Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 144307
      [news_title_telugu_html] => 

ఆకారంలోనే కాదు ఆటలోనూ ఆజానుబాహులే!

[news_title_telugu] => ఆకారంలోనే కాదు ఆటలోనూ ఆజానుబాహులే! [news_title_english] => cricketers show why size does not matter [news_short_description] => వారి ఎత్తు ఆరడుగులకు పై మాటే. బరువు వంద కిలోల కంటే ఎక్కువ. చూడగానే భారీ ఆకారంతో భయపెట్టే వీళ్లు బాడీబిల్డర్లేమీ కాదు. అలా అని మల్లయోధులు అంతకన్నా కాదు. బంతి, బ్యాట్‌తో సత్తా చాటిన క్రికెటర్లు [news_tags_keywords] => Rahkeem Cornwall,Warwick Armstrong,Richie Kaschula,Dwayne Leverock,Colin Milburn, Inzamam-ul-Haq,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 14:50:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆకారంలోనే కాదు ఆటలోనూ ఆజానుబాహులే! - cricketers show why size does not matter - EENADU
close

తాజా వార్తలు

ఆకారంలోనే కాదు ఆటలోనూ ఆజానుబాహులే!

వారి ఎత్తు ఆరడుగులకు పై మాటే. బరువు వంద కిలోల కంటే ఎక్కువ. చూడగానే భారీ ఆకారంతో భయపెట్టే వీళ్లు బాడీబిల్డర్లేమీ కాదు. అలా అని మల్లయోధులు అంతకన్నా కాదు. బంతి, బ్యాట్‌తో సత్తా చాటిన క్రికెటర్లు. క్రికెటర్లు అంటే తగిన ఆకారం ఉండాలి కదా. జిమ్‌లో చెమటోడుస్తూ ఆకట్టుకునే శరీరాకృతి కలిగి ఉండాలి కదా. మరి బాహుబలి వంటి భారీ ఆకారం ఉంటే క్రికెట్‌కు ఎలా పనికొస్తారు. మంచి ఫిట్‌నెస్‌ లేనిదే జాతీయ జట్టు గడప ఎలా తొక్కుతారు? అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఆటకు వీటితో సంబంధం లేదని వీళ్లు నిరూపించారు. ఆకారానికే భారీకాయులు కానీ, మైదానంలోకి దిగితే మిగతా ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోలేమంటూ సత్తా చాటారు. భారీ షాట్లతో అలరించారు. చిరుత వేగంతో పరుగులు పెట్టారు. పక్షిలా ఎగిరి క్యాచ్‌లు కూడా అందుకున్నారు. అన్ని కలిపి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి క్రికెట్‌ ప్రపంచానికి తమ సత్తా చాటారు. ఇంతగా ఆకట్టుకున్న ‘ఆ అజానుభావులు’ ఎవరో ఓ లుక్కేద్దాం.

అప్పట్లోనే ఆర్మ్‌స్ట్రాంగ్‌

ఎత్తు ఆరడుగుల మూడు అంగుళాలు. బరువు ఏకంగా 133 కిలోలు. 1902-21 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రత్యేకత ఇది. అందరూ ‘ది బిగ్‌ షిప్‌’ అంటూ ముద్దుగా పిలుచుకునే వార్విక్‌ ఆల్‌రౌండర్‌గా అప్పట్లోనే ఆస్ట్రేలియా క్రికెట్‌కు విలువైన సేవలందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 50 టెస్టులాడి 2,863 పరుగులు చేశాడు. అందులో ఆరు శతకాలు, ఎనిమిది అర్థశతకాలున్నాయి. బౌలర్‌గానూ 87 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఘనమైన రికార్డే ఉందీ బాహుబలి క్రికెటర్‌కు. 269 మ్యాచ్‌లాడి 16,158 పరుగులు, 832 వికెట్లు తీసి అదరగొట్టాడు. 1920-21లో ఆసీస్‌ జట్టుకు సారథ్యం వహించాడు. ఇతని నాయకత్వంలో ఆసీస్‌ 10 మ్యాచ్‌లాడగా అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇందులో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ విజయం కూడా ఉంది. ఆకారం పరంగా భారీగా ఉండటంతో వార్విక్‌ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ కాకపోయినప్పటికీ స్ట్రోక్‌ప్లే మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. స్పిన్‌ బౌలర్‌గా తిప్పేస్తూనే ఫాస్ట్‌ బౌలింగ్‌లోనూ రాణిస్తూ నాటి రోజుల్లోనే ఎంతోమంది క్రికెటర్లుకు ఆదర్శంగా నిలిచాడు.

