close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో ‘f2’

హీరోతో ఫైట్స్‌, ఛేజింగ్‌ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించినా, నటీనటులు స్టెప్పులతో అదరగొట్టినా అభిమానులకు సంతృప్తి ఉండదు. వినోదం కోసం వెళ్లే సినిమా వినోదభరితంగా అనిపించకపోతే ఎలా?అనే రీతిలో ఆలోచిస్తారు వారు. క్రికెట్‌లోనూ అంతే. పరుగుల వరద పారిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు బౌలర్లు ముకుతాడు వెయ్యడం, కవ్విస్తున్న బౌలర్లకు బ్యాట్స్‌మెన్‌ బౌండరీలతో సమాధానం చెప్పడం రొటీన్‌. అంతకు మించిన వినోదం కోరుకుంటున్న క్రికెట్‌ అభిమానులకు ప్రస్తుత ప్రపంచకప్‌ ఎన్నో సరదా సన్నివేశాలతో ఆహ్లాదాన్ని పంచింది. అవి ఏంటంటే..  

సారీ అంపైర్‌!
ఎవరైనా సెంచరీ సాధిస్తే హెల్మెట్‌ తీసి బ్యాట్‌తో అభిమానులకు వందనం చేస్తారు. కానీ బంగ్లాదేశ్‌×ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో శతకం సాధించిన ఆనందంలో జేసన్‌ రాయ్‌ అంపైర్‌ను ఢీకొట్టాడు. అతడు 96 పరుగులతో ఉన్నప్పుడు డీప్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా బౌండరీ బాదాడు. బౌండరీవైపు చూస్తూ పరిగెడుతున్న అతడు అంపైర్‌ని గమనించక ఢీకొట్టాడు. రాయ్‌ను అభినందించటానికి లేచి నిలబడిన జట్టు సభ్యులు ఇది చూసి విరగబడి నవ్వుకున్నారు. రాయ్‌ అంపైర్‌ను లేపి పరామర్శించిన తర్వాత బ్యాట్‌ను ప్రేక్షకులకు చూపించాడు.

సిక్సర్‌ కాదు.. వికెట్‌!
బ్యాట్స్‌మెన్‌ను పేసర్‌ బౌల్డ్‌ చేస్తే సాధారణంగా వికెట్‌ దూరంగా ఎగిరిపడటం జరుగుతుంది. అదే బౌలర్‌ నిప్పులు చెరిగే బంతులు విసిరితే కొన్నిసార్లు వికెట్‌ విరిగిపోతుంది. కానీ ఇంగ్లాండ్‌ × బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. జోఫ్రా ఆర్చర్‌ 143 కి.మీ వేగంతో విసిరిన బంతిని సౌమ్య సర్కార్‌ అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆఫ్‌స్టంప్‌ను తాకిన ఆ బంతి నేరుగా బౌండరీ అవతల పడింది. ఈ వీడియోను ఐసీసీ ట్విటర్‌ వేదికగా పంచుకోగా క్రికెట్‌ అభిమానులంతా ‘ఇదేం బౌలింగ్‌రా బాబు’, ‘ఆర్చర్‌ సిక్సర్‌కు సౌమ్య ఔట్‌’ అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు. 

కూల్‌ ఆవలింత!
భారత్, పాక్‌ మధ్య పోరు అంటే ప్రపంచమంతా ఉత్కంఠే. అభిమానులంతా కనురెప్ప వాల్చకుండా బంతి బంతిని ఆస్వాదించే మ్యాచ్ ఇది. అభిమానులే ఇలా ఉంటే ఆటగాళ్లు, జట్టు సారథి ఎలా ఉండాలి? కానీ ఈ మ్యాచ్‌లో పాక్‌ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆవలించిన సన్నివేశం క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేనిది. భారత్ బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా వికెట్‌ కీపింగ్ చేస్తున్న సర్ఫరాజ్‌ మ్యాచ్‌ మధ్యలో ఆవలించాడు. ఇది కెమెరా కంటికి చిక్కింది. ఇంకేముంది నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపించారు. ‘ఇంత ఒత్తిడిలోనూ చాలా ప్రశాంతంగా ఆవలిస్తున్న నువ్వు నిజమైన మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌’, ‘హీ ఈజ్‌ ది మిస్టర్‌కూల్‌ కెప్టెన్‌ ఫర్‌ ఎవర్‌’ అంటూ కామెంట్లు చేశారు.

రోహిత్‌ చిరునవ్వు
దాయాదులతో జరిగిన పోరులో మరో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పాక్‌పై భారత్‌ 89 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (140, 113 బంతుల్లో) సెంచరీతో అదరగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడు 32 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడు పాక్‌ ఫీల్డర్ల తప్పిదంతో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది ఎలాగంటే కేఎల్‌ రాహుల్‌ బంతిని మిడ్‌వికెట్ మీదుగా తరలించాడు. రాహుల్‌ను చూసుకోకుండా రోహిత్‌ మొదటి పరుగు పూర్తిచేసుకుని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న పాక్‌ ఫీల్డర్‌ వికెట్‌కీపర్‌కు ఇవ్వకుండా బౌలర్‌వైపు విసరడంతో రోహిత్‌ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో పాక్‌ ఫీల్డర్లను చూసి రోహిత్‌ చిరునవ్వు నవ్వాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  

పెంకు పగిలింది!
సిక్సర్ల వర్షం కురిపించడంలో కరీబియన్ల తర్వాతే ఎవరైనా. నికోలస్‌ పూరన్‌ సిక్సర్‌ కొట్టడంతో స్టేడియం యాజమాన్యం చింతించింది. ఎందుకంటారా? బంగ్లా స్పిన్నర్‌ మెహది హసన్‌ బౌలింగ్‌లో పూరన్‌ సిక్స్‌ర్‌ బాదాడు. ఆ బంతి నేరుగా స్టేడియంలోని పెంకులపై పడటంతో అక్కడ రంధ్రం ఏర్పడింది. దీంతో క్రికెట్‌ వ్యాఖ్యాతలు ఫన్నీగా యాజమాన్యం నష్టపోయిందని వ్యాఖ్యానం చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 322 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది.

గప్తిల్‌ అక్కడ!
దక్షిణాఫ్రికా×న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో మార్టిన్‌ గప్తిల్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. అండిలె ఫెలుక్‌వాయో వేసిన బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా పుల్‌షాట్‌ ఆడి అదుపుతప్పి వికెట్లకు తగిలాడు. దీంతో ప్రపంచకప్‌లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి కివీస్ ఆటగాడుగా గప్తిల్‌ రికార్డుకెక్కాడు. దాండియా డ్యాన్స్‌ ప్రాక్టిస్‌ చేస్తూ ఔటయ్యాడని నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సఫారీలపై న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

బెయిల్స్‌కు ఏమైంది?
భారత్‌×ఆసీస్‌ మ్యాచ్‌లో జింగ్‌ బెయిల్స్‌ పుణ్యమా అని వార్నర్‌ బతికిపోయాడు. బుమ్రా వేసిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని లెగ్‌సైడ్‌ స్టంప్‌ను తాకింది. అయినా బెయిల్స్‌ పడకపోవడంతో ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. ధోని బెయిల్స్‌ను కదిపి చూసినా సమస్య ఏంటో అర్థం కాలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వార్నర్‌ మాత్రమే కాదు ఎంతో మంది ఆటగాళ్లకు ఇలానే జీవనదానం కలిగింది. క్రిస్‌ గేల్, దిముతు కరుణరత్నె, క్వింటన్‌ డికాక్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌కు ఇలానే అదృష్టం వరించింది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.