close

తాజా వార్తలు

వీరేంద్రుడి త్రిశతకానికి ‘ఏబీ+ఆమ్లా’ ద్విశతకాల పోటీ

భారత్‌×దక్షిణాఫ్రికా సమరంలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు

చిరకాలం గుర్తుండిపోయే సెహ్వాగ్‌, ఆమ్లా, ఏబీ శతకాలు

సఫారీలతో సమరం ప్రతిసారీ ఆసక్తికరమే! ఇక పోరు సుదీర్ఘ ఫార్మాట్లోనైతే చెప్పనవసరం లేదు. నువ్వానేనా అన్నట్టే సాగుతుంది. ప్రత్యర్థి పేస్‌తో వణికిస్తే భారత్‌ స్పిన్‌తో మలుపు తిప్పుతుంది. అవతలి బ్యాట్స్‌మెన్‌ శతకాలు బాదేస్తే టీమ్‌ఇండియా ఆటగాళ్లు ద్విశతమో లేదా త్రిశతకమో తప్పదన్నట్టు చెలరేగుతారు. ఏళ్ల తరబడి ఆటలో ఈ శత్రుత్వం ఇలాగే కొనసాగుతోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి తలబడుతున్న ఈ రెండు జట్లలో బ్యాటింగ్‌లో అత్యుత్తమ ఐదు ఇన్నింగ్సులను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందామా!!


జయహో.. త్రిశతకాధి వీర

(2008లో చెన్నైలో వీరేంద్ర సెహ్వాగ్‌ 319)

టీమ్‌ ఇండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనింగ్‌లో నెలకొల్పని రికార్డులేమైనా ఉన్నాయా? బంతిని బలంగా బాదడమే లక్ష్యంగా చెలరేగడం అతడి నైజం. ఆడేది తొలి బంతా? ఆఖరి బంతా? అని చూడడు. అతడిని చూసి బౌలర్‌, బంతి రెండూ భయపడాలి అన్నట్టే ఆడతాడు. 2008లో చెపాక్‌లో దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ట్రిపుల్‌ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చెపాక్‌లో వీరూ 319 చేస్తే రెండు జట్లు కలిసి 1498 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సఫారీలు రెండో రోజు తేనీటి విరామానికి ముందు 540కు ఔటయ్యారు. భజ్జీ చివరి మూడు వికెట్లు తీసి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత మొదలైంది సెహ్వాగ్‌ వీర విజృంభణం.

రెండోరోజు ఆట ముగిసేలోపే 59 బంతుల్లో అర్ధశతకం చేసి వీరేంద్రుడు ప్రమాద ఘంటికలు మోగించాడు. ఇక మూడో రోజు అతడి ఆటకు దక్షిణాఫ్రికా బెంబేలెత్తిపోయింది. లంచ్‌కు ముందే శతకం (116 బంతుల్లో) అందుకున్నాడు. వసీమ్‌ జాఫర్‌ (73)తో కలిసి 213 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించాడు. 194 బంతుల్లో డబుల్‌ సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ (111)తో కలిసి రెండో వికెట్‌కు 268 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 278 బంతుల్లోనే త్రిశతకం సాధించాడు. బంతుల పరంగా అత్యంత వేగవంతమైన త్రిశకం ఇదే. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 42 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయంటే వీరూ ఆట ఎంత భయంకరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే రెండో 100కు 78, మూడో 100కు 84 బంతులే తీసుకోవడం.


ఆపద్భాందవుడు.. ఆమ్లా

(2010లో నాగ్‌పుర్‌లో హషీమ్‌ ఆమ్లా 253*)

2010 పర్యటనలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడించి టీమిండియాకు షాకిచ్చింది దక్షిణాఫ్రికా. అందుకు కారణం హషీమ్‌ ఆమ్లా అద్భుత బ్యాటింగ్‌. డేల్‌ స్టెయిన్‌ తిరుగులేని బౌలింగ్‌. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సఫారీలను ఏడో ఓవర్‌లో అశ్వల్‌ ప్రిన్స్‌, గ్రేమ్‌స్మిత్‌ను ఔట్‌ చేసి జహీర్‌ భారీ దెబ్బకొట్టాడు. అప్పుడు హషీమ్‌ ఆమ్లా (253) అజేయంగా నిలిచి ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. అతడికి తోడుగా మేటి ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ (173) నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 340 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆమ్లాకు టెస్టుల్లో ఇదే తొలి ద్విశతకం. అతనెంత క్రమశిక్షణగా ఆడాడంటే భారత బౌలర్లకు కనీసం ఒక్క అవకాశం ఇవ్వలేదు. భజ్జీ, అమిత్‌ మిశ్రా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. బంతిని బలంగా లాగి కొట్టాడు. 22 బౌండరీలు బాదాడు. ఆమ్లా తనదైన రీతిలో ఏబీడీతో కలిసి 108 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా 558/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.


