close

తాజా వార్తలు

అలుపెరగని పోరాటంలో సచిన్‌ ద్విశతకం

అభిమానులకు అతడు ఆరాధ్య దైవం. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనేది అతడి సిద్ధాంతం. 24 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్‌లో ఎన్నో వేల పరుగులు. లెక్కకట్టలేని రికార్డులు. క్రికెట్‌ చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలు. అతడి ఆట కోసమే మైదానానికి వచ్చేవాళ్లు, టీవీలకు అతుక్కపోయేవాళ్లు కోకొల్లాలు. అతడి విధ్వంస ఇన్నింగ్స్‌లు ప్రత్యర్థులకు పీడ కలలు. ఏ ఆటగాడు సాధించలేని శతక శతకాలు అతడి సొంతం. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా క్రికెట్‌ దిగ్గజం సచిన్ రమేశ్‌ తెందూల్కర్‌ గురించే అని. సచిన్‌ సాధించిన రికార్డులు చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోదంటే అతియోశక్తి కాదు! 19 ఏళ్ల వయసులో ప్రమాదకరమైన పెర్త్‌ పిచ్‌పై ఆసీస్‌ దిగ్గజ పేసర్లను ఎదుర్కొన్న అతడి తీరు అద్భుతం. ఆ ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన 114 పరుగులు వెలకట్టలేనివి. చెన్నైలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వెన్నునొప్పితో కూడా పోరాడిన తీరు అమోఘం. ఇలా ఎన్నో ఇన్నింగ్స్‌లో అసాధారణమైన ప్రదర్శన చేశాడు. 2010లో దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం  క్రికెట్‌ ప్రపంచాన్నే ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్‌ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. మరో కొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతున్న నేపథ్యంలో సచిన్‌ చరిత్రాత్మక ద్విశతక ఇన్నింగ్స్‌ను ఓ సారి చూద్దాం...

16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టిన సచిన్‌ ‘క్రికెట్ దేవుడి’గా తన క్రికెట్‌ ప్రయాణాన్ని ముగించాడు. అంచనాలు లేకుండా అరంగ్రేటం చేసిన అతడు క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనాలు సృష్టించాడు. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరుతో తిరగరాసుకున్నాడు. సచిన్‌ అంటే రికార్డులు.. రికార్డులు అంటే సచిన్‌ అనే రీతిలో చెలరేగిపోయాడు. వన్డేల్లో, టెస్టుల్లో పరుగుల వరద పారించాడు. వయసు మీద పడుతున్నా జోరు తగ్గించలేదు. సహచరులంతా వెనుదిరుగుతున్నా స్కోరుబోర్డుని పరుగులు పెట్టించమే లక్ష్యంగా ఆడేవాడు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో కోట్లాది క్రికెట్‌ అభిమానుల ఆశల భారాన్ని 24 ఏళ్లు మోశాడు. అతడి సువర్ణధ్యాయంలో సఫారీలపై డబుల్‌ సెంచరీ ఓ మైలురాయి.

2010లో భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. కానీ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ప్రవీణ్‌ కుమార్‌ ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకుందామని రెండో వన్డేలో బరిలోకి దిగిన సఫారీలకు చుక్కెదురైంది. ఆదిలోనే డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఔట్‌ చేసిన ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేకపోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌తో కలిసి మాస్టర్‌ బ్లాస్టర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 194 పరుగులు చేశారు. కార్తీక్‌ ఔటైన అనంతరం యూసఫ్‌ పఠాన్‌ మెరుపులు మెరిపించి వెనుదిరిగాడు. అప్పటికీ సచిన్‌ 150 పూర్తిచేసుకున్నాడు. 

పెరిగిన ఉత్కంఠ:
పఠాన్‌ ఔటైన తర్వాత ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. ధోనీ స్ట్రైకింగ్‌ ఎక్కువగా తీసుకుంటూ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 ఓవర్లకు సచిన్‌ 190 పరుగులు పూర్తిచేశాడు. 191 నుంచి ఒక్కో పరుగు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. చూస్తుండగానే ధోనీ 17 పరుగుల నుంచి 60 పరుగులు పూర్తిచేశాడు. స్ట్రైకింగ్‌ ఎక్కువ రాకపోవడంతో సచిన్‌ మాత్రం 190ల్లోనే ఉన్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ అది. అభిమానుల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. 50వ ఓవర్‌లో మూడో బంతిని ఫీల్డర్ల మధ్యలో నుంచి సచిన్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బౌండరీకి ప్రయత్నించాడు. ఫీల్డర్ దానిని నివారించడంతో సింగిల్‌ తీసి ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను అందుకున్న సచిన్‌ మరో అద్భుతాన్ని సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

‘‘నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది అభిమానులకి. మీ అందరికీ ధన్యవాదాలు. ‘సచిన్‌.. సచిన్‌..’  అంటూ మీరు చేసే నినాదాలు తుది శ్వాస వరకు నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి’’: సచిన్‌

ఇప్పటివరకు వన్డేల్లో సచిన్‌ తర్వాత ఏడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో నాలుగు భారత్‌ ఆటగాళ్లవే. 2011లో వెస్టిండీస్‌పై సెహ్వాగ్‌ 219 పరుగులు చేశాడు. అతడి తర్వాత హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ బాదాడు. ఆసీస్‌పై ఒక సారి, శ్రీలంకపై రెండు సార్లు ద్విశతకం చేశాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌ గేల్‌, కివీస్‌ ఆటగాడు మార్టిన్ గుప్తిల్,  పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ కూడా ద్విశతకాన్ని అందుకున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.