close

తాజా వార్తలు

ఇకనైనా మిడిలార్డర్‌ సమస్య తీరేనా?

భవిష్యత్‌లో యువక్రికెటర్లే కీలకం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి భారత జట్టుకు ఓ గుణపాఠంలా మారింది. టాప్‌ఆర్డర్‌ ఆడినన్ని రోజులూ నెట్టుకొచ్చిన టీమిండియా.. సెమీస్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఒకప్పుడు యువరాజ్‌, ధోనీలు మిడిలార్డర్‌లో వచ్చి మ్యాచ్‌ ఫినిషర్లుగా నిలిచేవారు. ఒంటి చేత్తో ప్రత్యర్థులను చిత్తుచేసి టీమిండియాకి ఎన్నో విజయాలను అందించారు. అలాంటి కీలక మిడిలార్డర్‌లో సరైన ఆటగాడికోసం భారత జట్టు గతమూడేళ్లలో 10-12 మంది యువ క్రికెటర్లను పరీక్షించింది. అందులో ఒక్కరినీ పూర్తిస్థాయిలో సన్నద్ధత చేయకుండానే ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. విజయ్‌శంకర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసి వారిపైనే ఆశలు పెట్టుకొని భారీ మూల్యం చెల్లించుకుంది. ధావన్‌ నిష్క్రమణతో రాహుల్‌ ఓపెనింగ్‌కి వెళ్లగా మిడిలార్డర్‌ సమస్య క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సెమీస్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 

మనీష్‌పాండే, శ్రేయస్‌ అయ్యర్‌:
ఇక టీమిండియా భవిష్యత్‌లో రాణించాలంటే యువ క్రికెటర్లను సమర్థవంతంగా తయారు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చేనెల వెస్టిండీస్‌తో జరగబోయే పర్యటనకు యువక్రికెటర్లకు అవకాశమివ్వడం శుభపరిణామం. ఐపీఎల్‌లో మెరిసిన శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలు ఇటీవల వెస్టిండీస్‌ ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లోనూ మంచి ప్రదర్శన చేశారు. దీంతో వారికి చోటిచ్చారు. అయితే యాజమాన్యం గతంలో నాలుగో నంబర్‌ స్థానానికి అనేక మందిని పరీక్షించినట్టు కాకుండా వీరికి సరైన అవకాశాలివ్వాలి. బలమైన బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్ది వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధం చేయాలి. టీమిండియా గతంలో మిడిలార్డర్‌లో పరీక్షించిన వారిలో పాండే,  శ్రేయస్‌ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ అప్పుడు వచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడైనా ఈ ఇద్దరు ఆటగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో కీలక ఆటగాళ్లుగా ఎదుగుతారు. 

రాహుల్‌, కేదార్‌ జాదవ్‌ పోటీ:  
రాబోయే వెస్టిండీస్‌ టూర్‌కు కేఎల్‌ రాహుల్‌ ఎంపికైనా కేదార్‌ జాదవ్‌ను పక్కనపెట్టింది సెలక్షన్‌ కమిటీ. అయితే కీలకమైన నాలుగో నంబర్‌ స్థానం కోసం రాహుల్‌.. మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌తో పోటీపడాల్సి ఉంటుంది. కేదార్‌ జాదవ్‌ ఫిట్‌గా ఉంటే భవిష్యత్‌లో మళ్లీ అవకాశాలు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈ నలుగురి మధ్యా తీవ్ర పోటీ నెలకొంటుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే ఇప్పటినుంచే నిలకడ ఆటతీరును కొనసాగించాలి. క్లిష్ట సమయాల్లోనూ బ్యాటింగ్‌ చేసి ఒంటి చేత్తో గెలిపించే సత్తా చాటాలి. 

పంత్‌, కార్తిక్‌ పరిస్థితి?
ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషభ్‌పంత్‌ అనూహ్యంగా ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో ఆశించినంతగా రాణించకపోయినా తన బ్యాటింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. అయితే ధోనీ రిటైర్మెంట్‌ తర్వాత భారత జట్టుకు అతడే కీలక వికెట్‌కీపర్‌గా మారనున్నాడు. సీనియర్‌ కీపర్‌ దినేశ్‌కార్తిక్‌ ప్రపంచకప్‌లో విఫలమవడంతో ప్రస్తుతం అతడి కెరీర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వృద్ధిమాన్‌ సాహా టెస్టులకు కీపింగ్‌ బాధ్యతలు స్వీకరిస్తే, నిర్ణీత ఓవర్ల ఫార్మాట్‌కు పంత్‌ పెద్ద దిక్కుగా మారతాడు. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లు బాగా రాణించి టీమిండియాలో భవిష్యత్‌ తారలుగా మారి మంచి విజయాలను అందించాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.