‘మిస్టర్‌ 360’ ఆడితే.. పండగే

(2008లో అహ్మదాబాద్‌లో ఏబీ డివిలియర్స్‌ 217*)

‘మిస్టర్‌ 360’ బ్యాటింగ్‌ చేస్తే ప్రత్యర్థి అభిమానులకూ పండగలాంటిదే! 2008లో అహ్మదాబాద్‌లో అదే జరిగింది. అంతకుముందు చెన్నైలో తొలి టెస్టులో వీరూ త్రిశతకం బాదితే రెండో టెస్టులో ఏబీడీ మాస్టర్‌ క్లాస్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. అతడి బ్యాటింగ్‌కు తోడు సఫారీ బౌలర్లూ చెలరేగడంతో భారత్‌ 50 ఏళ్లలోనే అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఆట మూడు రోజుల్లోనే ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టును సఫారీలు 76 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత మొదలైంది ఏబీడీ ఊచకోత. 174 బంతుల్లో శతకం సాధించిన అతడు మరో 146 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. కళ్లు చెదిరే రెండు సిక్సర్లతో పాటు 17 బౌండరీలు బాదేశాడు. భారత బౌలర్లకు అతడిని ఆపతరం కాలేదు! ఏబీకి తోడుగా జాక్వెస్‌ కలిస్‌ (132) సైతం చెలరేగాడు. వీరిద్దరూ కలిసి 256 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 328కే ఔటవ్వడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.


మేటి.. ఆల్‌రౌండర్‌ ఇన్నింగ్స్‌

(2010లో నాగ్‌పుర్‌లో జాక్వెస్‌ కలిస్‌ 173)

ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ ఆల్‌ రౌండర్లలో ఒకరు జాక్వెస్‌ కలిస్‌. బ్యాటు, బంతితో అతడు అప్రతిహతంగా చెలరేగాడు. నాగ్‌పుర్‌లో ఒకవైపు హషిమ్‌ ఆమ్లా (253*) విజృంభిస్తే  మరోవైపు కలిస్‌ దుమ్మురేపాడు. 15 బౌండరీలు, 2 సిక్సర్లతో 173 పరుగులు చేశాడు. అతడు 165 బంతుల్లోనే టెస్టుల్లో 34వ శతకం సాధించడం గమనార్హం. జహీర్‌ 6/2తో సఫారీలను దెబ్బ కొట్టినప్పటికీ కలిస్‌ దృఢ సంకల్పంతో పోరాడాడు. ఆమ్లాకు అండగా నిలిచాడు. కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకొనేందుకు ఎప్పటిలాగే ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్‌, రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ శతకాలు చేసినప్పటికీ టీమ్‌ ఇండియా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.


మళ్లీ.. వీరేంద్రుడి విహారం

(2010లో కోల్‌కతాలో వీరేంద్ర సెహ్వాగ్‌ 165)

2010లో నాగ్‌పుర్‌లో శతకం చేసిన సెహ్వాగ్‌ అదే ఊపుతో కోల్‌కతాలో చెలరేగాడు. ఈడెన్‌లో 165 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా, అల్విరో పీటర్సన్‌, సచిన్‌ తెందుల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎంఎస్‌ ధోనీ సైతం శతకాలు చేశారు. వారందరి సెంచరీలను తోసిరాజని వీరూ శతకం నిలిచింది. కసికసిగా ఆడిన అతడు కేవలం 41 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అదే ఊపులో 87 బంతుల్లోనే శతకం బాదేశాడు. డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, వేన్‌ పర్నెల్‌ బౌలింగ్‌ను చితకబాదాడు. పాల్‌ హ్యారిస్‌ రౌండ్‌ ది వికెట్‌ నుంచి బౌలింగ్‌తో వీరూను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా అతడి ఆటలు సాగనివ్వలేదు. స్లాగ్‌స్వీప్‌తో 160 బంతుల్లో 150 సాధించేశాడు. వీరేంద్రుడి ఊచకోతతో ఈ సిరీస్‌ 1-1తో సమమైంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.