close

తాజా వార్తలు

ముల్తాన్‌ కా సుల్తాన్‌.. ట్విటర్‌ కా షేర్‌

వీరేందర్‌ సెహ్వాగ్‌.. కోట్లాది మంది భారతీయులకు అభిమాన క్రికెటర్‌. ఈ మాజీ క్రికెటర్‌ బ్యాట్‌ ఝుళిపిస్తే మంత్రముగ్ధులవ్వని అభిమానులు ఉండరు. అతడు బ్యాట్‌ పడితే బంతి బౌండరీ దాటాల్సిందే‌. క్రీజులో ఉంటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. బౌలర్‌ ఎవరైనా స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. మైదానంలో బ్యాటింగ్‌ చేసినా.. ట్విటర్‌లో పంచ్‌లు విసిరినా అది వీరేంద్రుడికే చెల్లింది. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎంత దూకుడుగా ఉంటాడో, ఒక నెటిజన్‌గా అంతే చురుగ్గా ఉంటాడు. తన బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విటర్‌లో పంచులు విసురుతుంటాడు సెహ్వాగ్‌. ఆ డాషింగ్‌ ఓపెనర్‌ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అతడి పంచింగ్‌ ట్వీట్లపై ప్రత్యేక కథనం..

నేను రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేయలేదు
‘నేను రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్‌ చేసింది’.. ‘క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలవలేదు. అయినా ఆ మెగాటోర్నీల్లో ఆడుతోంది’.. ‘కబడ్డీ కనిపెట్టిన భారత్‌ ఎనిమిదోసారి ప్రపంచ ఛాంపియన్‌ అయింది. అయినా క్రికెట్‌ని కనిపెట్టిన దేశం, ఇంకా ఇతరుల తప్పులను వెతుకుతోంది’.. ఇవి వీరేంద్రుడు గతంలో చేసిన ట్వీట్లలో కొన్ని. కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన కెప్టెన్‌ మన్‌దీన్‌సింగ్‌ కుమార్తె రెండేళ్ల క్రితం సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్టు చేస్తూ.. ‘పాకిస్థాన్‌ నా తండ్రిని చంపలేదు. యుద్ధం చంపింది’ అనే ప్లకార్డు ప్రదర్శించింది. ఆ సందర్భంలో సెహ్వాగ్‌ ఆమెను ఉద్దేశించి ‘నేను రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీ చేయలేదు. నా బ్యాట్‌ చేసింది’ అని ట్వీట్‌ చేశాడు. ఇక రెండో ట్వీట్‌లో సెహ్వాగ్‌ మరో ఘటనను ప్రస్తావించాడు. 2016 రియో ఒలింపిక్స్‌ సందర్భంగా భారత అథ్లెట్లు రెండు పతకాలే సాధించినా వారికి ఇక్కడ ఘన స్వాగతం పలికారు అభిమానులు. పీర్స్‌ మోర్గాన్‌ అనే ఇంగ్లిష్‌ జర్నలిస్టు ఆ ఫొటోలను పోస్టు చేస్తూ.. ‘1.2 బిలియన్ల జనాభా ఉన్న దేశం. రెండు పతకాలకే సంబరాలు చేసుకుంటుంది, సిగ్గుగా అనిపించడం లేదా?అని ట్వీటాడు. దీనికి సెహ్వాగ్‌ అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘చిన్నచిన్న విషయాలనే మేం పెద్దవిగా ఆస్వాదిస్తాం. కానీ, క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంకా ప్రపంచకప్‌ గెలవాల్సి ఉంది. అయినా ప్రపంచకప్‌ ఈవెంట్లు ఆడుతోంది. సిగ్గుగా లేదా?’ అని ప్రశ్నించాడు. ఇక మూడో ట్వీట్‌లో ప్రపంచ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఎనిమిదోసారి ఛాంపియన్‌గా అవతరించిన సందర్భంలో ఇంగ్లాండ్‌ను ఉద్దేశించే మరోసారి బాంబ్‌ పేల్చాడు.

తప్పుని ఒప్పుకోకపోతే అది రెండో తప్పు!

‘చేసిన తప్పుని ఒప్పుకోకపోతే అది రెండో తప్పు అవుతుంది’ అంటూ సెహ్వాగ్‌ తన నిర్మలమైన మనసును బయటపెట్టాడు గతేడాది. ఈ సందర్భంగా చేసిన పొరపాటుకు వీరూ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు. 2018 ఫిబ్రవరిలో కేరళలో మధు అనే ఆదివాసీ వ్యక్తి ఆకలికి తట్టుకోలేక కిలో బియ్యం దొంగతనం చేశాడని కొందరు వ్యక్తులు దాడి చేసి అతడిని హతమార్చారు. ఆ సందర్భంలో సెహ్వాగ్‌ కొందరు నిందితుల పేర్లు వెల్లడిస్తూ.. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ట్వీట్‌ చేశాడు. అయితే, ఆ ట్వీట్‌లో ఒకే వర్గానికి చెందినవారి పేర్లు ఉండడంతో అవి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సోషల్‌మీడియా సెహ్వాగ్‌పై మండిపడింది. దీంతో పొరపాటు జరిగిందని, ఆ ట్వీట్‌ చేసే సమయానికి తనకు వారిపేర్లే తెలిశాయని వివరణ ఇచ్చాడు. అలాగే తనకు విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశం లేదని స్పష్టంగా క్షమాపణలు చెప్పాడు.