దేశవాళీ కస్చ్‌లా: 1970ల్లో జింబాబ్వే దేశవాళీ క్రికెటర్‌ రిచర్డ్‌ కస్చ్‌లా కూడా భారీకాయుడే. ఆరడుగుల ఎత్తు, 127 కిలోల బరువు ఉండే రిచర్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రాకున్నా దేశవాళీ టోర్నీలో మాత్రం సత్తా చాటాడు. తన మణికట్టుతో మాయ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. మొత్తం 48 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ 196 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్‌గానూ మెరిపించాడు. కానీ అతని ప్రదర్శన కేవలం దేశవాళీకే పరిమితమైంది. బంతితో ఆకట్టుకున్నా జాతీయ జట్టు నుంచి మాత్రం పిలుపురాలేదు. తర్వాతి కాలంలో జింబాబ్వే జాతీయ జట్టుకు సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 

ఇంగ్లిష్‌ ‘మిల్‌బర్న్’‌

1960ల్లో ఇంగ్లాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కొలిన్‌ మిల్‌బర్న్‌ కూడా క్రికెట్‌లో మరో బాహుబలే. 114 కిలోల బరువుండే కొలిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది మ్యాచ్‌లే.. అయినా నాటి క్రికెట్‌ అభిమానులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే ఆటగాడు. 1966-69 మధ్య కాలంలో 9 టెస్టుల్లో 46.71 సగటుతో 654 పరుగులు సాధించాడు. ఆకారం భారీగా ఉన్నా ఆటలో మాత్రం కొలిన్‌ గొప్ప హిట్టర్‌. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో బ్యాట్‌తో సత్తా చాటాడు. 255 మ్యాచ్‌ల్లో 13,262 పరుగులు సాధించాడు. అందులో 23 శతకాలు, 75 అర్ధశతకాలున్నాయి. 25 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కొలిన్‌ ఆరంభంలోనే చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌ సాఫీగా సాగుతున్న సమయంలో కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ ప్రమాదంలో ఎడమ కన్ను చాలావరకూ దెబ్బతింది. ఫలితంగా మూడేళ్లకే క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం క్రికెట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 

బెర్ముడా భారీకాయం‌

2007 ప్రపంచకప్‌ చూసిన ఏ భారత అభిమాని బెర్ముడా క్రికెటర్‌ డ్వేన్‌ లెవెరాక్‌ను అంత సులభంగా మర్చిపోరు. 127 కిలోలు ఉండే డ్వేన్‌ నాటి ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్‌తో అంతగా ఆకట్టుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్‌ ఉతప్ప(3) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న డ్వేన్‌ డైవ్‌ చేసి మరీ ఒంటిచేత్తో అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు బెర్ముడా క్రికెటర్ల సంబరాలు అంతా ఇంతా కావు. అదే మ్యాచ్‌లో బంతితో యువరాజ్‌ సింగ్‌(83)నూ బోల్తా కొట్టించాడు. ఆ ప్రపంచకప్‌కు బెర్ముడా అర్హత సాధించడంలో ఈ ఎడమ చేతి వాటం బౌలర్‌ కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 32 వన్డేలాడి 34 వికెట్లు పడగొట్టాడు. రెండు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2009(మూడేళ్లకే)లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా తన భారీకాయంతో ఎంతో క్రికెట్‌ అభిమానులను సంపాదించుకున్నాడు లెవెరాక్‌. 

