close

తాజా వార్తలు

ఆసీస్‌లో మనసు దోశేశారు

ఓ విజేత కథ

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక.. ఆలోచనలన్నీ విదేశాల గురించే ఉంటాయి. ఆశలన్నీ ఆరంకెల జీతం చుట్టే తిరుగుతుంటాయి. అదే విదేశంలో పెద్ద చదువు పూర్తి చేస్తే.. అంచనాలు రెట్టింపవుతాయి. ఆ కుర్రాడి జీవితం కొంతకాలం అలాగే సాగింది. అందరిలా అడుగేస్తే మహా అయితే మంచి ఉద్యోగిగా మిగిలేవాడేమో! భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. దేశం కాని దేశంలో.. మన భారతీయ రుచులు పరిచయం చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు.. ఏమా కథ.. చదివేయండి.
ఆస్ట్రేలియాలో వేడివేడి ఊతప్పం కావాలంటే పెద్ద కష్టమేం కాదు. ఈ దేశంలో ముద్దపప్పు.. పచ్చి పులుసు కాంబినేషన్‌ దొరకడం అసాధ్యమేమీ కాదు. బాపట్లకు చెందిన కర్పూరపు అనిల్‌కుమార్‌ నెలకొల్పిన దోశాహట్‌కు వెళ్తే చాలు. మన వంటకాలు ఘుమఘుమలాడుతూ స్వాగతం పలుకుతాయి. భారతీయుల పాలిట ఆసీస్‌లో ఒయాసిస్‌లా వెలిశాయీ రెస్టారెంట్లు. రెండో మూడో కాదు.. ఏకంగా 22!

బాపట్ల టు ఆస్ట్రేలియా..
అనిల్‌కుమార్‌ది బాపట్లలో ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి రామారావు ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాలలో సూపరింటెండెంట్గా పని చేశారు. తల్లి విజయలక్ష్మి వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా సేవలందించారు. ఇంటర్‌ వరకూ బాపట్లలోనే చదువుకున్న అనిల్‌కుమార్‌.. చెన్నైలో ఇంజినీరింగ్‌ చేశాడు. తర్వాత 2002లో ఎంఎస్‌ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లాడు. అది పూర్తయ్యాక రైల్వే టెలీ కమ్యూనికేషన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌గా మెల్‌బోర్న్‌లో ఉద్యోగంలో చేరాడు. అంతా బాగానే ఉన్నా.. తృప్తిగా తిందామంటే మన వంటకాలు దొరికే హోటల్‌ ఉండేదికాదు. ప్లేటు ఇడ్లీ కోసం 40 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. ఉత్తర భారతదేశ వంటకాల రెస్టారెంట్లు ఉన్నా.. దక్షిణాది రుచుల కోసం ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ఉన్నచోట కూడా నాణ్యమైన పదార్థాలు లభించేవి కావు. ఈ సమస్యకు పరిష్కారం మనమే ఎందుకు కాకూడదు అనుకున్నాడు అనిల్‌కుమార్‌. అలా పుట్టిందే దోశాహట్‌.
27 వేల డాలర్లతో..

ఎంఎస్‌ చదివే రోజుల్లో సహచరుడు, వైజాగ్‌కు చెందిన ప్రవీణ్‌రాజు ఇందుకూరితో కలిసి ఓ రెస్టారెంట్‌ నెలకొల్పాడు అనిల్‌కుమార్‌. వీరిద్దరూ 27వేల డాలర్ల పెట్టుబడితో 2005లో దోశాహట్‌ పేరుతో మెల్‌బోర్న్‌లో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, హైదరాబాదీ బిర్యానీతో ప్రవాసాంధ్రులను ఆకట్టుకున్నారు. రుచి, శుచి గురించి ఆనోటా ఈనోటా ప్రచారం లభించింది. అనతి కాలంలోనే దోశాహట్‌కు ఆహార ప్రియుల రాక ఎక్కువైంది. తెలుగువారే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు కూడా దోశాహట్‌ అడ్రస్‌ వెతుక్కొని మరీ వచ్చేవారు. బ్రేవ్‌.. మంటూ వెళ్లేవారు. ఆదరణ పెరగడంతో దక్షిణాది వంటకాలతో పాటు ఉత్తరాది, ఆస్ట్రేలియన్‌ వంటకాలూ అందిస్తూ వారెవ్వా అనిపించుకున్నారు. వంద రకాల దోశలతో ఆసీస్‌లో కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టారు. మన వాళ్లే కాదు.. ఆసిస్‌వాసులనూ ఈ రుచులు కట్టిపడేశాయి. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, ఆరోగ్య శాఖ మంత్రి జిల్‌ హ్యాన్సీ, స్థానిక ఎంపీలు, ప్రముఖులు రెస్టారెంట్ను సందర్శించి భారతీయ వంటకాల రుచి చూసి అభినందించారు.

నాణ్యతలో భళా..
ఒడుదొడుకులు ఎదురైనా... ఇద్దరూ పట్టుదలతో ముందుకుసాగారు. 2009 వరకు ఉద్యోగం చేస్తూనే వ్యాపారం నిర్వహించేవారు. అమ్మానాన్నలకు చెప్పకుండా అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. పాకశాస్త్ర ప్రవీణులను వెతికిపట్టుకొని.. రుచికరమైన వంటకాలు వండి వడ్డించారు. వ్యాపారంలో ఎదిగిన తర్వాత ఇతర నగరాల్లోనూ శాఖలను ప్రారంభిస్తూ వచ్చారు. ఇప్పుడు సిడ్నీ, అడిలైడ్‌, బ్రిస్బేన్‌, గోల్డ్‌కోస్ట్‌, కాన్‌బెర్రాల్లో 22 రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. ఏటా దాదాపు రూ.200 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారు. వీరి రెస్టారెంట్లలో 700 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దేశం కాని దేశంలో తెలుగువాడి సత్తా చూపించడమే కాదు.. ఆ దేశ ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యాపారవేత్తగా పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఉన్నత విద్య కోసం ఆసీస్‌ వచ్చే తెలుగు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే క్రికెట్‌ ఆటగాళ్లు, సినీ, రాజకీయ ప్రముఖులు, దోశాహట్‌లో ఆత్మీయ ఆతిథ్యం అందుకుంటున్నారు. భారతీయ రుచులు ఆస్వాదిస్తున్నారు.


సేవా పథంలో..
వ్యాపారంలో ఎదిగిన అనిల్‌కుమార్‌ ప్రవాస భారతీయుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల నిర్మాణం, పండగల నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. జన్మభూమి బాపట్లలోని ఉప్పరపాలెంలో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించి రక్షిత తాగునీరు అందిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తుంటారు. అనిల్‌కుమార్‌ 2008లో హైదరాబాద్‌కు చెందిన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ రజితను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ బాధ్యతలు ఆమె చూస్తుండడంతో వ్యాపారంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నానని అంటారు అనిల్‌ కుమార్‌. స్వదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ కొండాపూర్‌లో 2017లో దోశాహట్ రెస్టారెంట్ బ్రాంచి ప్రారంభించారు.
-జి.సురేశ్‌కుమార్‌, బాపట్ల


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.