close

తాజా వార్తలు

బుమ్రా, హార్దిక్‌స్థానాలను భర్తీ చేయగలరా?

జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య.. భారత జట్టులో ప్రధాన ఆటగాళ్లు. వైవిధ్యమైన బంతులు, కళ్లుచెదిరే యార్కర్లతో ప్రత్యర్థులను హడలెత్తించడం బుమ్రా ప్రత్యేకత. కట్టుదిట్టమైన బౌలింగ్‌, ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడటంలో హార్దిక్‌ దిట్ట. వీరిద్దరూ టీమ్‌ఇండియాలో కీలకపాత్ర పోషిస్తూ ఎన్నో మధుర విజయాలను అందించారు. కానీ, వెన్ను గాయంతో సొంతగడ్డపై జరుగుతున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరూ లేకపోయినా టీమ్ఇండియా సఫారీలపై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వారి స్థానాల్లోకి వచ్చిన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే బుమ్రా, హార్దిక్‌ లేని లోటుని వారు పరిపూర్ణంగా తీరుస్తున్నారా?

విభిన్న శైలి, వేగానికి వేగం, వైవిధ్యానికి వైవిధ్యం.. ఇవన్నీ కలబోతే టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. అరంగ్రేటం చేసిన కొద్ది రోజుల్లోనే జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మరికొన్ని రోజుల తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా ఎదిగాడు. మైదానంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తు భారత్‌ను విజయ పథంలో నడిపించాడు. డెత్‌ఓవర్లలో స్పెషలిస్టు అయినా బుమ్రా ప్రపంచకప్‌లోనూ అదరగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కూడా హ్యాట్రిక్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. కానీ వెన్నులో కింది వైపున చీలిక రావడంతో సఫారీల సిరీసుకు దూరమయ్యాడు. ఆటగాళ్లకు చేసే సాధారణ రేడియాలజీ పరీక్షలో బుమ్రాకు గాయం ఉందని తేలింది. 

  • భారత్ తరఫున బుమ్రా ఇప్పటివరకు 12 టెస్టులు, 58 వన్డేలు, 42 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 62 వికెట్లు, వన్డేల్లో 103, టీ20ల్లో 51 వికెట్లతో సత్తా చాటాడు.
  • భారత్‌ తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా టెస్టుల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో భారత ఆటగాడు బుమ్రా.
  •  వన్డేల్లో 797 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 827  పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆడిన 12 టెస్టుల్లోనే అతడు మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

టీమ్‌ఇండియా ఎంతో కాలం నిఖార్సయిన ఫాస్ట్‌ బౌలర్ ఆల్‌రౌండర్‌ కోసం ఎదురుచూసింది. అందరూ ఆశించినట్లుగానే హార్దిక్‌ పాండ్య భారత జట్టులోకి వచ్చాడు. హార్డ్‌ హిట్టర్‌గా అరంగ్రేటం చేసిన అతడు దానికి తగ్గట్లుగానే చెలరేగాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వీటితో పాటు అబ్బురపరిచే ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. కానీ, హార్దిక్‌ను దీర్ఘకాలికంగా వెన్ను నొప్పి వేధిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ సమయంలోనే వెన్ను నొప్పితో అతడు బాధపడ్డాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిపై పనిభారం పడకుండా సెలక్టర్లు తగిన విశ్రాంతిని కల్పించారు. ప్రపంచకప్‌ తర్వాత కూడా వెస్టిండీస్‌ పర్యటనకు హార్దిక్‌ దూరమయ్యాడు. సఫారీలతో టీ20 సిరీసు ఆడిన అతడిని సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా పెట్టారు. కానీ, అతడి గాయం తిరగబెట్టడంతో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు తిరిగి టీమ్‌ఇండియా జెర్సీ ధరించడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది.

 

జట్టులో బుమ్రా లేని లోటుని తీర్చడం దాదాపు అసాధ్యమే. కానీ, దక్షిణాఫ్రికా టెస్టు సిరీసులో ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ అతడు లేని లోటుని తీరుస్తున్నారు. తమ పేస్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో షమి ఏకంగా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. స్పిన్‌ అనుకూలించే పిచ్‌లో తన పేస్‌తో అతడు ఐదు వికెట్ల పడగొట్టడం విశేషం. రెండో టెస్టులోనూ మూడు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. బుమ్రా స్థానంలో చోటు దక్కించికున్న ఉమేశ్‌ యాదవ్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కలేదు. కానీ, రెండో టెస్టులో ఆరు వికెట్లతో చెలరేగి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇషాంత్‌ కీలక రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.
ఇక ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 70 పరుగులతో పాటు ఆరు వికెట్లూ పడగొట్టాడు. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసి 91 పరుగులతో అదరగొట్టాడు. తొలి 44 బంతుల్లో 7 పరుగులే చేసిన జడ్డూ తర్వాతి 60 బంతుల్లో 84 పరుగులు బాదాడు. అంతేకాకుండా నాలుగు వికెట్లూ పడగొట్టాడు. శనివారం రాంచీ వేదికగా ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులోనూ జడేజా సత్తాచాటడం గ్యారెంటీ అని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎడమచేతివాటం స్పిన్నర్లకు రాంచీ పిచ్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. టీమ్‌ఇండియా రిజర్వ్‌ బెంచ్‌ ఎంతో పటిష్ఠంగా ఉండటంతో కీలక ఆటగాళ్లైన బుమ్రా, హార్దిక్‌ లేకపోయినా భారత్‌ జైత్రయాత్ర కొనసాగిస్తోంది!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.