close

తాజా వార్తలు

సఫారీల ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’ అస్త్రానికి కోహ్లీసేన బదులేంటి?

ఏబీ, ఆమ్లా, డుప్లెసిస్‌, బవుమా చేపట్టిన  ప్రయోగం

12 గంటల అగ్ని పరీక్షను టీమిండియా ఎలా ఎదుర్కొందో తెలుసా

లెగ్‌బ్రేకా వత్తెయ్‌. ఆఫ్ బ్రేకా వత్తెయ్‌. గూగ్లీనా అడ్డుకో. ఆర్మ్‌ బాలా అడ్డుకో. బౌన్సరా వదిలేయ్‌. ఔట్‌స్వింగరా వదిలేయ్‌. ఇన్‌స్వింగరా బ్లాక్‌ చేయ్‌. రివర్స్‌ స్వింగా బ్లాక్‌ చేయ్‌. యార్కరా బ్లాక్‌ చేయ్‌. ఫుల్లరా బ్లాక్‌ చేయ్‌. ఏంటీ అంతా బ్లాక్‌.. బ్లాక్‌.. బ్లాక్‌ అనుకుంటున్నారా! 2015లో టీమిండియా బౌలర్ల సహనానికి సఫారీలు పెట్టిన పరీక్షే ఇది. దానిపేరే ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’. మరి రాంచీ టెస్టులోనూ దక్షిణాఫ్రికా ఇదే అస్త్రం ప్రయోగించినా ఆశ్చర్యం లేదు.


పూర్వ స్థితి

మూడు టీ20ల సిరీస్‌లో 2-0తో గెలుపు. 5 వన్డేల సిరీస్‌ 3-2తో కైవసం. అప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌. 2015 భారత పర్యటనలో దక్షిణాఫ్రికా పరిస్థితి ఇదీ. అలాంటి జట్టుకు కోహ్లీసేన 0-3తో గర్వభంగం చేసింది. మొహాలి టెస్టులో 108 పరుగుల తేడాతో ఓటమి. వర్షంతో బెంగళూరు మ్యాచ్‌ డ్రా. నాగ్‌పుర్‌లో 124 పరుగులతో పరాజయం. భారత బౌలింగ్‌ దళం స్పిన్‌, రివర్స్‌స్వింగ్‌తో ఆ జట్టును వణికించింది. అశ్విన్‌ (31 వికెట్లు), జడేజా (23 వికెట్లు) సంధించిన గింగిరాల బంతులకు సఫారీల వద్ద సమాధానమే లేదు. ఒక్కరూ శతకం చేయలేదు. ఏబీడీ 85 టాప్‌ స్కోరర్‌. అదీ తనకు అనుభవం ఉన్న చిన్నస్వామిలో. నామమాత్రమైన దిల్లీ టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా శిబిరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆటగాళ్లు డస్సిపోయారు. ఎక్కడ చూసినా నిరాశే. మందకొడి కోట్లాపిచ్‌పై యాష్‌, జడ్డూను నిలువరించి పరుగులు చేసే పరిస్థితి లేనేలేదు. కనీసం పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంలో సఫారీ సీనియర్ల బుర్రల్లో పుట్టిందే ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’. బంతి ఏదైనా బ్లాక్‌ చేయడమే వ్యూహం. దక్షిణాఫ్రికా పట్టుదలకు, టీమిండియా సహనానికీ ఓ అగ్నిపరీక్ష. కోహ్లీసేన దీనిని ఛేదించిన విధానమూ అద్భుతమే.


