close

తాజా వార్తలు

క్షణాల్లో బదిలీ... సమస్య వస్తే?

ఒకప్పుడు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బు బదిలీ చేయాలంటే.. కొన్ని రోజులు పట్టేది. మరి.. ఇప్పుడు క్షణాలే. ఇదంతా స్మార్ట్‌ ఫోన్‌ వల్లే సాధ్యమవుతోంది. ఎన్నో విషయాల్లో ఇప్పుడు ఇది మన జీవితంలో భాగమయ్యింది. బ్యాంకింగ్‌ సంబంధిత లావాదేవీలకూ ఇది కీలకం అయ్యింది. ముఖ్యంగా మొబైల్‌ వ్యాలెట్ల వాడకం బాగా పెరగడంతో.. కొన్ని సమస్యలూ వస్తున్నాయి. మరి, వీటిని ఎలా పరిష్కరించుకోవాలి చూద్దామా!
న జేబులో పెట్టుకునే సాధారణ వ్యాలెట్‌కు డిజిటల్‌ రూపమే ఈ-వ్యాలెట్‌ లేదా మొబైల్‌ వ్యాలెట్లుగా అనుకుంటున్నాం. మన బ్యాంకు ఖాతాను ఈ తరహా వ్యాలెట్లతో అనుసంధానించడం ద్వారా పలు సేవలను పొందేందుకు అవకాశం కలుగుతోంది. వీటిలో ఉన్న సౌలభ్యం నేపథ్యంలో చాలామంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులోనూ కొన్ని వ్యాలెట్లలో ముందుగా నగదు నింపి వాడుకునే వీలుంటుంది. మరికొన్నింటిలో అప్పటికప్పుడే.. యూపీఐ ఇంటర్ఫేస్‌ ద్వారా నగదు బదిలీ జరుగుతుంది. వేగంగా నగదు బదిలీ కావడంతో కొనుగోళ్లు, సేవలను పొందేప్పుడు ఎక్కువమంది నగదుకు బదులుగా వీటినుంచే ఆయా చెల్లింపులను చేసేస్తున్నారు. పైగా ఇందులో కొన్ని ఆకర్షణీయమైన బహుమతులు, రివార్డులను కూడా అందిస్తోండటంతో వీటిపట్ల ఆకర్షణ పెరుగుతోంది.
సౌలభ్యం వెంట కొన్ని ఇబ్బందులూ వెన్నంటి ఉంటాయి. ఇలా కొన్నిసార్లు మన ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయినా.. అవతలి వారి ఖాతాలో జమకాకపోవచ్చు. ఇలా సాధారణంగా వచ్చే కొన్ని సమస్యలు.. వాటికి ఉన్న పరిష్కారాలేమిటి?
* వాలెట్‌ నుంచి వాలెట్‌కు నగదు బదిలీ: ఈ రకమైన లావాదేవీలలో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. సాంకేతిక సమస్యల వల్ల లావాదేవీ పూర్తి కాకపోతే.. కొద్ది సమయంలోనే తిరిగి మన వ్యాలెట్‌కు డబ్బులు జమ అవుతాయి. ఏదన్నా కారణంతో 24 గంటల తర్వాతా రాకపోతే.. వ్యాలెట్‌లో ఉండే ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదును నమోదు చేయాలి.
* వ్యాలెట్‌ నుంచి బ్యాంకు లేదా ఇటు నుంచి అటు: ఇటువంటి లావాదేవీలు ఎక్కువగా ఎన్‌పీసీఐ పేమెంట్‌ సిస్టం ద్వారా జరుగుతాయి. ఏదేని సందర్భంలో బ్యాంకు ఖాతాకు నగదు జమ కానప్పుడు.. వాలెట్‌లోనే ఫిర్యాదుల విభాగంలో మీ సమస్యను పేర్కొనాలి.
* మోసపూరిత లావాదేవీలు: మన ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలను ఇలా పేర్కొనవచ్చు. ఇలాంటప్పుడు మన డబ్బు నష్టపోతే...
ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసినప్పుడు.. మోసపూరిత లావాదేవీల వల్ల నగదు నష్టపోతే రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం వచ్చే ఏర్పాటు ఉంది. ఇదే నిబంధనలు మొబైల్‌ వ్యాలెట్లలో జరిగే మోసపూరిత లావాదేవీలకు వర్తిస్తాయి.
మొబైల్‌ వ్యాలెట్‌ ఖాతాదారులకు ప్రతి లావాదేవీ సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా తప్పక అందాలి. ఇలా లావాదేవీ సమాచారం వచ్చినప్పుడు.. అందులో మీ ప్రమేయం లేనప్పుడు వెంటనే ఆయా మొబైల్‌ వ్యాలెట్ల 24 గంటల సేవా కేంద్రానికి ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలి, మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌లోనూ, ఈ మెయిల్‌ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు.
మన ప్రమేయం లేకుండా.. ఏదైనా లావాదేవీ జరిగితే.. సంక్షిప్త సందేశం వచ్చిన మూడు రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. ఏదేని కారణంతో మన ఫిర్యాదు 4-7 రోజులలోపు చేస్తే లావాదేవీ సొమ్ము కానీ, రూ.10,000లలో ఏది తక్కువైతే అది వస్తుంది. 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే వ్యాలెట్‌ కంపెనీ బోర్డు పాలసీ ప్రకారం రిఫండ్‌ వస్తుంది. మన ఫిర్యాదు అందిన తేదీ నుంచి 10 రోజుల్లోగా రిఫండ్‌ను తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.
మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారుడి బాధ్యతను రుజువు చేసే భారం కూడా వ్యాలెట్‌ సంస్థలపైనే ఉంటుంది. ఇతర వివాదాలు ఏమైనా ఉంటే.. 90 రోజుల్లోపు పరిష్కరించాల్సిన బాధ్యతా వ్యాలెట్‌ సంస్థలదే.
ఒకవేళ సరైన పరిష్కారం లభించలేదు అనుకుంటే. ఖాతాదారులు అంబుడ్స్‌మన్‌ వద్ద ఫిర్యాదును దాఖలు చేయొచ్చు. ముందుగా వ్యాలెట్‌ సంస్థల్లో ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి. ఆన్‌లైన్‌లోనూ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. మీ ఫిర్యాదుతోపాటు అవసరమైన పత్రాలు, మీరు ఎంత పరిహారం కోరుకుంటున్నారు అనే వివరాలనూ తెలియజేయాల్సి ఉంటుంది.

- ఫణి శ్రీనివాసు, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.