close

తాజా వార్తలు

అప్పుడూ.. ఇప్పుడూ ఆపద్బాంధవుడు అతడే!

సుదీర్ఘ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత్‌ 3-0తో వైట్‌వాష్‌ చేసి చరిత్రాత్మక విజయం సాధించింది. ద్విశతకాలతో భారత సారథి విరాట్‌ కోహ్లీ, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ మెరిశారు. బౌలింగ్‌ విభాగంలో స్పిన్‌తో పాటు పేస్‌ దళం పుంజుకొని సఫారీసేనను బెంబేలెత్తించారు. మొత్తంగా ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్‌ఇండియా రికార్డుల మోత మోగించింది. దీంతో దక్షిణాఫ్రికా మరోసారి చేదు జ్ఞాపకాలతోనే భారత్‌ను వీడింది. 2015లో భారత్‌ పర్యటనకు సఫారీసేన వచ్చినప్పుడు కూడా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. పర్యాటక జట్టును అప్పుడూ..ఇప్పుడూ దెబ్బ తీయడంలో టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ప్రధాన పాత్ర పోషించాడు. కష్టాల్లో ఉన్న జట్టుని ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ తను ఎంత కీలక ఆటగాడో మరోసారి చాటి చెప్పాడు.

2015లో భారత్‌ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాను భారత్ స్పిన్‌ ఆయుధంతో దెబ్బకొట్టింది. కానీ, దిల్లీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో భారత్‌కు ఆమ్లాసేన దీటుగా బదులిచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ను దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 68 పరుగులకే టాప్‌ఆర్టర్‌ పెవిలియన్‌కు చేరింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానె జట్టు బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆపద్బాందవుడిలా జట్టును ఆదుకున్నాడు. అశ్విన్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తూ శతకాన్ని బాదాడు. అప్పటివరకు విదేశీపిచ్‌లపై సెంచరీలు బాదిన అతడికి సొంతగడ్డపై ఇదే తొలి శతకం కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడంకెల స్కోరుని అందుకొని సఫారీల ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవాలని దక్షిణాఫ్రికా ఎంతో ప్రయత్నించింది. 143.1 ఓవర్ల పాటు భారత్ బౌలర్లను ఎదుర్కొని 143 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది.

ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రహానె అదరగొట్టాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని 81 పరుగులతో ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో చెలరేగాడు. 18 నెలల విరామం తర్వాత సెంచరీ సాధించాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సిరీసులోనూ జింక్స్‌ రాణించాడు. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీతో కలిసి 178 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించగలగింది. రాంచి వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానె.. ఓపెనర్ రోహిత్‌తో కలిసి 267 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. శతకాన్ని బాది స్కోరుబోర్డును 306 పరుగులకు చేర్చిన తర్వాత లిండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇవే కాకుండా జట్టు ఆపదలో ఉన్నప్పుడు రహానె ఎన్నోసార్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రహానె టెక్నిక్‌ ఇతర ఆటగాళ్లకు భిన్నంగా ఉంటుంది. అతడు ఆడే షాట్స్‌లో నియంత్రణ కనిపిస్తుంటుంది. విశాఖ టెస్టులో జట్టుకు పరుగులు అవసరమైనప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో జింక్స్‌ వేగంగా పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 

2007 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ను మొదలుపెట్టిన రహానె నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. 2011 ఇంగ్లాండ్‌ పర్యటనలో శిఖర్‌ ధావన్‌కు గాయమవ్వడంతో రహానెకు అవకాశం వచ్చింది. మాంచెస్టర్‌లో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20లో జింక్స్‌ టీమ్‌ఇండియా జెర్సీ తొలిసారిగా ధరించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున 2013లో తొలి టెస్టు ఆడాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో గొప్పగా పోరాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2014 న్యూజిలాండ్‌ పర్యటనలో శతకం బాది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. విదేశీ పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయపథంలో  నడిపించాడు. భారత్ తరఫున ఇప్పటివరకు అతడు 61 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3,975, వన్డేల్లో 2,962, టీ20ల్లో 375 పరుగులు చేశాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.