వ్యూహారంభం

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 117.5 ఓవర్లకు 334 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (127) శతకం చేశాడు. జడ్డూ (5/30), అశ్విన్‌ (2/26), ఉమేశ్‌ (2/32) దెబ్బకు సఫారీలు 49.3 ఓవర్లకు 121కే కుప్పకూలారు. కోహ్లీ, రహానె అర్ధశతకాలతో మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 190/4తో నిలిచింది. నాలుగో రోజు రహానె శతకం బాదగానే భోజనానికి ముందే 267/5 వద్ద కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. 481 పరుగుల భారీ లక్ష్యం ప్రత్యర్థికి నిర్దేశించాడు. ఐదు సెషన్లలో కొండత లక్ష్యం ఛేదించడం అసాధ్యం. దిల్లీ పిచ్‌ మందకొడిగా ఉంది. బంతి రివర్స్‌స్వింగ్‌ అవుతోంది. అశ్విన్‌, జడ్డూ వేటకు సిద్ధమైన సింహాల్లా కనిపిస్తున్నారు. గత మూడు టెస్టుల్లో అవమానం గుర్తుచేసుకున్న సఫారీ బృందం అప్పుడే ఆరంభించింది ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’. ప్రతి బంతినీ డిఫెండ్‌ చేయడంతో టీమిండియా బౌలర్లకు మొదట అర్థం కాలేదు. బంతుల్ని బ్లాక్‌ చేసి వికెట్లను కాపాడుకొని మ్యాచ్‌ డ్రా చేయాలన్న వారి తపన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి వారి తాపత్రాయన్ని చూసి భారత క్రికెట్‌ మాజీలు, అభిమానులు సైతం మురిసిపోయారనే చెప్పాలి.


అస్త్ర ప్రయోగం

తెంబా బవుమా (117 బంతుల్లో 34 పరుగులు), హషీమ్‌ ఆమ్లా (244కు 25), ఏబీ డివిలియర్స్‌ (297కు 43), డుప్లెసిస్‌ (97కు 10) ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’లో ప్రధాన పాత్రదారులు. బ్రాకెట్లలో వారి గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది బంతుల్ని వారెంత క్రమశిక్షణగా, సహనంతో, కసిగా అడ్డుకున్నారో! 29.6, 10.25, 14.48, 10.31 ఇవీ వరుసగా వారి బ్యాటింగ్‌ సగటులు. ఈ నలుగురూ ఆడిన మొత్తం బంతులెన్నో తెలుసా? ఏకంగా 655. బవుమాను మినహాయిస్తే రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘బిగ్‌-3’ క్రీజులో గడిపిన సమయం దాదాపు 12.5 గంటలు. ఆమ్లా 12 నిమిషాలు తక్కువ 5 గంటలు, ఏబీడీ 15 నిమిషాలు తక్కువ 6 గంటలు క్రీజులో భారత బౌలింగ్‌ను అడ్డుకున్నారు. పరుగులు సాధించాలన్న భావనే లేదు. ఆఫ్‌ వ్యాలీ అయినా, ఫుల్లర్‌ అయినా బ్లాక్‌ చేయడమే. వారి అంకితభావం ముందు ఒకానొక దశలో భారత బౌలర్లు విపరీతంగా అలసిపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 143.1 ఓవర్లకు 143 పరుగులకు ఆలౌటయ్యారు. అంటే ఓవర్‌కు ఒక పరుగు చొప్పునే చేశారు. ఈ నలుగురి కఠోర ‘బ్లాకింగ్‌’ వల్లే 124.2 ఓవర్లకు కేవలం 5 వికెట్లే పడ్డాయి. మిగిలిన 5 వికెట్లు కేవలం 32 బంతుల్లోనే పడటం గమనార్హం. ఇక ఆమ్లా 46, ఏబీ 33, డుప్లెసిస్‌ 53వ బంతికి తొలి పరుగు చేయడం విశేషం. సఫారీల ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’ను ఛేదించేందుకు జడేజా 46 ఓవర్లు విసిరితే 33 మెయిడిన్లు నమోదయ్యాయి. అశ్విన్‌ 49.1 ఓవర్లకు 26, ఇషాంత్‌ 20కి 12, ఉమేశ్‌ 21కి 16 మెయిడిన్లు వేశారు. ఒకానొక దశలో జడ్డూ అప్పటికి 51 ఏళ్ల నాటి బాపు నందకర్ణి వరుసగా 21 మెయిడిన్ల రికార్డును బద్దలు కొట్టేలా కనిపించాడు. అయితే 19వ ఓవర్‌లో పరుగు రావడంతో ఆ రికార్డు దక్కలేదు. మ్యాచ్‌లో మలుపు కోసం కోహ్లీ, మురళీ విజయ్‌, పుజారా, ధావన్‌ సైతం బౌలింగ్‌ చేయడం గమనార్హం. 


