close

తాజా వార్తలు

ఔను.. పాక్‌ ఓటమిని అంగీకరించిందిలా!

మలీహాపై వేటు.. మరో వివాదాస్పదుడికి చోటు! 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : ఇమ్రాన్‌ ఖాన్‌ ఐరాసలో ప్రసంగాన్ని ముగించుకొని పాక్‌కు రాగానే అక్కడ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఐరాస పర్యటనలో సమయానికి మించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. కేవలం రెండు దేశాలే బలంగా మద్దతు తెలిపాయి. ఈ అవమానాన్ని దిగమింగుకొని స్వదేశానికి వెళ్లిన ఇమ్రాన్‌ వెంటనే కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఐరాసలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీపై వేటు వేశారు. ఆమె స్థానంలో మరో వివాదాస్పదుడు మునీర్‌ అక్రమ్‌ను నియమించారు. భారత్‌ను ఐరాలో ఎండగట్టామని పాక్‌ పైకి  గర్వంగా చెబుతున్నా.. అక్కడ వారికి విజయం ఏమీ దక్కలేదనే విషయం లోధీపై వేటుతో తేలిపోయింది. ఐరాసలో పాక్‌కు విశేష స్పందన లభిస్తే అక్కడి శాశ్వత రాయబారిని మార్చాల్సిన అవసరం ఏముంది..? ఈ విషయం పక్కన పెడితే మలీహా లోధీ మొదటి నుంచీ వివాదాస్పదురాలే. ఆమె ఏమాత్రం కసరత్తు చేయకుండా ఐరాస సెషన్స్‌కు వస్తారనే విమర్శ ఉంది. 

లోధీ బలిపశువు..

ఇమ్రాన్‌ ఖాన్‌ ఐరాస పర్యటనకు మలీహా లోధీనే రూపశిల్పి. ఇమ్రాన్‌ పర్యటన విఫలమవడం వెనుక ఆమె పాత్ర ఉందని పాక్‌ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఐరాసలో ఇప్పటి వరకు అత్యంత వివాదాస్పద ప్రసంగాలు చేసిన వారి జాబితాలో ఇమ్రాన్‌ పేరు కూడా చేరిపోయింది. గతంలో లిబియా నేత గడాఫీ, వెనిజులా నేత ఛావెజ్‌, ఇజ్రాయిల్‌ నేత నెతన్యాహూల ప్రసంగాలు విమర్శలపాలయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇమ్రాన్‌ కూడా చేరారు. ఆ మాటకొస్తే, ఇమ్రాన్‌ అమెరికాలో అడుగుపెట్టినప్పుడు కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు లోధీ తప్ప పెద్దగా ఎవరూ రాలేదు. యూఎన్‌జీఏకు వచ్చే దేశాధినేతల సంఖ్య భారీగా ఉండటంతో ఇది సాధ్యం కాలేదని అనుకోవచ్చు.  కానీ భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించడం మాత్రం పాక్‌ వర్గాలకు మింగుడు పడలేదు.  ఆ తర్వాత  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీలో కూడా ఆశించిన ప్రకటనలు ఏమీ వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడు పాక్‌ ప్రధానిని అనునయించి పంపించారు.  ఐరాసలో పాక్‌కు మద్దతు కరవైంది. ఐరాసలో బలంగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేయాల్సిన లోధీ విఫలమయ్యారు. ఫలితం పాక్‌ ఇమేజ్‌పై బలంగా పడింది. ఒక్క టర్కీ, మలేషియాలు తప్ప ఆ దేశానికి కశ్మీర్‌ విషయంలో మద్దతు పలికిన వారే లేరు. ఇక బంగ్లాదేశ్‌ ఏకంగా పాక్‌ చేసిన అరాచకాలను మరోసారి ఐరాస వేదికపై ప్రస్తావించింది. ఇవన్నీ కలగలిసి ఇమ్రాన్‌ యాభై నిమిషాల ప్రసంగం అరణ్యరోదనగా మారింది.  

విదిషా ఫైనల్‌ పంచ్‌..

