close

తాజా వార్తలు

భారత్‌×పాక్‌: షోయబ్‌ అక్తర్‌ చెప్పిన ‘చేదు నిజం’

ఫిట్‌నెస్‌ లోపం, వకార్‌ కెప్టెన్సీ వైఫల్యమే ఓటమికి కారణం

దిల్లీ: ప్రపంచకప్‌లో దాయాదుల సమరమంటే ఫైనల్‌ కాని ఫైనల్‌ అన్నట్టే! అలాంటి రసవత్తర పోరులో రెండు జట్ల ఆటగాళ్లు ఎంత కసిగా ఆడతారో అందరికీ తెలిసిందే. ఇక అభిమానుల భావోద్వేగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు మెగాటోర్నీలో టీమిండియాకు దాయాది చేతిలో ఓటమన్నదే తెలియదు. అయితే 2003 ప్రపంచకప్‌లో గెలిచే అవకాశమున్నా ఓడిపోయామని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రకటించి ఓ ‘చేదు నిజం’ బయటపెట్టాడు.


చెలరేగిన సచిన్‌

ప్రపంచకప్‌-2003లో సెంచూరియన్‌లో టీమిండియాకు పాక్‌ 274 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో సచిన్‌ (98) చెలరేగడంతో భారత్‌ విజయం సాధించింది. అప్పుడు తాను పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం, వకార్‌ యూనిస్‌ నాయకత్వ వైఫల్యంతో దాయాదిపై తొలి విజయం అందుకోలేకపోయామని అక్తర్‌ అన్నాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ఇందుకు  సంబంధించిన వివరాలు వెల్లడించాడు.


4-5 ఇంజెక్షన్లు తీసుకున్నా

‘2003 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో సెంచూరియన్‌లో జరిగిన పోరు నా కెరీర్‌లోనే అత్యంత నిరాశపరిచిన మ్యాచ్‌. మంచి బౌలింగ్‌ విభాగం ఉన్నప్పటికీ 274 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. మ్యాచ్‌కు ముందు రోజు 4-5 ఇంజెక్షన్లు తీసుకున్నా. దాంతో నా మోకాల్లో నీరు చేరి ఎలాంటి స్పర్శలేకుండా మారింది. మా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత 30-40 పరుగులు తక్కువ చేశామని సహచరులకు చెప్పాను. 273 సరిపోవా మరైతే ఎన్ని చేయాలని నాపై అందరూ గట్టిగా అరిచారు. మనం భారత్‌ను ఆలౌట్‌ చేయగలమని వారంతా నాకు చెప్పారు. ఏదేమైనప్పటికీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, రెండో ఇన్నింగ్స్‌లోనూ మార్పేమీ ఉండదని నాకు తెలుసు’ అని షోయబ్‌ అన్నాడు.


మొద్దుబారిన మోకాలు

‘మేం బౌలింగ్‌ ఆరంభించాక నా ఎడమ మోకాలు మొద్దుబారటం గమనించా. నా బౌలింగ్‌ పరుగు లయ కోల్పోయాను. దాంతో బౌలింగ్‌ సరిగ్గా చేయలేకపోయా. భారత ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ చెలరేగి ఆడారు. నిజం చెప్పాలంటే సచిన్‌ అద్భుతంగా ఆడాడు. పాయింట్‌ మీదుగా సిక్సర్‌ సైతం బాదేశాడు. నాకెలా బౌలింగ్‌ చేయాలో అర్థం కాలేదు. దురదృష్టవశాత్తు వకార్‌ నన్ను బౌలింగ్‌ దాడి నుంచి తప్పించాడు. చాలాసేపటి తర్వాత బౌలింగ్‌ చేయించాడు. అప్పుడు నేను వేగంగా, షార్ట్‌పిచ్‌ బంతులు వేశాను. షార్ట్‌ పిచ్‌ బంతికే సచిన్‌ 98 వద్ద ఔటయ్యాడు. ఇలాంటి బౌలింగ్‌ వేయాలని నేను ముందు నుంచీ కెప్టెన్‌కు చెబుతూనే ఉన్నా. కానీ విన్లేదు. చివరికి మేం మ్యాచ్‌ ఓడిపోయాం’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.


జీవితాంతం మర్చిపోను

‘ఇది నాకో చేదు అనుభవం. ఎందుకంటే 1999, 2003లో మేం భారత్‌ను ఓడించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ ఘనతను నేను తక్కువ చేయడం లేదు. ఆ ఓటమీకి నేనిప్పటికీ బాధపడుతున్నా. మేం మరికొన్ని పరుగులు సాధించి మెరుగైన బౌలింగ్‌ చేసుంటే మ్యాచ్‌ గెలిచేవాళ్లం. నా ఫిట్‌నెస్‌, కెప్టెన్సీ వైఫల్యాలు కొంపముంచాయి’ అని షోయబ్‌ బాధపడ్డాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.