close

తాజా వార్తలు

కొంచెం కష్టం.. కొంచెం నష్టం!

నాలుగేళ్లకొకసారి జరిగే ప్రపంచకప్‌ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ ఎన్నో హంగులతో ఈ ప్రపంచకప్‌ను నిర్వహించింది. ఆదిలో అభిమానులను ఆశించిన స్థాయిలో ఉర్రూతలూగించకపోయినా ప్రపంచకప్‌ కిక్‌ నిదానంగా అందరికీ ఎక్కేసింది. మధ్యలో వరుణుడి రాకతో వినోదం కొంచెం తగ్గినా సెమీస్‌ రేసుతో టోర్నీ వేడెక్కింది. భారత్‌, పాక్‌ను అఫ్గాన్‌ భయపెట్టడం.. పెద్ద జట్లకు బంగ్లాదేశ్‌, శ్రీలంక షాకివ్వడం ఎంతో మజానిచ్చింది. ఇంగ్లాండ్‌, కివీస్ జట్ల మధ్య జరిగిన అంతిమ సమరం క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతం. కొదమ సింహాల్లా తలపడిన ఫైనల్‌ మ్యాచ్‌ ప్రపంచకప్‌నకు అసలు సిసలైన ముగింపు. ఈ మెగాటోర్నీతో అభిమానులకు క్రికెట్‌లోని నవరసాలని పంచిన ఐసీసీ ఈ ప్రపంచకప్‌ను సమర్థంగా నిర్వహించిందా? అవును అని కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు కొన్ని లోపాలని సవరించుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..!


వర్షార్పణం.. ఎవరికి చేటు?
46 రోజులు జరిగిన ప్రపంచకప్‌ సమరంలో వరుణుడు ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. వర్షం రాకతో నాలుగు మ్యాచ్‌ల్లో  ఫలితం తేలలేదు. కొన్ని రోజులు విరామం తీసుకున్న వాన దేవుడు సెమీఫైనల్‌-1లో తిరిగి తన ప్రతాపం చూపించాడు. కానీ రిజర్వ్‌డే ఉండటంతో మ్యాచ్‌ రెండో రోజు కొనసాగింది. కానీ మ్యాచ్‌ రోజు వర్షం పడటం కొన్ని జట్లకు ప్రతికూలంశంగా మారాయి. భారత్‌×న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీస్‌లో వర్షం కోహ్లీసేనకు ఎంతో నష్టాన్ని మిగిల్చింది. అంతేకాకుండా వర్షం వల్ల శ్రీలంక లీగ్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లే ఆడింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్‌ను వాతావరణ పరిస్థితులు అంచనా వేయకుండా నిర్వహించినందుకు అభిమానులు తీవ్ర నిరాశచెందారు. ట్విటర్‌లో ఐసీసీని విపరీతంగా ట్రోల్‌ చేశారు. 


అంపైర్ల తప్పిదాలు!
అంపైర్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్‌ ఫలితాన్నే తారుమారు చేస్తాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అంపైర్లు ఎన్నో తప్పిదాలు చేశారు. ఫైనల్లో మార్టిన్‌ గప్తిల్‌ వేసిన ఓవర్‌ త్రోకు ఐదు పరుగులకు బదులు అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. ఇది న్యూజిలాండ్‌కు తీరని నష్టాన్ని మిగిల్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా సెమీస్‌లో కోహ్లీని ఎల్బీడబ్ల్యూ గా తేల్చడం భారత్‌కు చేటు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌ ఎల్బీ ఎంతో వివాదస్పదంగా మారింది. బంతి బ్యాటు, ప్యాడ్‌ మధ్యలోంచి వెళ్లడం రీప్లేలో స్పష్టంగా కనిపించింది.  కానీ  అంపైర్లు మాత్రం హిట్‌మ్యాన్‌ను ఔట్‌గా నిర్ణయించారు. ఇవే కాకుండా ఎన్నో వివాదస్పద నిర్ణయాలు మెగాటోర్నీలో జరిగాయి. ఎంతో ప్రఖ్యాతమైన ప్రపంచకప్‌లో అంపైర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సరైన నిర్ణయాలు ప్రకటిస్తే అన్ని జట్లకు మేలు కలిగేదని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.


తీర్పు సరైనదేనా..?
ప్రపంచకప్‌ ఫైనల్లో బంతి బంతికి ఆధిపత్యం చేతులు మారింది. ఉత్కంఠభరితంగా సాగిన అంతిమ పోరు చివరికి టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ ఆడించాలని నిర్ణయించారు. సూపర్‌ ఓవర్‌లోనూ పరుగులు సమమయ్యాయి. కానీ బౌండరీల లెక్కతో ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేసిన ఈ పోరాట ఫలితాన్ని ఇంగ్లాండ్‌ సహా అందరూ తప్పుపడుతున్నారు. ‘బౌండరీ బాదినా వికెట్ల మధ్య పరుగెత్తినా వచ్చేవి అవే పరుగులు. అలాంటిది బౌండరీలు ఏం గొప్ప? న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్లే కోల్పోయింది. కానీ ఇంగ్లాండ్‌ ఆలౌటైంది. దీని ప్రకారం విజేతగా కివీస్‌ను నిర్ణయించాలి. లేని పక్షంలో ఇరుజట్లను జగజ్జేతగా ప్రకటించాలి’ మోర్గాన్‌సేన కప్‌ను ముద్దాడిన తర్వాత క్రికెట్‌ అభిమానులందరి మదిలో మెదిలిన ప్రశ్నలివి. ఇరుజట్లు ఎంతో అద్భుతంగా పోరాడినా బౌండరీల లెక్కతో విజేతను నిర్ణయించడంతో సామాజిక మాధ్యమాల్లో ఐసీసీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సెహ్వాగ్‌, గంభీర్‌ సహా మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలాంటి నిబంధనలను ఐసీసీ పునఃసమీక్షించాలని  కోరుతున్నారు.


