Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141380
            [news_title_telugu_html] => 

మహాయోధుల వీడ్కోలు కథ ఇది!

[news_title_telugu] => మహాయోధుల వీడ్కోలు కథ ఇది! [news_title_english] => This is the story of the Retired Cricketers [news_short_description] => అంతర్జాతీయ క్రికెట్‌లో వారంతా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఒకరు బంతితో ప్రత్యర్థులను వణికిస్తే మరొకరు బ్యాట్‌తో సమాధానమిస్తారు. మహాయోధులు వారంతా. కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నామని వారికి ముందే [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-13 15:17:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మహాయోధుల వీడ్కోలు కథ ఇది! - This is the story of the Retired Cricketers - EENADU
close

తాజా వార్తలు

మహాయోధుల వీడ్కోలు కథ ఇది!

అంతర్జాతీయ క్రికెట్‌లో వారంతా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఒకరు బంతితో ప్రత్యర్థులను వణికిస్తే మరొకరు బ్యాట్‌తో సమాధానమిస్తారు. మహాయోధులు వారంతా. కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నామని వారికి ముందే తెలుసు. దేశాన్ని విశ్వవిజేతగా నిలపాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అది సాధ్యపడలేదు. మరో ప్రపంచకప్‌ వరకూ పోరాడలేక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రపంచకప్‌ను అందివ్వలేకపోయినా జట్టుకు ఎన్నో ఘన విజయాలు సాధించిపెట్టారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును ఒంటిచేత్తో విజయ తీరాలకు తీసుకొచ్చిన సందర్భాలు కోకొల్లాలు. అలాంటి మహాయోధులు ప్రపంచకప్‌ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఎవరెవరంటే..  


అతడి పరుగును అందుకోలేం!
దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్ తాహిర్‌ పేరు వినగానే క్రికెట్‌ అభిమానులకు గుర్తు వచ్చేది అతడి సెలబ్రేషన్స్‌. వికెట్‌ పడగొట్టగానే.. మైదానంలో ఎవరూ తనని అందుకోలేని వేగంతో పరుగెత్తి సంబరాలు చేసుకుంటాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌ అనంతరం అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాహిర్‌ పాకిస్థాన్‌లో జన్మించి దక్షిణాఫ్రికాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 31 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. వన్డేల్లో ఒకే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఏడు వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు తాహిర్. ఈ ఘనతను 58 మ్యాచుల్లోనే సాధించాడు. 

2011లో మొదలైన తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 107 వన్డేలు, 20 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 57, టీ20లో 63 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడు తాహిర్‌. ఐపీఎల్‌లో అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


ఫేర్‌వెల్‌   దక్కలేదు
పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ రెండు దశాబ్దాల పాటు జట్టుకు సేవలు అందించాడు. నిలకడగా రాణిస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ గత కొంత కాలంగా అతడు అంతగా ఫామ్‌లో లేడు. కానీ అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావించి పాక్‌ బోర్డు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించింది. కానీ మాలిక్ ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 8 పరుగులే చేశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటవ్వడంతో అతడిపై విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. దీంతో ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరగుతున్న పాక్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అతడిని పక్కనపెట్టారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు మాలిక్‌ ప్రకటించాడు. తుది జట్టులో లేకుండానే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 20 ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించిన మాలిక్‌కు ఆశించిన స్థాయిలో ఫేర్‌వెల్‌ దక్కలేదు. 

1999లో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడిన మాలిక్‌ 2019 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆఖరి వన్డేలో తలపడ్డాడు. 2015లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన అతడు టీ20ల్లో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల మాలిక్‌ 287 వన్డేల్లో 34.55 సగటుతో 7534 పరుగులు చేశాడు. 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 35 టెస్టుల్లో 1898 పరుగులు చేసి 32 వికెట్లు తీశాడు. 


అతడి నిర్ణయం అనూహ్యం
తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్‌ జట్టు ఎంపికలో అన్యాయం జరిగిందని భావించి అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. విజయ్‌శంకర్‌కు గాయమైనా రెండో స్టాండ్‌బైగా ఉన్న తనను కాదని మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వల్ల మనస్తాపానికి గురయ్యాడు. దీంతో మొత్తంగా ఆట నుంచే వైదొలిగాడు. ప్రపంచకప్‌ ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్‌లో రాయుడు విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు రాయుడును పక్కనపెట్టి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులో ఎంపికచేశారు. కానీ ధావన్‌, శంకర్‌ గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగినా సెలక్టర్లు అతడికి స్థానమివ్వలేదు.

టీనేజ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసిన రాయుడు 28 ఏళ్లకు తొలి వన్డే ఆడాడు. 55 వన్డేల్లో రాయుడు 1694 పరుగులు చేశాడు. కెరీర్‌ను ఆలస్యంగా ఆరంభించిన రాయుడు ఒక్క అంతర్జాతీయ టెస్టు కూడా ఆడలేదు. ఆరు టీ20లు మాత్రమే ఆడిన అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 2018 ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 


టెస్టుల్లో స్టెయిన్ గన్‌ డౌన్‌
దక్షిణాఫ్రికా పేసర్ డేల్‌ స్టెయిన్‌ ప్రపంచకప్ తర్వాత టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 2008 నుంచి 2014 మధ్య ఏకంగా 263 వారాల పాటు టెస్టు నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగాడు. మహామహా బ్యాటింగ్‌ దిగ్గజాలు సైతం అతడి బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడేవారు. కానీ గాయాలు అతడిని ఆట నుంచి ఎన్నోసార్లు తాత్కాలికంగా దూరం చేశాయి. 2016లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో స్టెయిన్‌ భుజం ఎముక విరిగింది. శస్త్రచికిత్స అనంతరం బరిలోకి దిగి తన సత్తా చాటాడు. కానీ తన పాదానికి గాయమవ్వడంతో మరోసారి విశ్రాంతి తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌కు అతడు ఎంపికైనా భుజం గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.  

