close

తాజా వార్తలు

ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పు..!

 సంక్షోభం అంచున ప్రఖ్యాత డాయిచే బ్యాంక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: డాయిచే బ్యాంక్‌.. బ్యాంకింగ్‌ రంగంలో కింగ్‌గా రాణించింది. వాల్‌స్ట్రీట్‌కు కలికితురాయిగా భావించే ఈ బ్యాంకు ప్రస్తుతం సంక్షోభం అంచుల్లోకి చేరింది. అమెరికాలో అడుగుపెట్టింది మొదలు జేపీ మోర్గాన్‌, సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు పోటీ ఇచ్చింది. కానీ, ఇటీవల మాత్రం ఆ బ్యాంకులతో తాను పోటీపడే పరిస్థితి లేదని తేల్చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సేవలకు స్వస్తి చెబుతూ దాదాపు 18వేల మందికి ఉద్వాసన పలికింది. బ్యాంక్‌ పునర్‌ వ్యవస్థీకరణ దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. 2007-08 తర్వాత చేపట్టిన అతిపెద్ద బ్యాంకింగ్‌ పునర్‌ వ్యవస్థీకరణగా ఈ ప్రక్రియ నిలిచింది. 
ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో 3.5బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. 2015 తర్వాత ఈ బ్యాంక్‌కు ఇంత మొత్తంలో నష్టాలు ఎన్నడూ రాలేదు. పునర్‌ వ్యవస్థీకరణ వ్యయాలు పెరగడంతోనే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్‌  సర్దిచెప్పుకొంది. కానీ, వాల్‌స్ట్రీట్‌లో మాత్రం ఈ బ్యాంక్‌ షేర్ల పతనం ఆగడంలేదు. 

కొన్నేళ్లుగా సమస్యల్లో..
> సాధారణంగా తప్పుడు వ్యూహాలు, చెత్త నిర్వహణ, దురదృష్టం వెంటాడటంతోనే బ్యాంకులు సంక్షోభాల్లో కూరుకుపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ మూడు కలిసి వచ్చి కూడా దెబ్బతీస్తుంటాయి. 2009 నుంచి ఈ బ్యాంక్‌ భారీగా మార్కెట్‌ విలువ కోల్పోయింది. 2018 నాటికి 14.8 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైపోయింది. ఈ సమయంలో కొన్ని సార్లు విలువ భారీగా పెరగ్గా.. మరొకొన్నిసార్లు పడిపోయింది. ఈ బ్యాంక్‌లోని 1,00,000 ఉద్యోగులు ఏటా సగటున 15,370 డాలర్ల మేరకు బ్యాంక్‌ విలువను దెబ్బతీశారు. ఈ క్రమంలో బ్యాంక్‌ ఉద్యోగుల ఉత్పాదక శక్తి కంటే ఎక్కువ చెల్లింపులు చేసింది. ఇది బ్యాంకు చెబుతున్న మాట.
> ఇప్పటికే బ్యాంక్‌ దాదాపు 83.2 బిలియన్‌ డాలర్లను మొండిబాకీలపై ప్రొవిజన్లుగా ఏర్పాటుచేసుకొంది. ఇది మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటిల్లో చాలా వరకు ప్రస్తుతం మూసేసిన డెరివేటీవ్‌ ట్రేడ్‌, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించినవి ఉన్నాయి. వాస్తవానికి ఉన్న మొండిబకాయిలను బ్యాంకు దాచిపెట్టి తక్కువగా చూపిస్తోందని, కొన్ని రకాల ఆస్తుల విలువను అధికం చేసి చూపుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

పురాతన బ్యాంక్‌..

1870లో దీనిని బెర్లిన్‌లో కొందరు బ్యాంకర్లు కలిసి ఏర్పాటు చేశారు. తొలిదశలో జర్మనీ మిగతా ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసేందుకు ఉపయోగించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో దేశానికే పరిమితమైంది. బెర్లిన్‌ వాల్‌ కూల్చివేత తర్వాత ఈ బ్యాంక్‌ వేగంగా వృద్ధి చెందింది. 1980 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద బ్యాంక్‌గా నిలిచింది. మరోపక్క అమెరికాకు జేపీ మోర్గాన్‌, మెర్లించ్‌ వంటి బ్యాంకులు వేగంగా విస్తరిస్తుండటంతో డాయిచే బ్యాంక్‌ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 1994 జర్మనీ ప్రభుత్వం డాయిచే టెలికమ్‌ ప్రైవేటీకరణకు డాయిచే బ్యాంక్‌ను కాదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ను ఎంచుకొంది. ఈ నిర్ణయం డాయిచే బ్యాంకు సీఈవోకు అవమానకరంగా అనిపించింది. దీంతో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌పై ఈ బ్యాంక్‌ దృష్టిపెట్టింది. భారీగా బ్యాంకులను కొనుగోలు చేసింది.

