close

తాజా వార్తలు

ఇంగ్లాండ్‌ క్రీడాభిమానులకు పండగ రోజు

ఆదివారంనాడే మూడు ఫైనల్‌ పోటీలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం‌: ఇంగ్లాండ్‌ క్రీడాభిమానులకు ఈ ఆదివారం పండగ రోజుగా మారనుంది. ఒకేరోజు మూడు ఫైనల్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి క్రీడాభిమానులకు ఏ ఛానల్‌ చూడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 45 రోజుల పాటు నిర్విరామంగా సాగిన వన్డే ప్రపంచకప్‌ ఆఖరి ఘట్టానికి చేరుకున్న వేళ.. అదేరోజు మరో రెండు పెద్ద ఈవెంట్ల ఫైనల్‌ పోటీలు జరగనున్నాయి. వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌తో పాటు బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా రేసింగ్‌ కూడా ఆదివారమే నిర్వహిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌: 
వన్డే ప్రపంచకప్‌లో 27 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు ఫైనల్స్‌ చేరింది. ఆది నుంచి ఫేవరెట్‌గా ఉన్న ఆతిథ్య జట్టు ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్‌ ఇప్పటివరకూ ప్రపంచకప్‌ గెలవకపోవడం గమనార్హం. కాగా ఈసారి ఎలాగైనా విశ్వవిజేతగా అవతరించాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టే ఇయాన్‌మోర్గాన్‌ నేతృత్వంలోని జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు రెండోసారి ఫైనల్స్‌ చేరిన కివీస్‌ జట్టు సైతం తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తోంది. గత ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరి.. ఆస్ట్రేలియాతో చేజార్చుకున్న కప్పును ఈసారి విలియమ్సన్‌ నేతృత్వంలో ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగా మారింది.

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌:
వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో శుక్రవారం రఫెల్‌ నాదల్‌పై రోజర్‌ ఫెదరర్‌ గెలుపొంది ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తనను ఓడించిన రఫెల్‌పై ఫెదరర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. అలాగే మరో సెమీఫైనల్స్‌లో సెర్బియా ఆటగాడు జకోవిచ్‌.. బటిస్టా అగట్‌పై గెలిచి వింబుల్డన్‌ ఫైనల్స్‌కి చేరాడు. ఈ నేపథ్యంలో వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌ కూడా ఆదివారమే జరగనుంది. దీంతో ఫెదరర్‌ X జకోవిచ్‌ల మధ్య జరిగే టైటిల్‌పోరు ఆసక్తికరంగా మారింది.

బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫైనల్స్‌: 
క్రికెట్‌ ప్రపంచకప్‌, వింబుల్డన్‌ ఫైనల్స్‌తో పాటు ఆదివారం బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫైనల్స్‌ కూడా జరగనుంది. సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌(ట్రాక్‌) వేదికగా జరగబోయే ఈ పోటీలో బ్రిటిష్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఆరోసారి టైటిల్‌పై కన్నేశాడు. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌ మెర్సిడీస్‌ డ్రైవర్‌ వాల్టేరీ బొట్టాస్‌తో కలిసి ప్రస్తుత గ్రాండ్‌ప్రీలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఫైనల్స్‌లో హామిల్టన్‌ గెలిచి జిమ్ క్లార్క్‌, అలైన్ ప్రోస్ట్‌ను పేరిట ఉన్న గత రికార్డును బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.