close

తాజా వార్తలు

సమం చేశాడు.. సమరానికి సిద్ధమేనా?

డికాక్‌.. సఫారీలను టీ20ల్లో ముందుకు తీసుకెళ్లగలడా?

పొట్టి క్రికెట్‌లో గతనెల వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలిచిన భారత జట్టు సఫారీలపైనా విజయం సాధించి వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు బలమైన పునాది వేయాలని భావించింది. అయితే టీమిండియా ఆశలపై నీళ్లు చల్లి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ తన సారథ్య బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ డ్రాగా ముగిసింది. దక్షిణాఫ్రికా బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా డికాక్‌ పొట్టి సీరీస్‌ను సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా యువ ఆటగాళ్లతో భారత పర్యటనకు రాగా డికాక్‌ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. 2018లో శ్రీలంకపై అనుకోకుండా తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన డికాక్‌ జట్టును గెలిపించకపోయినా, దక్షిణాఫ్రికా బోర్డు అతడిపై నమ్మకంతో భారత పర్యటనలో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా నియమించింది. 

సిరీస్‌కు ముందు ఏమన్నాడంటే?

టీ20 సిరీస్‌ ప్రారంభానికి ముందు డికాక్‌ మాట్లాడుతూ కెప్టెన్‌గా మారడం వల్ల తనపై అదనపు బాధ్యతలు పెరిగాయని, ఇది తన కెరీర్‌లో మరో ముందడుగని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా సారథిగా తనపై ఎలాంటి ప్రభావమైనా పడొచ్చని.. అది మంచైనా లేదా చెడైనా కావొచ్చని చెప్పాడు. శక్తిమేరా రాణించి జట్టును ముందుకు తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు. ప్రస్తుత జట్టులో యువకులే ఉన్నారని, వారిని స్వేచ్ఛగా ఆడనిచ్చి మంచి ఫలితాలు రాబడతానని వెల్లడించాడు. డికాక్‌ చెప్పినట్టే రెండో మ్యాచ్‌లో విఫలమైనా మూడో టీ20లో జట్టును విజయపథంలో నడిపించాడు. డివిలియర్స్‌, ఆమ్లా, డుప్లెసిస్‌ తనని ఇలాగే ప్రోత్సహించారని, తను కూడా యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తానని వెల్లడించాడు. ఈ సిరీస్‌లో తమ జట్టు గెలిచినా, ఓడినా ఫర్వాలేదని.. ఆటలో ఉన్నంతసేపు పోరాడాలని మాత్రమే ఆటగాళ్లకు చెబుతానన్నాడు. అలా ఆడినంత సేపు ప్రత్యర్థిపై పైచేయి సాధించినట్టేనని డికాక్‌ వివరించాడు. 

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు

ధర్మశాలలో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికాను కెప్టెన్‌ డికాక్‌(52) ఆదుకోవడంతో 149 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(72 నాటౌట్‌) టీమిండియాని గెలిపించాడు. అలాగే బెంగళూరులో మూడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 135 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం డికాక్‌(79 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా సునాయాస విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అతడు జట్టు స్కోరును ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడు. మరోవైపు రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్‌లో పుంజుకుంది. యువ బౌలర్లు బ్యారాన్‌ హెండ్రిక్స్‌, తబ్రైజ్‌ శంషీ, ఫోర్టుయిన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత బ్యాటింగ్‌ లైనప్‌ను కుదేలు చేయడంలో విజయవంతమయ్యారు.

ఒక్క విజయంతో తేల్చలేం:

దక్షిణాఫ్రికా జట్టు 2015లో చివరిసారి భారత పర్యటనకు రాగా టీ20‌, వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అప్పుడు ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌, హషీమ్‌ ఆమ్లా లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ ఉండగా ఇప్పుడంతా యువ ఆటగాళ్లే ఉన్నారు. అప్పటి జట్టులో ఆడిన డికాక్‌, మిల్లర్‌, రబాడ మాత్రమే ప్రస్తుత సిరీస్‌లో పర్యటిస్తున్నారు. ఈ ముగ్గురు మినహా మిగతా జట్టంతా యువ ఆటగాళ్లతో కూడుకున్నదే. అయితే వీరికి అనుభం లేకున్నా మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు. సిరీస్‌ ప్రారంభానికి ముందు.. అనుభవం లేని సఫారీ ఆటగాళ్లపై టీమిండియా పైచేయి సాధిస్తుందని అంతా అనుకున్నారు. రెండో మ్యాచ్‌ ఫలితం చూస్తే అదే నిజమనిపించింది. అయితే మూడో టీ20లో పుంజుకున్న ఆ జట్టు భారత్‌పై సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. అయితే, డికాక్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా మున్ముందు ఎలా ఆడబోతుందో చూడాలి. ఒక మ్యాచ్‌లో విజయవంతమైనంత మాత్రాన ఇప్పుడే అతడి కెప్టెన్సీపై అంచనాలకు రాలేము. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌ ముందు మరిన్ని జట్లపై వరుస విజయాలు సాధిస్తే.. అప్పుడు అతడి కెప్టెన్సీ సామర్థ్యం తెలుస్తుంది.

                                                                                                                          - ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.