగా భారత్‌
ఫైనల్‌, తేది: జూన్‌ 25, మైదానం: లార్డ్స్‌, ప్రత్యర్థి: వెస్టిండీస్‌
సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై డిఫెండిగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. దీంతో పసికూనగా బరిలోకి దిగిన భారత్‌తో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. అందరూ గెలిచేది విండీస్‌ జట్టే అన్నారు. కానీ, టోర్నీలో కరీబియన్లను ఓడించిన ఏకైక జట్టు భారత్‌ మాత్రమే. టాస్‌ గెలిచిన క్లైవ్‌ లాయిడ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో విండీస్‌కు భారత్‌ 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించగలిగింది. మూడో టైటిల్‌ కూడా విండీస్‌కే అని భావించారంతా. 
అయినా భారత్‌ జట్టు ఓటమిని అంగీకరించలేదు. విండీస్‌ భీకర ఓపెనర్లు అయిన గ్రీనిడ్జ్‌ (1), హేన్స్‌ (13)ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అయినా అప్పటికీ ఫేవరేట్‌ విండీసే. దీనికి కారణం ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌ రిచర్డ్‌సన్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మదన్‌లాల్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా అతడు భారీ షాట్‌ కొట్టాడు. కపిల్‌ వెనక్కి పరిగెడుతూ బౌండరీలైన్‌ సమీపంలో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఒక్కసారిగా స్టేడియమంతా వందేమాతరం నినాదాలతో మార్మోగింది. ఇక భారత్‌ బౌలర్లు వెనక్కి చూడలేదు. నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే వెస్టిండీస్‌ జట్టు పేకమేడలా కుప్పకూలింది. లార్డ్స్‌ మైదానంలో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ అందుకున్న తొలి భారత్‌ కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ రికార్డు సృష్టించాడు. ఆ మధుర క్షణానికి నేడు సరిగ్గా 36 ఏళ్లు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.