సోషల్‌ మీడియాతో వినూత్న ఆదాయం:

‘ఏదైనా అత్యుత్తమ నైపుణ్యం ఉంటే.. దాన్ని ఉచితంగా చేయకు’ ఇది ఓ సామెత. టీమిండియా మాజీ ఓపెనర్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అతడికున్న నైపుణ్యంతో సామాజిక మాధ్యమాల్లో ఏ బ్రాండ్‌కూ ప్రచారం చేయకుండా లక్షల్లో గడిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించాడు. ‘ట్విటర్‌ ద్వారా సుమారు రూ.30లక్షల ఆదాయం సంపాదించా. అది కూడా ఆరు నెలల్లోనే’ అని ఓ ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. అంటే అతడు సామాజిక మాధ్యమాలను సైతం తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు. ఇలా ఆదాయం పొందడానికి గల కారణాన్ని వీరూ ఓ సందర్భంలో వివరించాడు. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒత్తిడిని జయించడానికి మేం సరదాగా జోకులు వేసుకుంటాం. అయితే, ఒక రోజు వాటిని ట్విటర్‌లో షేర్‌ చేయాలని అనుకున్నా. అలా చేసిన దానికి మంచి స్పందన రావడంతో పాటు నా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. కొన్ని పోస్టులకు వేలాది రీట్వీట్లు లభించాయి. అవి ఎక్కువగా షేర్‌ కావడంతో స్పాన్సర్ల నుంచి ఆదాయం వస్తోంది’ అని తెలిపాడు. 

ముల్తాన్‌ కా సుల్తాన్‌:

సెహ్వాగ్‌ టీమిండియా బ్యాట్స్‌మన్‌గా ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించాడు. అన్నింటి కన్నా ప్రత్యేకం టెస్టుల్లో పాకిస్థాన్‌పై బాదిన తొలి ట్రిపుల్‌ సెంచరీ. ముల్తాన్‌ వేదికగా 2004లో చిరకాల ప్రత్యర్థితో తలపడిన మ్యాచ్‌లో వీరూ(309) తొలిసారి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తో అతడి పేరు ముల్తాన్‌ కా సుల్తాన్‌గా మారిపోయింది. ఇక 2006లో ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన అతడు 2008లో తిరిగి జట్టులో చేరి.. చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై మరోసారి ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 319 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇవి కాక సెహ్వాగ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో వన్డేల్లోనూ అలరించాడు.

సెహ్వాగ్‌ సరదా ట్వీట్లు:
*అశ్విన్‌ ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలిచిన సందర్భంలో అతడికి అభినందనలు తెలుపుతూ ‘త్వరగా ఇంటికి చేరుకోవాలనే విషయం వివాహితుడికి మాత్రమే అర్థం అవుతుంది’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.
*క్రికెట్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ జన్మదినం సందర్భంగా మూడు వేర్వేరు ఫొటోలను జతచేశాడు. అందులో ఒకటి డాన్ ఫొటో‌, రెండోది బ్రెడ్‌, మూడోది ఒక వ్యక్తి. ఇలా మూడు ఫొటోలతో డాన్‌బ్రాడ్‌మన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
*ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా జన్మదినం సందర్భంగా ఈరోజు మనమంతా గన్నా(చెరుకు) జూస్‌ తాగి వినోద్‌ ఖన్నాకు శుభాకాంక్షలు తెలుపుదాం అన్నాడు. 
*ఓ సారి విరాట్‌ కోహ్లీని పొగుడుతూ ‘హజ్మేకి గోలీ, రంగోంకి హోలి, బ్యాటింగ్‌ మె కోహ్లీ.. యావత్‌ భారత్‌ ఇష్టపడుతుందని ట్వీట్‌ చేశాడు.
*ఈ రోజుల్లో కళ్లు మూసుకున్నా, టెన్షన్‌ లేకున్నా నిద్రరాదు. వైఫై బంద్‌ చేస్తేనే నిద్రవస్తుందని జోక్‌ పేల్చాడు.
*ప్రముఖ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌ను కొనియాడుతూ ‘ఆమె పేరు సెరీనా, అయినా టైటిల్స్‌ గెలవడంలో ‘నా’ చెప్పదు. గెలుస్తూనే ఉంటుందని ట్వీటాడు.

క్రికెట్‌ విశేషాలు:

*2001 ఆగస్టులో శ్రీలంక, న్యూజిలాండ్లతో  జరిగిన ముక్కోణపు సిరీస్‌లో సచిన్ తెందూల్కర్ గాయం కారణంగా సెహ్వాగ్‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగాడు. ఆ సీరీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లోనే శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. 
*2002 జనవరిలో గంగూలీ గాయపడడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్‌ 64 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తోనే ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా మారడం విశేషం.
*2002లోనే కెన్యాతో తలపడిన మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 50 పరుగులు సాధించి.. భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 
*2003 ప్రపంచకప్‌లో సెహ్వాగ్ 27 సగటుతో 299 పరుగులు చేశాడు. కాగా ఫైనల్లో ఆస్ట్రేలియాపై 82 పరుగులతో ఆకట్టుకున్నాడు.                              -

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.