
తాజా వార్తలు
దిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తిరిగి టీమిండియాకు ఎంపిక కానున్నాడా? వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడతాడా? చాన్నాళ్లుగా జట్టుకు దూరమైన అతడు తిరిగి అభిమానులను మురిపించనున్నాడా? ఇవీ.. రాంచీ మైదానంలో నెట్స్‌లో ఎంఎస్ ధోనీ సాధన చేస్తున్నప్పుడు అభిమానులకు వచ్చిన సందేహాలు!!
అవును, ఎంఎస్ ధోనీ గురువారం రాంచీ మైదానంలో నెట్స్‌లో సాధన చేశాడు. చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టాడు. స్థానిక ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు మాత్రం అతడు అందుబాటులో ఉండడని సమాచారం. ‘అతడు (ధోనీ) వెస్టిండీస్ సిరీస్‌కు అందుబాటులో ఉండడు’ అని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ తర్వాత మహీ టీమిండియాకు దూరమయ్యాడు. అతడు భవితవ్యం గురించి పదేపదే చర్చ జరిగింది. సైన్యంలో చేరి రెండు నెలలు సేవ చేస్తానని చెప్పి అందరికీ స్వయంగా షాకిచ్చాడు. చర్చకు ముగింపు పలికాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకూ దూరంగానే ఉన్నాడు. భారత్, బంగ్లా చారిత్రక డే/నైట్ టెస్టుకైనా ధోనీ వ్యాఖ్యానం చేస్తాడేమో అనుకుంటే నిరాశే ఎదురైంది. ఇప్పటికీ అతడు ఆటగాడే కాబట్టి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందికి వచ్చే అవకాశముంది.