
తాజా వార్తలు
రహానె లేకుంటే ఏం జరిగిందో చూశాం
టాప్-3పై అతిగా ఆధారపడుతున్న టీమిండియా
దార్శనికత లేకుంటే కష్టం అంటున్న దిలీప్ వెంగ్ సర్కార్
ఎలాంటి మలుపులు లేకుండా గమ్యం చేరితే మజా ఏముంటుంది?ఆ ప్రయాణంలో ఎత్తు పల్లాలు చవిచూడాలి. ముళ్ల బాటల్లో నడవాలి. వింతలూ వినోదాలు చూడాలి. పాదాలను గుచ్చుకుంటున్న గులకరాళ్లను ఏరిపారేయ్యాలి. ఏం జరుగుతుందో అన్న భయాన్ని చంపేయాలి. ఆత్రుతను అణిచిపెట్టుకోవాలి. మూడో వన్డే ప్రపంచకప్ గెలవడమూ భారత్‌కు ఓ గమ్యమే. ఐతే, 2015 తరహాలోనే మళ్లీ సెమీస్‌లోనే ఆ ప్రయాణం నిలిచిపోయింది. 2019 లీగుల్లో కోహ్లీసేన వినోదం పంచింది. వరుస విజయాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అఫ్గాన్, ఇంగ్లాండ్ మ్యాచుల్లో పల్లాలను చవిచూసింది. కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం ఆత్రుతను అణిచిపెట్టుకోలేదు. చిగురుటాకులా వణికిపోయింది. టాప్ ఆర్డర్ కుదేలైతే ఇక ఓటమే అన్న ఆ గులకరాయిని ఇక నుంచైనా ఏరిపారేయాలి. ఇందుకోసం టీమిండియా మాజీ సారథి, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విలువైన సలహాలు ఇస్తున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఆయన పంచుకున్న అభిప్రాయాలు మీ కోసం..
ప్లాన్-ఏ = ప్లాన్-బి ఈ ప్రపంచకప్ ఓటమి తర్వాత నేను గుర్తించింది ఏమిటంటే జట్టును ఎంపిక చేసే ముందు గొప్ప ఆలోచనలను మథించలేదని! ఎప్పుడైనా అన్ని విభాగాలను పటిష్ఠంగా ఉంచుకోవాలి. ప్లాన్-ఏ తరహాలోనే ప్లాన్-బి పక్కాగా ఉండాలి. ముగ్గురు వికెట్ కీపర్లతో ఆడారు. భారతదేశంలో బ్యాట్స్‌మెన్ కనిపించలేదా? ప్రతిభను గుర్తించి పెంచి పోషించేందుకు ప్రయత్నించకపోతే దేశవాళీ క్రికెట్‌కు అర్థం ఏముంది? లేకుంటే అసలు ప్రతిభ లేదనా మీ (సెలక్టర్లు) ఉద్దేశం. లక్షల మంది క్రికెట్ ఆడుతున్న ఈ దేశంలో దానిని నేను అంగీకరించను. 50 ఓవర్ల క్రికెట్లో కనీసం నలుగురు లేదా ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఉండాలి. |
అతిగా ఆధారం రోహిత్, ధావన్, కోహ్లీపై మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. అది నిజమే. వారి తర్వాత ఆడేవాళ్లపై మాత్రం శీతకన్ను వేశాం. సెమీస్ వరకు బాగానే సాగింది. నాకౌట్ పోరులో 5/3తో ఉన్నప్పుడే అంతా ముగిసింది. రవీంద్ర జడేజా అద్వితీయ పోరాటం చేశాడు. కానీ మనం అతడి నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఆశించడం సరికాదు. అతనో అద్భుతమైన ఆల్‌రౌండర్. అతడి సామర్థ్యంపై సందేహం లేదు. కానీ నలుగురైదుగురు బ్యాట్స్‌మెన్ జట్టును నడిపించాలి. |
రహానె అవసరం కేవలం ముగ్గురిపై ఆధారపడి విజయాన్ని ఎలా ఆశిస్తాం? ప్రతి మ్యాచ్‌లో టాప్-3 అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ సెమీస్‌లో ఏమైనా జరగొచ్చు. ఒక చక్కని బంతితో పరిస్థితి తలకిందులు అవ్వగలదు. ఇంగ్లాండ్ పరిస్థితులపై అవగాహన, ఇన్నింగ్స్‌లు పునర్ నిర్మించగల అజింక్య రహానె, పుజారా లాంటి వాళ్లు జట్టుకు కావాలి. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు బ్యాకప్‌గా ఉండాలి. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ బ్యాకప్‌గా ఉంటే ఏం జరుగుతుందో చూశాం కదా! |
