close

తాజా వార్తలు

పాక్‌కు అంత సీన్‌ లేదు..

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: జమ్మూకశ్మీర్‌ను విభజించడంతో పాటు ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమైనప్పటికీ.. ఈ విషయంతో తనకు సంబంధం ఉన్నట్టుగా పాక్‌ అనవసర రాద్ధాంతం చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా ఆ దేశ మంత్రులు, సైనికాధికారులు యుద్ధవాతావరణాన్ని సృష్టించేలా పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయంగా భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించిన శత్రు దేశానికి తల బొప్పి కట్టేలా ప్రపంచ దేశాలు సమాధానం చెబుతున్నా బుద్ధిరావడంలేదు. గతంలో అమెరికా లాంటి దేశాల జోక్యం కోరినా.. ఐక్యరాజ్య సమితి తలుపులు తట్టినా పాక్‌కు ఎక్కడికక్కడే షాక్‌ల మీద షాక్‌లే తగులుతున్నాయి. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పాక్‌కు తెలిసినా కశ్మీర్‌లోని ప్రజలకు తామేదో చేస్తున్నామని పోజు కొడుతూ తమ దేశంలోని అతివాదులను సంతృప్తిపరచాలన్న ఏకైక లక్ష్యంతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అంతర్జాతీయ సమాజం ముందో దోషిలా నిలబడాల్సిన దుస్థితికి చేరింది. కశ్మీర్‌ భారత్‌లోని అంతర్భాగం. ఇది భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక చర్చలతో తేల్చుకోవాలని ప్రపంచ దేశాలు తేల్చి చెబుతున్నా చర్చలకు ఏమాత్రం సుముఖత వ్యక్తంచేయకుండా ఇతర దేశాల జోక్యాన్ని కోరుకోవడం, యుద్ధ వాతావరణాన్ని సృష్టించేలా అనవసర వ్యాఖ్యానాలు చేయడం ద్వారా లేని ఢాంబికాన్ని పాకిస్థాన్‌ ప్రదర్శిస్తోందని, పాక్‌కు అంత సీన్‌లేదని పలువురు భద్రతారంగం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాక్‌కు యుద్ధం సాధ్యమయ్యే పనేనా?

పాకిస్థాన్‌కు చెందిన కొందరు మంత్రులు, నేతల ప్రకటనలు చూస్తుంటే.. కశ్మీర్‌ అంశంపై మరింత ఉద్రిక్తతలు పెరిగి ఇరు దేశాల మధ్య అణు యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన రేకెత్తించేవిగా ఉంటున్నాయి. అసలు పాక్‌కు అణు యుద్ధం సాధ్యమా? అంత బలగం, సామర్థ్యం ఆ దేశానికి ఉన్నాయా? ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అది అంత సులభం కాదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌ కోసం పాకిస్థాన్‌ అణు యుద్ధానికి భారత్‌తో సై అంటుందా? ఒకవేళ అణు యుద్ధమే జరిగితే కశ్మీర్‌లోనే విధ్వంసం జరగడంతో అది ఆగిపోదని.. దీని పరిణామాలు ప్రపంచ దేశాలపైనా తీవ్రంగా ఉంటుందని.. అందువల్ల పాక్‌ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు‌. ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేవిగా ఉన్నాయని.. వీటిని భారతీయులెవరూ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమే లేదని పేర్కొంటున్నారు. కశ్మీర్‌లో ఉండే ప్రజలకు ఏదో చేస్తున్నామని పాక్‌లోని అతివాదులను సంతృప్తి పరచేందుకే ఇమ్రాన్‌ ఖాన్‌ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

అది మన అంతర్గత అంశం..

అణుయుద్ధం గురించి పాక్‌ మాట్లాడుతున్నా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలను లెక్కచేయనక్కర్లేదు. ఎందుకంటే ఆర్టికల్‌ 370 రద్దు అనేది మన అంతర్గత విషయం. మన రాజ్యాంగంలో ఏ సవరణ చేయాలన్నా అది మన ఇష్టం. పాక్‌కు ఏంటి సంబంధం? అందువల్ల మనం యుద్ధం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదు.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు యథాతథ పరిస్థితి కొనసాగాలని భారత్‌ కోరుకుంటోంది.  కానీ పాకిస్థాన్‌ వీటన్నింటినీ మార్చాలని ప్రయత్నం చేస్తోంది. కానీ యుద్ధానికి ఆ దేశం సై అనే అవకాశం లేదు.. ఎందుకంటే ఆ దేశానికి అంత సామర్థ్యం లేదు. పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుంటుపడింది. తగిన ఆర్థిక వనరులు లేవు. యుద్ధ సామగ్రి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి పాక్‌కు మనతో యుద్ధం సాధ్యమయ్యే పనేనా?

పాక్‌ కీలక నగరాలన్నీ కనుమరుగే?

ఒకవేళ అణుయుద్ధం జరిగితే పాక్‌ సైన్యం అంతరించిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దేశం యుద్ధం దిశగా ఆలోచించే అవకాశమే లేదని అంటున్నారు. యుద్ధంతో భారత్‌కు పోయేదేమీ ఉండదు. అణుబాంబులతో పాక్‌ను మాత్రం భారత్‌ అంతం చేయగలదు. పాకిస్థాన్‌కు చెందిన ముఖ్యమైన, ఆర్థికంగా అండదండలిచ్చే నగరాలు భారత సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్నాయి.లాహోర్‌, రావల్పిండి, ఇస్లామాబాద్‌, సియోల్‌కోట్‌, కరాచీ ఇవన్నీ భారత్ సరిహద్దుకు సమీపంలోనే ఉండటంతో యుద్ధం జరిగితే ఇవన్నీ తుడుచుపెట్టుకుపోవడం ఖాయం.

పాక్‌తో ప్రమాదంలేదు.. కానీ!

పాకిస్థాన్‌తో మనకు అంత ప్రమాదమైతే ఏమీ ఉండదు గానీ.. కశ్మీర్‌ విషయంలో ఆ దేశం చేస్తోన్న న్యూసెన్సే మనకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. కశ్మీర్‌పై అనవసర జోక్యంతో  వివాదాస్పద అంశంగా మార్చేందుకు నిత్యం పాక్‌ అక్కడ కాచుకొని కూర్చుంటోంది. పైగా, ఉగ్రవాదులను తయారుచేసి సైన్యమే కశ్మీర్‌లోకి పంపడం సిగ్గుచేటు వ్యవహారం. ఇలాంటి వికృత చేష్టలతో మానవహననానికి కారణభూతమవుతున్న పాక్‌ వైఖరిని ఐరాసలో భారత్‌ సరిగానే అడ్డుకుంటోంది. అందువల్లే పాక్‌కు మద్దతు తెలిపేందుకు ఏ ఒక్క దేశమూ ముందుకు రావడంలేదు. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణను ఐరాస నిర్వహించాలంటే గతంలో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం పాక్‌ బలగాలు కూడా పీవోకే నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీనికి పాక్‌ నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రావణ కాష్ఠంలా మండుతూనే ఉన్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.