
తాజా వార్తలు
ముంబయి: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం అమ్మాయంటే కుర్రకారుకు చాలా ఇష్టం. గంగూలీలా ఆమె సిక్సర్లు బాదుతోంటే చూడముచ్చటగా ఉంటుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఆమె ఎన్నో రికార్డులను నెలకొల్పింది. శిఖర్ ధావన్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా ఘనత అందుకుంది. ఇక మహిళల్లో మూడో క్రికెటర్. 51 మ్యాచుల్లో 43.08 సగటుతో ఆమె 2,025 పరుగులు చేసింది. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి.
మంధాన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఈ మధ్యే అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. ఆమె ఎవరి ప్రేమలోనైనా ఉన్నారా అని తెలుసుకొనేందుకు ఒకరు ప్రయత్నించారు. ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉంటున్నారా? అని ప్రశ్నించగా ‘ఉమ్మ్మ్.. బహుశా’ అని చిలిపి సమాధానం ఇచ్చింది. ఎవరిపై క్రష్ ఉందని అడగ్గా ‘నేను పదో ఏట ఉన్నప్పటి నుంచి హృతిక్ రోషన్‌పై’ అని మంధాన చెప్పింది. ప్రస్తుతం ఈ అందమైన క్రికెటర్ మరో 100 రోజుల్లో ఆసీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలిపించాలన్న పట్టుదలతో ఉంది.