కుర్రాడిని నిందించొద్దు విజయ్ శంకర్ గురించి చెప్పలేను. అతడు గాయపడ్డాడు కూడా. ఆ కుర్రాడిని నిందించొద్దు. అతడి ఆటను నేను ఎక్కువగా చూడలేదు. అయితే జట్టును ఎంపిక చేసే ముందు మాత్రం కూలంకషంగా ఆలోచించలేదు. బ్యాకప్ ఎప్పుడైనా బాగుండాలి. |
సానబెడతా నేనైతే యువకులను ప్రోత్సహిస్తా. వారి ప్రతిభను పెంచి పోషిస్తా. ప్రస్తుత సెలక్షన్ బృందం ఆ పని చేయడం లేదు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అంబటి రాయుడిని రెండేళ్లు ఆడించారు. ఒక సెలక్టర్‌గా మీరు రాయుడి గురించి ఆలోచించి ఉంటే అతడిని కచ్చితంగా ఎంపిక చేయాలి. అతడిపై పెట్టుబడి పెట్టారు. ఇప్పుడది వృథా అయింది. |
వీరూనే ఉదాహరణ
నేను చీఫ్ సెలక్టర్‌గా ఉన్నప్పుడు ఆటగాడిని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనేవాళ్లం. నేను ఇషాంత్ శర్మను ఎంపిక చేసినప్పుడు వార్మప్ మినహాయిస్తే అతడు ఇంగ్లాండ్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకొని అతడిని ఢాకాలో అరంగేట్రం చేయించాను. వీరేంద్ర సెహ్వాగ్ విషయంలోనూ అంతే. ఫామ్‌లో లేనప్పుడు ఎంపిక చేశాను. దేశవాళీ క్రికెట్లో అతడు అత్యుత్తమం. అందుకే ఎంపిక చేశాం. జూనియర్ సహా నేను చాలా క్రికెట్ చూస్తాను. విశ్లేషిస్తాను. |
రిటైర్మెంట్ ధోనీ ఇష్టం ఫిట్‌గా ఫామ్‌లో ఉండే ఆటగాడినే నేను ఎంపిక చేస్తా. పాత, కొత్త ఆటగాళ్లని వేరు చేయను. వయసును బట్టి కొత్త ఆటగాడికి చోటు దక్కొద్దు. సీనియర్ క్రికెటర్లాంటి సామర్థ్యం తనకుందని నిరూపించుకొని జట్టులోకి రావాలి. కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను మినహాయిస్తే పంత్‌ను నేను ఎక్కువగా చూడలేదు. ధోనీ అద్భుత ఆటగాడు. అతడి సేవలు గొప్పవి. ఫామ్, ఫిట్నెస్, అతడికున్న ప్రేరణను బట్టే ఆటగాడిని జట్టుకు ఎంపిక చేయాలి. ఆ మూడూ ఉంటే ధోనీ ఇంకా క్రికెట్లో కొనసాగొచ్చు. గొప్ప ఆటగాళ్లు కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తారు. వీడ్కోలు పలకాలని భావిస్తే క్రికెట్‌ను వదిలేయొచ్చు. ఎప్పుడు ముగించాలో వారికి తెలుసు. మంచి ప్రదర్శనలతో వారు దేశానికి పేరు తీసుకొచ్చారు. వారిలో అదే లోపిస్తే సెలక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చు. ఒత్తిడి మాత్రం చేయొద్దు. |
దార్శనికత అవసరం రాబోయే నాలుగేళ్లు అత్యంత కీలకం. ప్రతిభను గుర్తించి సరిగ్గా సానబెట్టాలి. సెలక్టర్లకు ఆలోచించే శక్తి, అనుభవం ఉండాలి. అయితే కొన్నిసార్లు వారిని నిందించొద్దు. దార్శనికత (విజన్) లేకుంటే ప్రతిభను గుర్తించలేరు. సమతూకంతో జట్టును ఎంపిక చేయలేరు. ఇందుకోసం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న సెలక్టర్లు కావాలి. అనుభవమే అత్యంత కీలకం. అదీ అంతర్జాతీయ అనుభవం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో మేనేజ్ చేయలేరు. ఆటలో నలిగిన వారే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయగలరు. - ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్ |
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
