close

తాజా వార్తలు

నలుగురు బ్యాట్స్‌మెన్‌ శతకాలు బాదగా..

సచిన్‌ ఆ రికార్డు సాధించింది బంగ్లా పైనే

ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన భారత్‌.. తాజాగా బంగ్లాను టీ20 సిరీస్‌లో ఓడించింది. ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఇండోర్‌ వేదికగా తొలి టెస్టు జరుగుతుండగా, 22 నుంచి కోల్‌కతాలో చారిత్రక డేనైట్‌ తొలి టెస్టు జరగనుంది. గురువారం ప్రారంభమైన ఇండోర్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యం దిశగా పయనిస్తుండగా.. మరోవైపు పింక్‌బాల్‌ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా భారత్‌, బంగ్లా జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు ప్రారంభమై 19 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా అప్పటి గంగూలీ కెప్టెన్సీ నుంచి ఇప్పటి కోహ్లీ సారథ్యం వరకు ఆ జట్టుపై టీమిండియా ఆడిన ఐదు అత్యుత్తమ టెస్టులను ఒకసారి పరిశీలిస్తే..

అది కెప్టెన్‌గా గంగూలీకి తొలి టెస్టు:

మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ టెస్టుల్లో భారత జట్టుకు తొలిసారి పగ్గాలు అందుకుంది బంగ్లాదేశ్‌పైనే. 2000 నవంబర్‌ 10న ఇరు జట్ల మధ్య ఢాకాలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో దాదా తొలిసారి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అది.. ఆతిథ్య జట్టుకు కూడా తొలి టెస్టే కావడం విశేషం. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాట్స్‌మన్‌ అమినుల్‌ ఇస్లామ్‌(145) అద్భుత శతకం చేయడంతో బంగ్లా 400 పరుగులు చేసింది. గంగూలీ(84), సునీల్‌ జోషి(92) రాణించడంతో టీమిండియా 429 పరుగులు చేసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాను 91 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. గంగూలీ కెప్టెన్సీలో  తొలి టెస్టులోనే భారత్‌ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచీ టీమిండియా బంగ్లాపై టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది.

సచిన్‌ 248 బంగ్లాపైనే:

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసింది పసికూనపైనే. 2004 డిసెంబర్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఢాకాలో జరిగింది. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం సచిన్‌ (248; 379 బంతుల్లో 35x4), జహీర్‌(75; 115 బంతుల్లో 10x4, 2x6) రికార్డు బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ 526 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 202 పరుగులకు కుప్పకూలగా.. భారత్‌ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రాహుల్‌ ద్రవిడ్‌ అరుదైన రికార్డు:

భారత జట్టు దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించింది బంగ్లా పులులపైనే. 2004 పర్యటన సందర్భంగా చిట్టగాంగ్‌లో జరిగిన రెండో టెస్టులో ద్రవిడ్‌ ‌(160), మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌(139) శతకాలతో అదరగొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించారు. దీంతో టీమిండియా 540 పరుగులకు ఆలౌట్‌ అయింది. కాగా, మాజీ కెప్టెన్‌కు టెస్టుల్లో ఇది 18వ సెంచరీ, గంభీర్‌కు మొదటిది. ఈ ఇన్నింగ్స్‌తో ద్రవిడ్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు టెస్టు హోదా కలిగిన పది దేశాలపై శతకం బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 333, రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 83 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది.

టాప్‌ ఆర్డర్‌ మొత్తం శతకాలు:

భారత జట్టు టాప్‌ ఆర్డర్‌లో వరుసగా నలుగురు బ్యాట్స్‌మెన్‌ శతకాలు చేసింది బంగ్లాపైనే. 2007 పర్యటనలో తొలి టెస్టు డ్రా అయ్యాక.. రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దినేశ్‌ కార్తిక్‌(129), వసీం జాఫర్‌(138), రాహుల్‌ ద్రవిడ్‌(129), సచిన్‌(122) శతకాలతో చెలరేగగా ధోనీ(51) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు మోర్తాజా, సయ్యద్‌ రసెల్‌, మొహమ్మద్‌ షరీఫ్‌, మహ్మద్‌ రఫీక్‌ ప్రతీ ఒక్కరూ వందకిపైగా పరుగులు ఇచ్చారు. అనంతరం జహీర్‌ఖాన్‌, అనిల్‌కుంబ్లే వికెట్ల జోరు కొనసాగించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ద్రవిడ్‌ సేన ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

బంగ్లా తొలి పర్యటనలో విరాట్‌ ద్విశతకం:

టెస్టు హోదా దక్కిన తర్వాత 17 ఏళ్లకు భారత గడ్డపై తొలి మ్యాచ్‌ ఆడింది బంగ్లాదేశ్‌. హైదరాబాద్‌ వేదికగా 2017 ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. విరాట్‌ కోహ్లీ(204), మురళీ విజయ్‌(108), వృద్ధిమాన్‌ సాహా(106) చెలరేగడంతో 687/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం బంగ్లా 388 పరుగులకే ఆలౌట్‌ అయినా కోహ్లీ ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను మొదలెట్టాడు. 159/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసి బంగ్లా ముందు 458 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. అశ్విన్‌, జడేజా స్పిన్‌ బౌలింగ్‌తో మాయ చేసి 250 పరుగులకే కట్టడి చేశారు. దీంతో కోహ్లీసేన 208 పరుగుల తేడాతో విజయం సాధించింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.