36 ఏళ్ల స్టెయిన్‌ దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు 93 టెస్టులు, 125 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 439, వన్డేల్లో 196, టీ20ల్లో 61 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అవార్డును అందుకున్నాడు.


హ్యాట్రిక్‌ల వీరుడు మలింగ
శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రపంచకప్‌ తర్వాత స్వదేశంలో జరిగిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో ఆఖరి వన్డే ఆడాడు. 2011లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మలింగ టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. యార్కర్ల రారాజుగా పేరున్న మలింగ ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక ఆటగాడు మలింగ మాత్రమే. అంతేకాకుండా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఒకే ఒక్క బౌలర్‌ మలింగనే. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లోనూ శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ అందుకున్న మలింగకు వన్డే ప్రపంచకప్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 

2004లో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన మలింగ తన కెరీర్‌లో 226 వన్డేలు, 30 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 338, టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. అతడు ఆడిన 73 టీ20ల్లో 97 వికెట్లు తీశాడు. 


27 ఏళ్లకే టెస్టులకు గుడ్‌బై
పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ ప్రపంచకప్ ముగిసిన తర్వాత టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అతడు ఇకపై వన్డేలు, టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. ఏడాదిలోపే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. కానీ 2010లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకొని ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. నిషేధం ముగిసిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించి తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. 2016లో పునరాగమనం చేసిన అతడు గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాక్‌ బోర్డు అతడిని నమ్మి ప్రపంచకప్‌కు అవకాశం ఇచ్చింది. మెగాటోర్నీలో ఫర్వాలేదనిపించాడు. కానీ ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత అతడు అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరింత రాణించడం కోసం టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించాడు. 27 ఏళ్ల ఆమిర్‌ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 59 వన్డేల్లో 77 వికెట్లు, 42 టీ20ల్లో 55 వికెట్లు పడగొట్టాడు.


సఫారీల స్టార్‌ ఆమ్లా
దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 2013లో నంబర్‌వన్‌ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అయ్యాడు. వన్డేల్లో 27 సెంచరీలు బాదిన అతడు సఫారీల తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ అతడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఆమ్లా స్థాయికి తగిన రీతిలో రాణించలేకపోయాడు. స్టెయిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన మూడు రోజుల వ్యవధిలోనే ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అందుబాటులో ఉంటానని ఆమ్లా తెలిపాడు. 124 టెస్టుల్లో 46.64 సగటుతో 9282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలున్నాయి. 181 వన్డేల్లో 27 సెంచరీలు బాది 8113 పరుగులు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 349 మ్యాచ్‌లు ఆడిన అతడు 18 వేలకు పైగా పరుగులు చేశాడు. 


ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు
ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత మరో దక్షిణాఫ్రికా ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆల్‌రౌండర్‌ జీన్‌పాల్‌ డుమిని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో టెస్టు క్రికెట్‌ గుడ్‌బై చెప్పిన డుమిని ఈ ఏడాది మేలో దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలిగాడు. దక్షిణాఫ్రికా తరఫున అతడు 2011, 2015, 2019 ప్రపంచకప్‌ టోర్నీలో ప్రాతినిధ్యం వహించాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొట్టి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 35 ఏళ్ల డుమిని 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2103 పరుగులతో పాటు 42 వికెట్లు, వన్డేల్లో 5117 పరుగులు, 69 వికెట్లు, టీ20ల్లో 1934 పరుగులు, 21 వికెట్లు తీశాడు. 


అంపైర్‌ కూడా రిటైరయ్యాడు
ప్రపంచకప్‌ అంటే ఆటగాళ్లకే కాదు అంపైర్లకు భావోద్వేగమే. సీనియర్‌ ఆటగాళ్లు ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాలని భావిస్తారు. అలాగే ఇయాన్ గౌల్డ్‌ అంపైరింగ్‌కు వీడ్కోలు చెప్పాడు. ప్రపంచకప్‌లో తన ఆఖరి వన్డేకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్, శ్రీలంక తలపడిన లీగ్‌ మ్యాచ్‌ గౌల్డ్‌కు ఆఖరిది‌. ఇయాన్‌ గౌల్డ్‌ ఇంగ్లాండ్ దేశస్థుడు. అతడి కెరీర్‌లో 74 టెస్టులు, 140 వన్డేలకు బాధ్యతలు చేపట్టాడు. అతడి కెరీర్‌లో నాలుగు ప్రపంచకప్‌లకు అంపైరింగ్ చేశాడు‌. 2011 ప్రపంచకప్‌లో భారత్‌xపాకిస్థాన్‌ సెమీఫైనల్‌కు గౌల్డే అంపైర్‌గా పని చేశాడు. అతడు క్రికెటర్‌ కూడా‌. 1983 ప్రపంచకప్‌లో గౌల్డ్‌ వికెట్‌కీపర్‌గా ఇంగ్లాండ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.