నిర్వహణ లోపమా..?
తేనెటీగల వల్ల దక్షిణాఫ్రికా×శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. దీంతో ఆటగాళ్లు, అంపైర్లు కొద్దిసేపు నేలపై పడుకున్నారు. ఐసీసీ నిర్వహణ లోపంతో ఇలా జరిందని అభిమానులు విమర్శించారు. అంతేకాకుండా మ్యాచ్‌ జరుగుతన్న సమయంలో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. ఇంగ్లాండ్‌×న్యూజిలాండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఒక అభిమాని నగ్నంగా పిచ్‌వద్దకు పరుగు తీశాడు. ఫైనల్లోనూ ఓ మహిళా మైదానంలోకి రావడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అమెని అడ్డుకున్నారు. వర్షం వల్లే కాకుండా ఇలాంటి పరిణామాలతో కూడా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడడం గమనార్హం.  ఇక బలూచిస్థాన్‌, కశ్మీర్‌కు సంబంధించిన బ్యానర్లను ప్రదర్శిస్తూ మైదానాలపైనుంచి  విమానాలు వెళ్లడం ఐసీసీకి చెడ్డపేరు తెచ్చింది.


అగ్రస్థానంతో ఏం లాభం..?
ప్రపంచకప్‌ను ఐసీసీ రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో నిర్వహించడం ఇది రెండోసారి. పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లను సెమీఫైనల్‌కు అర్హులుగా ప్రకటించారు. తొలి, నాలుగో స్థానాల్లో ఉన్న జట్లకు, రెండు,మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సెమీస్‌ను నిర్వహించారు. దీని వల్ల అగ్రస్థానంలో నిలిచిన జట్టకు ఏం ప్రయోజనం చేకూరుతుందని క్రికెట్‌ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌లోని ప్లేఆఫ్స్‌ మాదిరిగా తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఐపీఎల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్‌-1 నిర్వహిస్తారు. అందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. క్వాలిఫయిర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌ విజేత మధ్య క్వాలిఫయర్‌-2 జరుగుతుంది. దీనిలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. వచ్చే ప్రపంచకప్‌లోనైనా ఇదే తరహాలో ప్లేఆఫ్స్‌ నిర్వహిస్తే టేబుల్‌ టాపర్‌కు మేలు జరుగుతుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


పది జట్లతో ‘ప్రపంచ’కప్‌?
ప్రపంచకప్‌ గెలిచిన వారిని విశ్వవిజేత అంటారు. అలాంటి మెగాటోర్నీలో కేవలం పది జట్లనే ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్‌ దిగ్గజాలు సైతం ఐసీసీ నిర్ణయంపై పెదవివిరిచారు. ఐర్లాండ్‌, జింబాబ్వే, స్కాట్‌లాండ్‌, నెదర్లాండ్‌ దేశాలు ప్రపంచకప్‌ సమరంలో పోటీనిచ్చే జట్లే. కానీ వాటిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం. జింబాబ్వేను ఐసీసీ ఇటీవల బహిష్కరించింది. పసికూనలకు ఎక్కువ అవకాశాలు ఇస్తేనే తమ సత్తా ఏంటో నిరూపించుకోడానికి ఆస్కారం ఉంటుంది. బలమైన జట్లను పసికూనలు ఎన్నోసార్లు మట్టికరిపించాయి. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్‌ పోరాటాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేరు.


సమీక్ష ఒక్కటేనా?
అంపైర్ల పొరపాట్లని తగ్గించడం కోసం డీఆర్‌ఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. కానీ మెగాటోర్నీలో జట్టుకు ఒకే డీఆర్‌ఎస్‌ను ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అందరూ భావిస్తున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఒకే సమీక్ష ఉండటంతో ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు దక్కడం లేదు. సమీక్షకు వెళ్లిన తర్వాత ఆటగాడికి ఫలితం వ్యతిరేకంగా వస్తే జట్టు మొత్తం సమీక్షను కోల్పోతుంది. కనీసం ఇన్నింగ్స్‌కు రెండు సమీక్షలు ఉంటే మంచిదని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. సమీక్షలో ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌కు థర్డ్‌ అంపైర్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లోనూ బెయిల్స్‌ సమస్య వెంటాడింది. బంతి వికెట్లకు తాకినా బెయిల్స్‌ ఎన్నోసార్లు కింద పడలేదు. క్రికెట్‌ ప్రపంచం ఆధునికంగా దూసుకెళ్తున్నా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడం గమనార్హం. మొత్తంగా ఈ ప్రపంచకప్‌ ఐసీసీకి కొంత మోదం, కొంత ఖేదంగా మారింది!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.