close

తాజా వార్తలు

జపాన్‌ ఒలింపిక్స్‌... టెక్నాలజీ అదుర్స్‌

జపాన్‌.. సాంకేతికతకు, సృజనాత్మకతకు పెట్టింది పేరు. ఏ పనినైనా సాంకేతికతను వినియోగిస్తూ.. వినూత్నంగా, ఆకట్టుకునేలా చేసే జపాన్‌.. అదే పంథాలో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒలింపిక్స్‌-2020 క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రీడలకు జపాన్‌ రెండోసారి అతిథ్యమిస్తోంది. అయితే ఈసారి ప్రతిష్ఠాత్మక క్రీడోత్సవానికి జపాన్‌ చేస్తున్న ఏర్పాట్లు చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే. ఇంతకీ జపాన్‌ ఏం ఏర్పాట్లు చేస్తుందో ఓ సారి చూసేద్దాం.. 

మొబైల్స్‌తో పతకాలు...
సాధారణంగా పతకాలను స్వచ్ఛమైన బంగారం, వెండి, రాగిని ఉపయోగించి తయారు చేస్తారు. కానీ ఈసారి ఒలింపిక్స్‌ పతకాలు భిన్నంగా ఉండబోతున్నాయి. పాడైపోయిన మొబైల్ ఫోన్స్‌ వ్యర్థాల నుంచి తయారు చేసిన పతకాలనే విజేతలకు ఇవ్వనున్నారు.  అదెలా సాధ్యం అనుకుంటున్నారా? మొబైల్స్‌లో చిన్న పరిమాణంలో బంగారం, వెండి, రాగి ఉంటాయి. వాటిని సేకరించి.. పతకాలు తయారు చేయాలని జపాన్‌ నిర్ణయించింది. ఇప్పటికే అక్కడి ప్రజలు 80 వేలకుపైగా తమ వద్ద ఉన్న పాడైపోయిన మొబైల్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఇంకా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వీటి ద్వారా సుమారు ఐదు వేల పతకాలు తయారు చేస్తారట.

డ్రైవర్‌లెస్‌ కార్లు...సోలార్‌ రోడ్లు

ప్రపంచంలో డ్రైవర్‌లెస్‌ కార్ల వినియోగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ ఒలింపిక్స్‌లో ఈ తరహా కార్లను విరివిగా వాడనున్నారు. పోటీలను చూసేందుకు వచ్చే అతిథులను ఈ డ్రైవర్‌లెస్‌ కార్లలోనే వేదికల వద్దకు తీసుకెళ్లనున్నారు. సాధారణ వ్యక్తులు కూడా వీటిని వినియోగించే అవకాశం కల్పిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పాదనలో భాగంగా ఒలింపిక్స్‌ నిర్వహించే వేదికలతో పాటు పరిసర ప్రాంతాల్లో జపాన్‌ సోలార్‌ రోడ్లు వేయిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యతోపాటు, విద్యుత్‌ సమస్య కూడా పరిష్కారమవుతుంది.

తర్జుమా రోబోలు... కూలీ రోబోలు
విదేశాలకు వెళితే భాషే ప్రథమ సమస్య. ఆ దేశ భాష మనకు అర్థం కాక.. మన భాష వాళ్లకు అర్థం కాక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి పరిష్కారంగా ఒలింపిక్స్‌ నిర్వాహకులు‌.. తర్జుమా రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రీడావేదికల వద్ద ఈ రోబోలు జపాన్‌ భాషను అతిథులకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తర్జుమా చేసి వినిపిస్తాయి. అలాగే వృద్ధులు, దివ్యాంగుల లగేజీలను మోసుకెళ్లేందుకు, సహాయ పడేందుకు మరికొన్ని రోబోలను పెట్టనున్నారు. ఒలింపిక్‌ క్రీడలు జరిగే వేదికలకు, క్రీడాకారులు బస చేసే ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా కోసం జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేవలం గాలి మరలు, సోలార్‌ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తునే వినియోగించనున్నారు. దీని ద్వారా దేశంలో సాధారణ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తున్నారు.

హై స్పీడ్‌ రైలు.. 8కె తెరలు

హైస్పీడ్‌ మగ్లేవ్‌ రైల్‌ను అందుబాటులోకి తేవాలని జపాన్‌ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఒలింపిక్స్‌ నేపథ్యంలో వాటిని వినియోగంలోకి తీసుకురానుంది. గంటకు 600 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ఒలింపిక్స్‌ క్రీడలను చూసేందుకు వచ్చే సందర్శకులకు అందుబాటులోకి రానుంది. అంతేకాదు.. క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పెద్ద సంఖ్యలో డ్రోన్లను వినియోగించనున్నారు. అలాగే అనుమతి లేని డ్రోన్లను ధ్వంసం చేసేందుకు సాయుధ డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఉన్న 4కె స్క్రీన్‌ రిజెల్యూషన్‌కు రెట్టింపుతో అంటే 8కె రిజెల్యూషన్‌ క్లారిటీతో క్రీడలను ప్రసారం చేయనున్నారు. క్రీడాకారులను తొందరగా గుర్తించేందుకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని వాడబోతున్నారు. జపాన్‌లోని ప్రముఖ టెలీకమ్యూనికేషన్‌ సంస్థ డోకోమో.. తొలిసారిగా టోక్యో ప్రజలకు, ఒలింపిక్స్‌ సందర్శకులకు 5జీ సేవలను అందబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌ సంబంధించి ఇలాంటి మరిన్ని టెక్‌ సంగతులు బయటికొస్తాయ్‌!

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.