పాక్‌ ఇంజమామ్‌‌

పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ కూడా కెరీర్‌ ఆరంభంలో భారీకాయుడే. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తు, 103.5 కిలోల బరువు కలిగిన ఇంజీ 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. చూడచక్కనైన షాట్లతో మెరుపు ఇన్నింగ్‌లాడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్రమంగా అదే జోరు కొనసాగిస్తూ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్‌ ఆరంభం వరకూ ఇతని ఆకారం భారీగానే ఉండేది. కానీ తర్వాత నుంచి శరీరాకృతిపై దృష్టి సారించి సుమారు పదిహేడు కిలోల దాకా బరువు తగ్గాడు. 
 

నా బరువు కారణంగా నేను ఎలాంటి విమర్శలకు గురికాకూడదని నిర్ణయించుకున్నాను. మరో ఆరు నెలల్లో నాలో గొప్ప మార్పును చూస్తారు. ఈ వయసులో బరువు తగ్గటానికి నేను చేసే ఇలాంటి సాహసాలు అంగీకరించలేము. కానీ జట్టు కోసం కఠిన నిర్ణయాలు తప్పవు. నాకు నేనుగా ముందుండి యువకులకు దిశానిర్దేశం చేస్తేనే టోర్నీలో మా జట్టు విజయవంతమవుతుంది. 

- 2003 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు ఇంజీ అన్న మాటలివి.

కానీ తర్వాతి కాలంలో బరువు తగ్గటం వల్ల తనకెలాంటి ఉపయోగం కలగలేదని.. పైగా కెరీర్‌లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందని ఇంజీనే స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఇక ఆట విషయానికొస్తే పాకిస్థాన్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాళ్ల జాబితాలో ఇంజీ కూడా ఉన్నాడు. మొత్తం అంతర్జాతీయ కెరీర్‌లో 120 టెస్టులు(8,830 పరుగులు), 378 వన్డేలు(11,739 పరుగులు) ఆడాడు. 245 ఫస్ట్‌క్లాస్‌(16,785 పరుగులు) మ్యాచ్‌లు కూడా ఆడాడు. జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. 31 టెస్టులు, 87 వన్డేల్లో పాక్‌కు సారథ్యం వహించాడు. 2007లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2012లో పాక్‌ జాతీయ జట్టుకు బ్యాటింగ్‌ విభాగంలో సేవలు అందించాడు. 2015లో కొంతకాలం అఫ్గానిస్థాన్‌ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. 2016లో పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు సెలక్టర్‌గా నియామకం అయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పాక్‌ సెమీస్ చేరకుండానే నిష్క్రమించడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

విండీస్‌ ‘కార్న్‌వాల్‌’‌.. 

ఎత్తు ఆరున్నర అడుగులు. బరువు 140 కిలోలు. చూడగానే భారీ ఆకారంతో భయపెట్టే వెస్టిండీస్‌ దేశవాళీ క్రికెటర్‌ కార్న్‌వాల్‌ ప్రస్తుత క్రికెట్‌లో మరో బాహుబలి. ఆల్‌రౌండర్‌గా సత్తాచాటుతున్న కార్న్‌వాల్‌ తాజాగా టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఒకవేళ తుది జట్టులో చోటు దక్కితే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన భారీ ఆకారమున్న వ్యక్తిగా చరిత్రలోకెక్కుతాడు. 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన అతను 24.43 సగటుతో 2224 పరుగులు చేయడంతో పాటు 260 వికెట్లు తీశాడు. 2017లో భారత్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పుజారా, కోహ్లి, రహానె లాంటి ఆటగాళ్లను ఔట్‌ చేశాడు. ఆట పరంగా అత్యుత్తమంగా కనిపిస్తున్నా ఆకారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐతే అతనిపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టి, బరువు తగ్గేలా చూస్తామని గతేడాది సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కౌర్ట్నీ బ్రౌన్‌ అప్పుడు చెప్పాడు. కార్న్‌వాల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఆటకు పూర్తి ఫిట్‌గా మార్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నామని బ్రౌన్‌ తెలిపాడు. అతని ఆకారంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ఆందోళన చెందట్లేదు. మరి త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడనున్న కార్న్‌వాల్‌ ఇప్పటివరకూ ఉన్న ‘బాహుబలి’ క్రికెటర్ల మాదిరిగా మెప్పిస్తాడో లేదో చూడాల్సిందే.

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.