close

తాజా వార్తలు

ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. కానీ శైలి వేరు!

వీరేంద్ర సెహ్వాగ్‌.. భారత క్రికెట్‌లో ఓపెనర్‌గా చెరగని ముద్ర వేసుకున్న డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌. ఒంటి చేతితో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా విరుచుకుపడటమే వీరేంద్రుడి నైజం. దొరికిన బంతిని దొరికనట్లుగా బౌండరీకు తరలించేవాడు. స్పిన్నరా, పేసరా.. వన్డేనా, టీ20నా, సుదీర్ఘ ఫార్మాటా.. అనే తారతమ్యం లేకుండా బౌలర్లపై విజృంభించే తత్వం అతడిది. కానీ, సెహ్వాగ్‌ క్రికెట్‌కు దూరమయ్యాక అన్ని ఫార్మాట్‌లో ఒదిగిపోయే సమర్థుడైన ఓపెనర్‌ కోసం టీమ్‌ఇండియా ఎన్నో ఏళ్లు ఎదురుచూసింది. అయినా అతడి స్థానాన్ని ఎవరూ పరిపూర్ణంగా భర్తీ చేయలేకపోయారు. కానీ, రోహిత్‌ విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో చెలరేగి సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చారు.

రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్లలో సెహ్వాగ్‌ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేశాడు. సెహ్వాగ్‌ని మించి మరీ హిట్‌మ్యాన్‌ వన్డేల్లో జట్టుకు సేవలు అందించాడంటే అతియోశక్తి కాదు. కానీ, టెస్టుల్లో మాత్రం రోహిత్‌ పూర్తి భిన్నం. మొన్నటివరకు సుదీర్ఘఫార్మాట్‌లో చోటు దక్కడమే అతడికి మహాభాగ్యంగా మారింది. కేఎల్‌ రాహుల్‌ తన ఫామ్‌తో తంటాలు పడుతున్న సమయంలో ఎట్టకేలకు రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని హిట్‌మ్యాన్‌ చక్కగా వినియోగించుకున్నాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో శతకాలతో సత్తా చాటాడు. ఎవరికీ సాధ్యమవ్వని రికార్డులను సుసాధ్యం చేసి చూపించాడు. దీంతో భారత్‌కు మరో సెహ్వాగ్‌ దొరికేసినట్లుగా అందరూ భావిస్తున్నారు. కానీ, రోహిత్‌ శైలి వేరు.. సెహ్వాగ్‌ దూకుడు వేరు. ఇద్దరి ఆలోచనలూ వేరు. ఇద్దరూ సృష్టించేది విధ్వంసమే. అయినా సునామీకి భూకంపానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది వారి ఊచకోతలో. 

కెరీర్‌ మొదట్లో మిడిలార్డర్‌లో ఆడిన సెహ్వాగ్‌ అంతగా ఆకట్టుకోలేకోయాడు. గంగూలీ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. కివీస్‌పై శతకం బాది సెహ్వాగ్‌ ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. అన్నిఫార్మాట్లలో అదరగొడుతూ టీమ్‌ఇండియా డాషింగ్‌ ఓపెనర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2004లో పాక్‌గడ్డపై దాయాదీలతో జరిగిన టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ, 2008లో చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై ట్రిపుల్‌ సెంచరీ అతడి పరాక్రమానికి చిహ్నాలు. అంతేకాకుండా వన్డేల్లో వెస్టిండీస్‌పై ద్విశతకం సాధించి తన ప్రతిభ ఏంటో అందరికీ తెలియజేశాడు. పరిమిత ఓవర్లలో చెలరేగే సెహ్వాగ్‌ టెస్టుల్లో రాణిస్తాడా అనే అనుకునేవారికి తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. 293, 254, 201, 195, 173.. ఇలా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎన్నో చక్కని ఇన్నింగ్స్‌లతో అలరించాడు. కానీ, క్రికెట్‌ నుంచి సెహ్వాగ్‌ వైదొలిగిన తర్వాత అతడిలా మూడు ఫార్మాట్లలో అదరగొట్టే అసలు సిసలైన ఓపెనర్‌ దొరకలేదు. కానీ, రోహిత్‌ ఓపెనర్‌గా అవతారమెత్తిన తర్వాత పరిమిత ఓవర్లలో మరో సెహ్వాగ్‌ దొరికేశాడని అందరూ ఆనందించారు.

ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఏకంగా 5 శతకాలు బాది రోహిత్‌శర్మ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, ఎన్నో ఏళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు అపూర్వ విజయాలు అందించాడు. శతకం బాదిన తర్వాత కనీసం 40 బంతులు హిట్‌మ్యాన్‌ క్రీజులో ఉంటే ద్విశతకం గ్యారెంటీ అనే రీతిలో హిట్‌మ్యాన్‌ చెలరేగిపోయాడు. వన్డేల్లో కష్టంగా భావించే డబుల్‌ సెంచరీని అలవోకగా మూడు సార్లు బాది అందరి చేతా వారెవ్వా అనిపించుకున్నాడు. నేటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన రోహిత్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం తన వాడిని చూపించలేకపోయాడు. దీంతో వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికై కూడా తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు. దీంతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రోహిత్‌కు టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని సెలక్షన్‌ కమిటీకి విజ్ఞప్తి చేశారు. కరేబియన్ల గడ్డపై ఓపెనర్ కేఎల్ రాహుల్‌ కూడా నిరాశపరచడంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఓపెనర్‌గా హిట్‌మ్యాన్‌కు అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే 176, 127 పరుగులు చేసి హిట్‌మ్యాన్‌ రికార్డుల మోత మోగించాడు. 

సఫారీలపై అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్‌శర్మ టెస్టుల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లేనని అందరూ భావిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఉప్పెనలా విరుచుకుపడే సెహ్వాగ్‌లా రోహిత్‌ తయారవుతాడని జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క టెస్టుతో సరిపోల్చితే ఎలా? మరికొన్ని మ్యాచులు ఎదురుచూడాలని ప్రతివాదనలు కూడా వినిపిస్తున్నాయి. బ్యాటుతో ప్రళయం సృష్టించే సెహ్వాగ్‌ను అందుకునే సామర్థ్యాలన్నీ రోహిత్‌కు సొంతమే. కానీ, వీరిద్దరి బ్యాటింగ్‌ శైలి వేరు. ఆది నుంచే విరుచుకుపడే తత్వం సెహ్వాగ్‌ది అయితే కుదురుకున్నాక చెలరేగే నైజం రోహిత్‌ది. ఇద్దరూ క్రీజ్‌లో ఉన్నంతసేపు ప్రత్యర్థులకు పీడకలలా మార్చే మహాయోధులే. కానీ, ఇద్దరీ ఆలోచనధోరణి వేరు. బంతిని బలంగా బౌండరీకి తరలించేలా వీరేంద్రుడు వీరబాదుడు బాదితే.. బంతిని స్టైలిష్‌గా స్టాండ్స్‌కు తరలించేలా హిట్‌మ్యాన్‌ ఆడతాడు. కానీ, ఇద్దరి లక్ష్యం భారత్‌ను విజయపథంలో నడిపిండమే. ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే శతకాలతో హోరెత్తించిన రోహిత్‌ వచ్చే సిరీసుల్లో కూడా నిలకడగా రాణిస్తే మరో సెహ్వాగ్ అవ్వడం ఖాయం. కానీ, స్వదేశాల్లో రాణించే మాదిరిగానే విదేశీ పిచ్‌లపై హిట్‌మ్యాన్‌ నిలకడగా రాణిస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!! 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.