close

తాజా వార్తలు

భారత్‌పై డివిలియర్స్‌ ముద్ర..

దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ప్రత్యేక కథనం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: క్రికెట్‌లో చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు కొందరు బ్యాట్స్‌మన్‌. అలాగే ఏ జట్టుకైనా కొందరు అత్యుత్తమ ఆటగాళ్లుంటారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఎంతో మంది హేమాహేమీలు ఉన్నా వాళ్లందరిలో.. అతడో ప్రత్యేకం. స్టైలిష్‌ షాట్లకు మారుపేరైనా, మిస్టర్‌ 360గా పేరుగాంచినా.. నవతరం క్రికెట్‌లో అతడో సంచలనం. ఇక్కడ చెప్పేది ఏబీ డివిలియర్స్‌ గురించే అని ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు. తన బ్యాటింగ్‌తో స్టేడియం చుట్టూ బౌండరీలు సాధించే అతడు దక్షిణాఫ్రికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆటగాడికి భారత్‌లోనూ అమితమైన అభిమానులు ఉన్నారు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సఫారీల జట్టులో డివిలియర్స్‌ చేరాక అతడు లేని భారత పర్యటన ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో డివిలియర్స్‌పై ప్రత్యేక కథనం..

భారత్‌, పాక్‌లపైనే ద్విశతకాలు

2008లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా డివిలియర్స్‌ టెస్టు క్రికెట్‌లో తొలిసారి డబుల్‌ సెంచరీ సాధించడం విశేషం. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. స్టెయిన్‌ ధాటికి 76 పరుగులకే కుప్పకూలింది. ఆపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 494 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. డివిలియర్స్‌ ‌(217 నాటౌట్‌) చెలరేగడంతో టీమిండియాపై తొలి ద్విశతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆపై 2010లో పాకిస్థాన్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేశాడు. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీల జట్టు 584/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అప్పుడు డివిలియర్స్‌(278 నాటౌట్‌) భారీ ద్విశతకంతో పాటు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో పోరాడిన పాకిస్థాన్‌ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

వన్డేల్లో టీమిండియాపై వరుస శతకాలు

వన్డేల్లో టీమిండియాపై మొత్తం ఆరు శతకాలు బాదిన డివిలియర్స్‌ 2010 పర్యటనలో రెండు శతకాలు, 2015లో మూడు శతకాలు సాధించాడు. 2010 పర్యటనలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ వన్డేల్లో తొలిసారి ద్విశతకం సాధించిన రోజే డివిలియర్స్‌ భారత జట్టుపై తొలి వన్డే శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టంతా విఫలమైనా మిస్టర్‌ 360 ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. తర్వాతి మ్యాచ్‌లో కలీస్‌తో కలిసి మరో విరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 59 బంతుల్లోనే 102 పరుగులు చేసి సఫారీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై 2015 పర్యటనలో సఫారీల జట్టు వన్డే సిరీస్‌ గెలవడంలో డివిలియర్స్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి వన్డేలో శతకం బాదిన డివిలియర్స్‌ తర్వాత నాలుగు, ఐదో వన్డేల్లో వరుస శతకాలు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. డివిలియర్స్‌ వల్లే దక్షిణాఫ్రికా ఆ వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది.

డివిలియర్స్‌ ఇతర రికార్డులు

2015 ప్రపంచకప్‌కి నెలరోజుల ముందు వెస్టిండీస్‌పై విధ్వంసం సృష్టించాడు డివిలియర్స్‌. కేవలం 44 బంతుల్లో 149 పరుగులు చేసి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 16 సిక్సులతో చెలరేగిపోయిన మిస్టర్‌ 360 వన్డేల్లో 338.63 అత్యధిక స్ట్రైక్‌రేట్‌ సాధించాడు. కాగా స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ అదే ఏడాది మరో అద్భుతమైన రికార్డు సాధించాడు. క్రికెట్‌లో ఇప్పటివరకూ ఏ బ్యాట్స్‌మన్‌కూ సాధ్యంకాని.. అతి తక్కువ బంతుల్లో అర్ధశతకం, శతకం, 150 పరుగులు సాధించడం విశేషం. 16 బంతుల్లో అర్ధశతకం, 31 బంతుల్లో శతకం, 64 బంతుల్లో 150 పరుగులు.. బహుశా భవిష్యత్‌లోనూ మరే ఇతర క్రికెటర్‌ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం లేదనిపిస్తోంది! ఇక చెప్పుకోదగ్గ మరో రికార్డు వన్డేల్లో 75 బంతుల్లోనే ఎనిమిదిసార్లు శతకం బాదడం. ఈ రికార్డు సాధించిన ఒకేఒక్క క్రికెటర్‌ డివిలియర్స్‌. అతడి తర్వాత సెహ్వాగ్‌ ఆరు, సనత్‌ జయసూర్య ఐదు, అఫ్రిది నాలుగు సార్లు మాత్రమే 75 బంతుల్లో శతకం సాధించారు. 

ఐపీఎల్‌లో డివిలియర్స్‌ 

ఐపీఎల్‌లోనూ డివిలియర్స్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక్కడ ఆడి భారత అభిమానులకు చేరువయ్యాడు. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తరఫున సుధీర్ఘ కాలంగా ఆడుతున్న అతడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీకి సన్నిహితుడయ్యాడు. ఐపీఎల్‌లో కోహ్లీతో కలిసి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు డివిలియర్స్‌. మొత్తం 154 మ్యాచ్‌లు ఆడిన అతడు 4395 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో మొత్తం మూడు శతకాలు సాధించగా 133 నాటౌట్‌ అత్యుత్తమ స్కోర్‌ నమోదు చేశాడు. 39.95 సగటుతో 151.23 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. కాగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా ఫర్వాలేదనిపించాడు. 

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు అర్ధాంతరంగా గుడ్‌బై చెప్పిన డివిలియర్స్‌ ప్రస్తుతం పలుదేశాల్లో టీ20 లీగ్‌లు ఆడుతున్నాడు. ప్రపంచకప్‌ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలను వివరిస్తూ మెగా ఈవెంట్‌ తర్వాత డివిలియర్స్‌ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన ఆ జట్టు మెగా ఈవెంట్‌ తర్వాత భారత పర్యటనకు వచ్చింది. మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. డివిలియర్స్‌ లేని జట్టు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో ఆ జట్టు ఎలా ఆడనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వర్షం కారణంగా ధర్మశాలలో తొలి టీ20 రద్దవ్వగా బుధవారం మొహాలీలో రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఇది వరకు డివిలియర్స్‌ ఆటకోసం మ్యాచ్‌లు చూసే భారత అభిమానులు ఇప్పుడు అతడి ఆటని మిస్‌ అవుతుండటం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.