close

తాజా వార్తలు

అక్కడ ఇమ్రాన్‌ ప్రసంగం నిడివే ఎక్కువ!

ఇస్లామాబాద్‌: ప్రపంచం ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలపై గళం విప్పేందుకు దేశాధినేతలకు అవకాశం కల్పించే అపూర్వ వేదిక ఐరాస. ప్రపంచ నేతలంతా ఒకేచోట కలిసే ఏకైక వేదికది. అక్కడ నేతలు మాట్లాడే ప్రతి మాటనూ యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఆలకిస్తుంది. ప్రపంచానికి సవాళ్లుగా పరిణమించిన అంశాలపై అధినేతలు ఎలాంటి పరిష్కార మార్గాలు చెబుతున్నారో జనం శ్రద్ధతో చూస్తారు. అందువల్ల ఆ వేదిక నుంచి మాట్లాడే మాటా.. ప్రతి క్షణం ఎంతో విలువైనవి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరున జరిగిన ఐరాస74వ సర్వసభ్య సమావేశంలో నేతల ప్రసంగం నిడివి, తదితర ఆసక్తికర అంశాలపై ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2019లో ఐరాస సర్వసభ్య సమావేశంలో ఎక్కువ సమయం మాట్లాడిన నేతగా పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిలిచారు.

సెప్టెంబర్‌ నెలాఖరున జరిగిన సమావేశంలో ఐరాస వేదికగా ఇమ్రాన్‌ కశ్మీర్‌ అంశంలో భారత్‌పై విషం చిమ్మిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 190 దేశాలకు చెందిన అధినేతలు, మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో అందరికంటే ఎక్కువగా సుమారు 50 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగంలో సగం కంటే ఎక్కువ సమయం కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావనకే వినియోగించడం గమనార్హం. ఆయనకంటే ముందు ఎక్కువ సమయం మాట్లాడిన నేతగా లిబియా మాజీ ప్రధాని గడాఫీ నిలిచారు. 2009లో ఐరాస పోడియంపై  96 నిమిషాల పాటు ప్రసంగించారట. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ప్రతి నేతకూ 15 నిమిషాల పాటు సమయం కేటాయించగా.. తనకు ఇచ్చిన సమయం కంటే 35 నిమిషాలు అధికంగా ఇమ్రాన్‌ ప్రసంగించారు. 

ఈసారి మహిళా ప్రతినిధుల కొరత!
ఐరాస పోడియం నుంచి అతితక్కువ సమయం మాట్లాడిన నేతగా రువాండా అధ్యక్షుడు పాల్‌ కగేమ్‌ నిలిచారు. ఆయన కేవలం 7 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో 34 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఈసారి మాత్రం ఆయన 17 నిమిషాల 30 సెకన్ల సమయం మాత్రమే ప్రసంగించారు. ఈసారి సమావేశంలో మహిళా ప్రతినిధుల కొరత కన్పించడం ఐరాస విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమైన అంశం. ఈసారి జరిగిన సమావేశంలో ప్రసంగించిన వారిలో 91.8శాతం ప్రతినిధులు పురుషులు కాగా.. మహిళా ప్రతినిధులు కేవలం 8.2 శాతమే ఉండటం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.