close

తాజా వార్తలు

ఎటు విన్నా ‘పింక్‌’ ముచ్చట్లే..!

ఆసీస్‌దే గులాబి ఆధిపత్యం
డే/నైట్‌ టెస్టులో త్రిశతకం బాదిన పాక్‌ క్రికెటర్ 

అహో.. గులాబి! ఓహో.. గులాబి! గంగూలీ ప్రతిపాదనకు విరాట్‌ అంగీకరించిన వేళావిశేషమో ఏమో? ఎవరి నోట విన్నా గులాబి ముచ్చట్లే. ఆ బంతి ఎక్కువ స్వింగ్‌ అవుతుందని ఒకరు. సంధ్య వెలుగులో కనిపించడం కష్టమని మరొకరు. అలవాటు పడితే కష్టమేం కాదంటూ ఇంకొకరు. ఇవన్నీ అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తున్నాయి. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలన్న ఆరాటం కలిగిస్తున్నాయి. చారిత్రక డే/నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈడెన్‌గార్డెన్స్‌ గులాబి సొబగులు అద్దుకుంటున్న వేళ మరికొన్ని ముచ్చట్లు మీ కోసం..


గంగూలీ రాకతో

అంతర్జాతీయ క్రికెట్లో  కొత్తగా ఏం ప్రవేశపెట్టినా విస్తృత ప్రచారం జరిగేది మాత్రం భారత్‌లోనే. సుదీర్ఘ ఫార్మాట్‌కు పునరుజ్జీవం కలిగించాలని ఐసీసీ 2015లోనే డే/నైట్‌ టెస్టులకు అనుమతిచ్చింది. బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఇప్పటి వరకు ఉపఖండంలో గులాబి కల నెరవేరలేదు. మార్పులు, సంస్కరణలు ఇష్టపడే సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో పరిస్థితి మారింది. అతడు ప్రతిపాదించిన మూడే మూడు సెకన్లలో విరాట్‌ గులాబి టెస్టుకు తలూపాడు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండు, మూడు నెలలైనా పడుతుందని భావించారు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండే టెస్టుకే ఒప్పించడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ్‌ బంగా సీఎం మమతా బెనర్జీ ఈ మ్యాచ్‌ను ఆరంభిస్తుండటం మరింత ప్రత్యేకం.


ఆసీస్‌దే ఆధిపత్యం

ఇప్పటి వరకు మొత్తం 11 గులాబి టెస్టులు జరిగాయి. చారిత్రక తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా 2015 నవంబర్‌ 27-డిసెంబర్‌ 1 వరకు జరిగిన ఈ పోరులో ఆతిథ్య ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చరిత్ర పుస్తకాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గులాబి టెస్టుల్లో అత్యంత విజయవంతమైన జట్టు కంగారూలదే. ఐదు టెస్టులాడి అన్నీ గెలిచింది. అడిలైడ్‌లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్లు, ఇంగ్లాండ్‌పై 120 పరుగులు, గబ్బాలో పాక్‌పై 39 పరుగులు, శ్రీలంకపై ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఆసీస్‌ తర్వాత డే/నైట్‌ టెస్టుల్లో విజయవంతమైంది శ్రీలంక. మూడింట్లో రెండు గెలిచింది. దుబాయ్‌లో పాక్‌పై 68 పరుగులు, బ్రిడ్జిటౌన్‌లో విండీస్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌, విండీస్‌పై పాక్‌, ఇంగ్లాండ్‌ తలో విజయం అందుకున్నాయి.


పాక్‌ అలీ పరుగుల ఝరి

డే/నైట్‌ టెస్టు బ్యాటింగ్ రికార్డుల్లో పాక్‌దే ఆధిపత్యం. ఆ జట్టు ఆటగాడు అజహర్‌ అలీ 6 ఇన్నింగ్సుల్లో 91 సగటుతో 456 పరుగులు చేశాడు. పింక్‌ బంతితో త్రిశతకం బాదిన ఘనతా అతడికే సొంతం. విండీస్‌పై 302తో అజేయంగా నిలిచాడు. ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ 50.62 సగటుతో 4 టెస్టుల్లో 405 పరుగులు సాధించాడు. ఒక శతకం, మూడు అర్ధశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. గులాబి టెస్టుల్లో రెండు శతకాలు చేసిన ఒకే ఒక్క ఆటగాడు పాక్‌కు చెందిన అసద్‌ షఫిక్‌.


షార్క్‌లా స్టార్క్‌ దాడి

గులాబి బంతితో అత్యంత విజయవంతమైన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఐదు టెస్టుల్లో ఈ ఆసీస్‌ పేసర్ 23 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు వికెట్ల ఘనతా ఉండటం గమనార్హం. మరో పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ 22.42 సగటుతో 21 వికెట్లు తీశాడు. ఎక్కువ డే/నైట్‌ టెస్టులు ఆడింది కంగారూలే  కాబట్టి వారిదే ఈ రికార్డుల్లో ఆధిపత్యం. వెస్టిండీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ దేవేంద్ర బిషూ అత్యుత్తమ వ్యక్తిగత రికార్డు సృష్టించాడు. పాక్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు వేసి 49 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై ప్యాట్‌ కమిన్స్‌ 6/23 గణాంకాలు నమోదు చేశాడు.


ఈడెన్‌లో చెలరేగితే

భారత్‌, బంగ్లా తొలి డే/నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈడెన్‌గార్డెన్స్‌ టీమిండియాకు అచ్చొచ్చిన వేదికల్లో ఒకటి. కోహ్లీసేన ఇక్కడ కొన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు. వన్డేల్లో ఇక్కడే ఒక డబుల్‌ సెంచరీ బాదిన రోహిత్‌శర్మ చెలరేగితే బంగ్లాకు అంతే సంగతులు. మహ్మద్‌ షమి సొంత మైదానమిది. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు బౌలింగ్‌ గణాంకాల్లో అరుదైన ఘనతలు అందుకోవచ్చు. క్యాబ్‌ గతంలో ఇక్కడ నిర్వహించిన స్థానిక టోర్నీలో బాగా రాణించాడు. అతడి బంతులు ఆడేందుకు ప్రత్యర్థి జట్టు ఇబ్బంది పడింది. కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా బంగాల్‌ క్రికెటరే. పిచ్‌పై బాగా పట్టుంది. బ్యాటింగ్‌, కీపింగ్‌తో అతడు అత్యంత కీలకం కానున్నాడు. జోరుమీదున్న మయాంక్‌ అగర్వాల్‌ నుంచి అభిమానులు ఈ సారి త్రిశతకం ఆశిస్తున్నారు. ఇండోర్‌లో డకౌటైన కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఈడెన్‌లో ఉమేశ్‌కు మంచి అవకాశం ఉంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.