వ్యూహచ్ఛేదన

నాలుగో రోజు ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (4)ను నాలుగో ఓవర్లోనే ఔట్‌ చేసి అశ్విన్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాతే మొదలైంది అసలు పరీక్ష. తెంబా బవుమా (34; 117 బంతుల్లో), హషీమ్‌ ఆమ్లా (25; 244 బంతుల్లో) జోడీని విడదీసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బవుమా వికెట్‌ కోసం 43.4వ బంతి వరకు యాష్‌ వేచిచూడాల్సి వచ్చింది. ఏబీడీ బ్లాకింగ్‌ను విజయవంతంగా కొనసాగించడంతో 72/2 (72 ఓవర్లు)కు ఆట ముగిసింది. ఆమ్లా తన డిఫెన్స్‌తో మహామహుల్నే మెప్పించగలిగాడు. ఐదో రోజు కొత్త బంతిని అందుకున్న జడ్డూ తన మూడో ఓవర్లో అద్భుతం చేశాడు. ప్లైట్‌ డెలివరీతో ఆమ్లాను ఊరించి ఒక అడుగు ముందుకేసి డిఫెండ్‌ చేసేలా బంతిని వేశాడు. గింగిరాలు తిరుగుతూ పిచైన ఆ బంతి ఆమ్లా బ్యాటు అంచును తాకి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. అది 84.5వ బంతి. ఎంతోసేపటికి 119.6వ బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌చేసి జడ్డూనే కాస్త ఊపిరిపీల్చేలా చేశాడు. పదునైన బంతులతో అతడి డిఫెన్స్‌ కకావికలం చేసేందుకు నిరంతరం ప్రయత్నించాడు. ఓ చక్కని ఆర్మ్‌బాల్‌తో అతడిని ముందుకు కదిలేలా చేశాడు. మిడిల్‌లో పిచైన బంతి నేరుగా అతడి ప్యాడ్లను తాకింది. అంపైర్‌ ధర్మసేన ఔటిచ్చాడు. ఆ మధ్యలో 94/3 వద్ద సఫారీలు భోజన విరామం తీసుకున్నారు.

డుమిని (0; 12 బంతుల్లో)ని పెవిలియన్‌ పంపేందుకు అశ్విన్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 124.2వ బంతికి ఔట్‌ చేశాడు. 138.5వ బంతికి డేన్‌ విలస్‌ (13; 50 బంతుల్లో)ను బౌల్డ్‌ చేశాడు. కానీ డివిలియర్స్‌ వికెట్‌ మాత్రం అంత సులభంగా దక్కలేదు. చేతి వేళ్లు, దేహానికి దెబ్బలు తగిలినా అతడు పట్టు వదల్లేదు. తీవ్రంగా ప్రతిఘటించిన ఏబీని 139.1వ బంతికి అశ్విన్‌ ఔట్‌ చేశాడు. లెగ్‌సైడ్‌ పిచై చక్కని బౌన్స్‌తో వచ్చిన బంతి ఏబీ బ్యాట్‌ అంచుకు తలిగి లెగ్‌స్లిప్‌లో గాల్లోకి లేచింది. చురుకైన జడ్డూ అమాంతం బంతిని అందుకొని టీమిండియాకు ప్రాణం పోశాడు. ఆ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌ కలిసి మిగతా కథ ముగించేశారు. ఐదో రోజు ఆఖరి సెషన్‌ వరకు సాగిన ‘ఆపరేషన్‌ బ్లాకథాన్‌’ను విజయవంతంగా ఛేదించేశారు. 337 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.