close

తాజా వార్తలు

దక్షిణాఫ్రికా జట్టులో మన ఇద్దరు! 

భారత సంతతికి చెంది.. టీమిండియాపై అరంగేట్రం

భారత సంతతికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగుతున్నారు. టీమిండియాతో ఆదివారం పూర్తైన తొలి టెస్టులో ఒకరు బంతితో రాణించగా.. మరొకరు బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. ఆ క్రికెటర్ల పూర్వీకులు ఎన్నో ఏళ్ల క్రితమే భారత్‌ నుంచి దక్షిణాఫ్రికాకి వలస వెళ్లగా.. వారిద్దరూ అక్కడే పుట్టి పెరిగి అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు. అందులో ఒకరు కేశవ్‌ మహారాజ్‌ కాగా మరొకరు సేనురన్‌ ముత్తుసామి. విశాఖ టెస్టులో కేశవ్‌ మొత్తం ఐదు వికెట్లు తీయగా ముత్తుసామి బ్యాట్‌తో రాణించాడు. అలాగే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని తొలి ఇన్నింగ్స్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేసి టెస్టుల్లో తొలి వికెట్‌ని సాధించాడు. ఈ సందర్భంగా ఆ ఇద్దరిపై ప్రత్యేక కథనం..

సఫారీ జట్టులో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు లేరని..

ఉత్తరప్రదేశ్‌కి చెందిన కేశవ్‌ మహారాజ్‌ పూర్వీకులు దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అతడి తండ్రి ఆత్మానంద్‌ మహారాజ్‌ అక్కడ మాజీ క్రికెటర్‌ కావడంతో కేశవ్‌కి చిన్నప్పటి నుంచే ఈ ఆటపై ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రి పర్యవేక్షణలోనే క్రికెట్‌ ఓనమాలు దిద్దిన కేశవ్‌ మొదట్లో లెఫ్ట్‌ఆర్మ్‌ సీమర్‌గా కొనసాగేవాడు. అయితే దక్షిణాఫ్రికాలో ఎడమ చేతివాటం స్పిన్నర్లు లేరని గ్రహించిన అతడి తండ్రి కేశవ్‌ను స్పిన్నర్‌గా మార్చాడు. అలా చిన్నప్పటి నుంచే బలమైన పునాదులు వేసుకున్న అతడు లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌గా దేశవాళీ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

స్టెయిన్‌ తప్పుకోడంతో కేశవ్‌కి అవకాశం 
దక్షిణాఫ్రికా అత్యుత్తమ పేసర్‌ డేల్‌స్టెయిన్‌ 2016లో గాయం కారణంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కేశవ్‌ ఆసీస్‌ పర్యటనలో టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించకపోయినా నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అలాగే 2017 మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కేశవ్‌ అనంతరం 2017 ఇంగ్లాండ్‌ పర్యటనలో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొని నిలకడగా రాణించాడు. ఇక 2018లో శ్రీలంక పర్యటన సందర్భంగా ఓ టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌ ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో 124 పరుగులిచ్చిన స్పిన్నర్‌ 9 వికెట్లు సాధించడం విశేషం. అదే ఏడాది శ్రీలంకతో టీ20 సిరీస్‌కి ఎంపికైనా తుది జట్టులో అవకాశం రాకపోవడం గమనార్హం.

ఆల్‌రౌండర్‌ ముత్తుసామి 
తమిళనాడుకు చెందిన ముత్తుసామి పూర్వీకులు ఎన్నో ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాకి వలస వెళ్లారు. భారతీయులు ఎక్కువగా ఉండే డర్బన్‌లో పుట్టి పెరిగిన అతడు అంచలంచెలుగా ఎదుగుతూ దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో క్వాజులు నాటల్‌ క్రికెట్‌ జట్టు తరఫున ఆడిన అతడు 2015లో ఆఫ్రికా టీ20కప్‌లో తొలిసారి పాల్గొన్నాడు. అలాగే టీ20 గ్లోబల్‌ లీగ్‌లో కేప్‌టౌన్‌ నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడాడు. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన ముత్తుసామి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టుకు  ఎంపికయ్యాడు. ఇటీవల భారత పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించగా ముత్తుసామి అందులో చోటు దక్కించుకున్నాడు.  

తొలి వికెట్‌గా కోహ్లీని ఔట్‌ చేసి.. 
భారత సంతతికి చెందిన ముత్తుసామి టీమిండియాపై విశాఖలో టెస్టులో అరంగేట్రం చేయడమే కాకుండా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసి కెరీర్‌లో మొదటి వికెట్‌ సాధించాడు. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో డేన్‌పీట్‌(56)తో కలిసి పట్టుదలగా ఆడటం ప్రశంసనీయం. ఇదిలా ఉండగా మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మాతృదేశంపైనే అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. తొలి టెస్టులో ఆకట్టుకున్న వీరు తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తారో చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.