close

తాజా వార్తలు

రెండో రోజు ‘మయాంకం’

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ రెండో డబుల్‌ సెంచరీ

ఆటముగిసే సరికి భారత్‌ 493/6, 343 పరుగుల ఆధిక్యం 

హోల్కర్‌ స్టేడియం దద్దరిల్లింది. పరుగుల వరదతో తడిచి ముద్దైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒకే రోజు 400 పరుగులు చేశారు. యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (243; 330 బంతుల్లో 29×4, 8×6)దే అందులో సగం వాటా. సొగసైన బౌండరీలు కళ్లు చెదిరే సిక్సర్లతో అతడు సాధించిన రెండో ద్విశతకం చూసి అభిమానులు పరవశంలో మునిగి తేలారు. అతడి విజృంభణకు రికార్డులెన్నో బద్దలయ్యాయి. ఛెతేశ్వర్‌ పుజారా (54; 72 బంతుల్లో 9×4), అజింక్య రహానె (86; 172 బంతుల్లో 9×4), రవీంద్ర జడేజా (60 బ్యాటింగ్‌; 76 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకాలు సాధించడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. రెండో రోజు, శుక్రవారం ఆట ముగిసే సరికి 493/6తో నిలిచింది. ఆఖర్లో నైట్‌వాచ్‌ మన్‌ ఉమేశ్‌ యాదవ్‌ (25 బ్యాటింగ్; 10 బంతుల్లో 1×4, 3×6) పదునైన సిక్సర్లతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. వెరసి ప్రత్యర్థిపై కోహ్లీసేన 343 పరుగుల ఆధిక్యంలో ఉంది.


ఇండోర్‌లో రెండో రోజంతా ‘మయాంకం’ నడిచింది. 43 పరుగులతో ఆట ఆరంభించిన చెతేశ్వర్‌ పుజారా అర్ధశతకం కాగానే ఔటయ్యాడు. జట్టు స్కోరు  105 వద్ద అబు జయేద్‌ అతడిని ఔట్‌ చేశాడు. మరి కాసేపటికే సారథి విరాట్‌ కోహ్లీ (0; 2 బంతుల్లో) డకౌట్‌ అవ్వడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే వారి మోముల్లో నవ్వులు విరబూయించాడు మయాంక్‌. 98 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు అజింక్య రహానెతో కలిసి చెలరేగాడు. వీరిద్దరూ సునాయాసంగా బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంతో 188/3తో టీమిండియా లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చూడముచ్చటైన బౌండరీలతో మయాంక్‌ శతకం అందుకున్నాడు. రహానె అర్ధశతకం చేయడంతో నాలుగో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని జింక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా అబు జయేద్‌ విడదీశాడు. అప్పుడు స్కోరు 309.


తేనీటి విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి మయాంక్‌ స్కోరుబోర్డును వేగంగా కదిలించాడు. వరుస బౌండరీలు బాదాడు. ఓ భారీ సిక్సర్‌తో కెరీర్‌లో రెండో ద్విశతకం (303 బంతుల్లో) అందుకున్నాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వేగంగా త్రిశతకం అందుకునే క్రమంలో జట్టు స్కోరు 432 వద్ద మెహదీ హసన్‌ బౌలింగ్‌లో అబు జయేద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. జడ్డూతో 123 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లంతా అతడిని అభినందించారు. వృద్ధిమాన్‌ సహా (12) నిరాశపరిచాడు. అశ్విన్‌ కన్నా ముందుగా వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ భారీ సిక్సర్లు బాదడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. జడ్డూ అర్ధశతకం చేసిన తర్వాత ఆట ముగిసింది. బంగ్లా పేసర్‌ అబు జయేద్‌ (4/108) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఒక సెషన్‌ ఆడిన తర్వాత కోహ్లీసే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది.

- ఇండోర్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.