close

తాజా వార్తలు

క్రికెట్‌ దేవుడు అడుగుపెట్టి 30 ఏళ్లు

24 ఏళ్లపాటు సేవలందించిన సచిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దేవుడిగా వర్ణించే సచిన్ తెందూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1989 నవంబర్‌ 15న కరాచి వేదికగా పాకిస్థాన్‌తో తొలి టెస్టు ఆడిన లిటిల్‌ మాస్టర్‌ 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా, టీమిండియా కెప్టెన్‌గా కీలక పాత్రలు పోషించాడు. తన బ్యాటింగ్‌తో భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడి చిరకాల స్వప్నం 2011 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత 2012 డిసెంబర్‌ 23న వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. తర్వాతి ఏడాదే 2013 అక్టోబర్‌ 10న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

పదహారేళ్ల లేత ప్రాయంలో భారత జట్టులోకి అడుగుపెట్టిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. అంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అవుతాడని ఎవరూ ఊహించలేదు. తొలి పర్యటనలోనే వసీం అక్రమ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, వకార్‌ యూనిస్‌ లాంటి దిగ్గజాలను ఎదుర్కొని 35.83 సగటుతో 215 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో యూనిస్ బౌలింగ్‌లో గాయపడి రక్తం కారినా, అలాగే బ్యాటింగ్‌ చేసి అర్ధ శతకం సాధించాడు. పాక్‌ బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం భయపడకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. ఆ పర్యటనలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయితే, సచిన్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని వరుసగా అవకాశాలు సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నాడు.

మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన మాస్టర్‌ బ్లాస్టర్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 34,347 పరుగులు చేశాడు. అలాగే వంద అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు. క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కానన్ని రికార్డులు నెలకొల్పి అభిమానులకు మధుర జ్ఞాపకాలను మిగిల్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.