అసలే ఆదరణ లేక ఇబ్బందులు పడే పాక్‌కు, ‘రైట్‌ టు రిప్లయ్‌’ కింద భారత రాయబారి విదిషా తిరుగులేని బదులిచ్చారు. సూటి ప్రశ్నలు సంధించారు. దాంతో ఇమ్రాన్‌ బృందం నివ్వెరపోయింది.  పాక్‌లో మైనార్టీల సంఖ్య మూడు శాతానికి పడిపోవడాన్ని విదిషా ఐరాస దృష్టికి తెచ్చారు. ఉగ్రవాదులకు పింఛన్లు.. ఐరాస నిషేధిత జాబితాలోని 130 మంది ఉగ్రవాదులు పాక్‌లో ఉన్న విషయం.. ఐరాస నిషేధిత సంస్థలు పాక్‌లో పనిచేయడాన్ని ఆమె గట్టిగా ప్రస్తావించారు. ‘వాళ్ల సంగతి చూసుకోకుండా, మా కశ్మీర్ గురించి పాక్‌కు ఎందుకు’ అని సభ్య దేశాలందరి ముందూ పాక్‌ను నిలబెట్టి నిలదీశారు.  

‘నియాజీ’ ప్రస్తావన ఎందుకంటే..

విదిషా తన ప్రసంగంలో పాక్‌ ప్రధాని పూర్తిపేరును ‘ఇమ్రాన్‌ ఖాన్‌ నియాజీ’అంటూ ప్రస్తావించారు. దీనిలో కూడా నిగూడార్థం ఉంది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ నేతృత్వంలోని పాక్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ దళాలు భారత్‌కు లొంగిపోయాయి. ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చేలా విదిషా ‘నియాజీ’ పేరును ప్రస్తావించారు. ఐరాసలో భారత బృందంలో అత్యంత జూనియర్‌ అధికారి విదిష. పదేళ్ల క్రితం ఐఎఫ్‌ఎస్‌ పూర్తి చేశారు. తన బ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను బిమన్‌ సన్యాల్‌ మెమోరియల్‌ గోల్డ్‌మెడల్‌ను ఆమె అందుకున్నారు. చిత్రం ఏంటంటే, పాక్‌ రాయబారి మలీహా చాలా సీనియర్‌. ఆమెకు దీటుగా బదులిచ్చారు విదిషా. మలీహా విషయానికొస్తే..  ఏదో ఇంటర్నెట్‌లో దొరికన సమాచారంతో ఐరాసకు హాజరవుతారనే విమర్శలున్నాయి. గతంలో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాక్‌లోని ఉగ్రవాదాన్ని ఎండగట్టారు. దీనికి ‘రైట్‌ టు రిప్లై’ కింద మలీహా సమాధానం ఇచ్చారు. కశ్మీర్‌లో భారత దళాల దాడిలో గాయపడిన మహిళగా పేర్కొంటూ ఓ యువతి చిత్రాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి ఆ చిత్రంలో ఉన్న యువతి పేరు రవ్వా అబు జోమా. ఆమె పాలస్తీనా వాసి. అక్కడ గాజానగరంపై జరిగిన దాడిలో గాయపడినప్పటి చిత్రం అది. ఈ విషయాన్ని భారత ప్రతినిధి బృందం బట్టబయలు చేసింది. దాంతో మలీహా నోరు మూతపడింది. పాక్‌ పరువు పోయింది. అయినా ఆమె తీరు మారలేదు. ఇటీవల ఐరాసలో మాట్లాడుతూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను, బ్రిటన్‌ ఫారిన్‌ సెక్రటరీగా పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లోని ఒకదాని ప్రధాని పేరు కూడా అమెకు తెలియదా అని విమర్శలు వచ్చాయి. 

అమెను మించిన మునీరు అక్రమ్‌..
లోధీ స్థానంలో వచ్చిన మునీర్‌ అక్రమ్‌ కూడా పూర్తిగా వివాదాస్పదుడే. అమెరికాలో పాక్‌ పరువు తీసిన వ్యక్తే. 2003లో ఇతనిపై గృహహింస ఆరోపణలు వచ్చాయి. తన భాగస్వామి మారిజానా మహిక్‌ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆయనకు ఉన్న దౌత్య రక్షణను ఉపసంహరించాలని పాక్‌ను కోరింది. దీంతో వివాదం పెద్దదవుతుందని పాక్‌ ఆయన్ను వెనక్కి పిలిపించింది.  ఆ తర్వాత గృహహింస ఆరో్పణలను ఆయన కోర్టు బయట పరిష్కరించుకొన్నారు. భారత్‌ పై బలంగా విషప్రచారం చేసిన చరిత్ర మునీర్‌కు ఉంది. అందుకే ఈసారి ఇమ్రాన్‌ అతన్ని ఎంచుకొన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.