2001లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో నమోదైనప్పటి నుంచి వాల్‌స్ట్రీట్‌, ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో కీలక పాత్ర పోషించింది. 2007 నాటికి 81 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను, 2.6ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బ్యాంక్‌గా అవతరించింది. 2007 తొలి అర్థభాగానికి బ్యాంక్‌ షేరు 120 డాలర్లకు చేరగా.. 2008 ఆర్థిక సంక్షోభం దెబ్బకు 2009లో 20డాలర్లలోపుకే పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమై 7డాలర్ల దరిదాపుల్లోకి చేరింది. ప్రస్తుతం డాయిచే బ్యాంక్‌ ఇతర సంస్థలతో కలిసి 45 ట్రిలియన్‌ డాలర్లు విలువైన డెరివేటీవ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీ, క్రెడిట్‌, ఇంట్రెస్ట్‌రేట్‌ డెరివేటీవ్‌లు ఉన్నాయి. వీటిని 2020 నాటికి పూర్తిగా వదిలించుకోవాలని బ్యాంక్‌ భావిస్తోంది.  2008లో కూడా లేమాన్‌ బ్రదర్స్‌ డెరివేటీవ్స్‌ దెబ్బతిని ఆస్తుల విలువ భారీగా పడిపోయింది. ఇది మిగిలిన సంస్థలకు కూడా వ్యాపించి మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు. డాయిచే బ్యాంకుకు అమెరికా, యూరప్‌ల్లోని అతి పెద్ద బ్యాంకులతో బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఈ బ్యాంక్‌ పతనమైతే దీని ప్రభావం.. వాటిపై కూడా పడనుంది.

కష్టాల సుడిలోకి..
ఆర్థిక సంక్షోభం తర్వాత బ్యాంక్‌ కష్టాలు పెరిగిపోయాయి. రెగ్యూలేటరీల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దాదాపు 30 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు అవసరమయ్యాయి. కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలోనే భారీగా పెట్టుబడులు పెట్టింది. రీటైల్‌, జర్మనీలోని కార్పొరేట్‌ బ్యాంకిగ్‌ విభాగాన్ని చిన్నచూపు చూసింది. కొత్త ఉద్యోగులకు భారీగా జీతాలు, బోనస్‌లు  చెల్లించింది. 
> 2007-08 మధ్య మార్టిగేజ్‌ సెక్యూరిటీల లావాదేవీల్లో వినియోగదారులను తప్పుదోవ పట్టించినందుకుగాను 2017లో అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌కు అపరాధరుసుం చెల్లించింది. 
> రేట్‌ రిగ్గింగ్‌  కేసులో 2.5బిలియన్‌ డాలర్లను యుకే, యుఎస్‌ రెగులేటరీలకు ఫైన్‌ చెల్లించింది. 
> రష్యన్‌ మనీలాండరింగ్‌ కేసులో భారీగా జరిమానాలు చెల్లించింది. 
> ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను ఈ బ్యాంకు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
> అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తును ఎదుర్కొంది. 
> బ్యాంక్‌ సిబ్బంది మనీలాండరింగ్‌కు సాయం చేస్తున్నారనే ఆరోపణలపై డాయిచే ఫ్రాంక్‌ ఫర్డ్‌ ఆఫీస్‌పై భారీ ఎత్తున పోలీస్‌ రైడ్‌ జరిగింది. దీంతో స్టాక్‌ ఒక్కసారిగా పడిపోయింది. 

ఫలించని బెయిల్‌ఔట్‌

డాయిచే బ్యాంక్‌ను ఆర్థిక కష్టాల నుంచి బయట వేయడానిక జర్మనీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ బ్యాంక్‌ను జర్మన్‌ కామర్స్‌ బ్యాంక్‌లో వీలినం చేయాలన్న ప్రతిపాదన విఫలమైంది. ఇప్పటికే మొండి ఆస్తుల విక్రయాలు కూడా చేపట్టింది. ఇది సక్రమంగా జరగకపోతే బ్యాంక్‌ షేరు మరింత పతనమై  పూర్తిగా విలువ కోల్పోయే పరిస్థితి నెలకొంది. సంక్షోబానికి ముందు లేమాన్‌ బ్రదర్స్‌ పరిస్థితి కూడా అచ్చంగా ఇంతే ఉంది. 

పునర్‌ వ్యవస్థీకరణ..

క్రిస్టియన్‌ సేవింగ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంక్‌ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టారు. బ్యాంక్‌ను మళ్లీ మూలాలవైపు తీసుకెళ్లేందుకు సిద్ధం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ను తగ్గించేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యాపారం నుంచి తప్పుకోవడం వీటిలో కీలకమైనవి. ఫలితంగా 18,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతోపాటు నాలుగోవంతు ఖర్చులు కూడా తగ్గనున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.