
తాజా వార్తలు
ఇమ్రాన్ ప్రసంగంపై గులాలై ఇస్మాయిల్ తీవ్ర నిరసన
న్యూయార్క్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ)లో చేసిన ప్రసంగంపై ఆ దేశ పౌర హక్కుల ఉద్యమ నేత గులాలై ఇస్మాయిల్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. పాక్ వంచనతో ప్రవర్తిస్తోందని.. ఉగ్రవాద నిర్మూలన పేరుతో ఆ దేశంలో వేలాది మందిని దారుణంగా చంపుతోందని ఆమె మండిపడ్డారు. పాకిస్థాన్ సైన్యం అక్కడి మహిళలపై అత్యంత కిరాతకంగా పాల్పడుతున్న లైంగిక దారుణాలపై ఇస్మాయిల్ గళమెత్తారు. దీంతో ఆమెపై పాక్ ప్రభుత్వం దేశ ద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో ఆ దేశం నుంచి పారిపోయి అమెరికాలో తన సోదరి వద్ద తలదాచుకుంటున్న ఇస్మాయిల్.. నిన్న రాత్రి పాకిస్థాన్ ప్రధాని ఉగ్రవాద నిర్మూలన పేరిట చేసిన ప్రసంగం వంచనతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో అమాయకమైన పస్థూన్లను అక్కడి సైన్యం దారుణంగా బలితీసుకుంటోందని.. మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది అమాయకులను నిర్బంధ కేంద్రాల్లో బంధించి చిత్ర హింసలకు గురిచేస్తోందన్నారు.
గత కొన్ని రోజుల క్రితం ఆఫ్గనిస్థాన్ రేడియో విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను అమెరికాకు వచ్చే ముందు ఆరు మాసాలపాటు పాకిస్థాన్‌లో రహస్యంగా తలదాచుకున్నానన్నారు. అనంతరం కొందరు స్నేహితుల సాయంతో శ్రీలంకకు వెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన సోదరితో కలిసి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉంటున్నాననీ.. రాజకీయ ఆశ్రయం కోరుతూ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. తాను పాక్ నుంచి తప్పించుకొని అమెరికాకు వచ్చినప్పటికీ అక్కడ ఉన్న తన తల్లిదండ్రులు, తనకు సహకరించిన స్నేహితుల గురించి ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. అమెరికా తనను వెళ్లగొడుతుందని పాకిస్థాన్ అనుకుంటోందనీ.. కానీ పాకిస్థాన్‌పై తన పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆమె ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.