close

తాజా వార్తలు

Published : 27/11/2019 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంటలే... మా వ్యాపారం

స్వశక్తి

వంటలు, తినుబండారాలపై చర్చలే... ఆ ఇద్దరు యువతులకు ఉపాధి మార్గాన్ని చూపించాయి. సంప్రదాయ వంటకాలపై చేసిన ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న వారు... సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్‌ చేసుకుంటూ వ్యాపార పరిధిని విస్తరిస్తున్నారు. ఇంటి నుంచే ఖాళీ సమయాల్లో పని చేస్తూ ఆదాయం అర్జిస్తున్నారు. వారే ముప్పైఏళ్ల మిథిల రావి, అఖిల వంకలపాటి. తమ గురించి వివరిస్తున్నారు మిథిఫల...

మాది గుంటూరు జిల్లా మంత్రిపాలెం. నాన్న వ్యాపారరీత్యా నా చిన్నతనంలోనే కర్ణాటకలోని బళ్లారిలో స్థిరపడ్డాం. అఖిల కుటుంబం సైతం అనంతపురం నుంచి బళ్లారిలో స్థిరపడింది. దాంతో చిన్నతనం నుంచీ ఇద్దరం కలిసే పెరిగాం. కాలేజీ రోజుల నుంచే నాకు, అఖిలకు వివిధ ప్రదేశాల్లో లభించే ఆహార పదార్థాలు తయారు చేయడంపై ఆసక్తి పెరిగింది. ఇంట్లోనూ అవకాశం వచ్చినప్పుడల్లా వంటలపై ప్రయోగాలు చేసేవాళ్లం. పెళ్లయిన తరువాత అఖిల చెన్నైకి వెళ్లిపోయింది, ఉద్యోగరీత్యా నేనూ హైదరాబాద్‌కు వచ్ఛా గతేడాది ఆమెకు పాప పుట్టింది. పరామర్శించడానికి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మ సంప్రదాయ వంటకం అంటూ అంటులడ్డు చేసి పెట్టింది. ప్రసవం తరువాత ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, ఎముకల బలానికి... అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌, బెల్లం, చిరుధాన్యాలతో చేసిన లడ్డు అంటూ చెప్పుకొచ్చిందామె. ఆ రుచి నాకు నచ్చడంతో మళ్లీ వినూత్న వంటకాలపై మేం చర్చించుకోవడం మొదలుపెట్టాం. అంటులడ్డు వంటి మేలిమి రకం ఉత్పత్తులను మేమే ఎందుకు తయారు చేయకూడదని అనిపించింది. అప్పటినుంచీ ఒక సంవత్సరం పాటు ప్రయోగాలు చేసి వివిధ రకాల స్వీట్లు, స్నాక్స్‌, కేకులు, బిస్కెట్లు వంటివి తయారు చేశాం.

పాతిక రకాల ఉత్పత్తులు... సంప్రదాయ వంటకాలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూ అన్నీ వినూత్నంగా రూపొందించేందుకు సిద్ధమయ్యాం. మా ఉత్పత్తుల్లో చక్కెరకు బదులు తేనె, తాటిబెల్లం, మైదా పిండికి బదులు బాదం గింజల పొడి వంటివి వాడేందుకు సిద్ధమయ్యాం. అధిక కొవ్వు, కెలొరీలు పేరుకుపోయే పదార్థాలకు బదులు ఆర్గానిక్‌ ఉత్పత్తులనే ఎంచుకున్నాం. నిల్వ ఉంచే పదార్థాలను, కృత్రిమ రంగులను వాడం. మేం చేసిన రకరకాల పదార్థాలను స్నేహితులకు రుచి చూపిస్తూ... వాళ్ల స్పందన ఆధారంగా మార్పులు చేర్పులు చేసేవాళ్లం. క్రమంగా మంచి స్పందన రావడంతో ఈ ఏడాది మొదట్లో చెన్నైలో అకిమీ గార్మెట్‌ పేరుతో మా ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించాం. మా ఇద్దరి పేర్లు వచ్చేలా వ్యాపారానికి ‘అకిమీ గార్మెట్‌’ అని పేరు పెట్టాం. నాణ్యతకు మారుపేరుగా మా ఉత్పత్తులకు గుర్తింపు రావాలనుకున్నాం. మా ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ జులైలో హైదరాబాద్‌లోనూ వీటి తయారీ ప్రారంభించాం. పోషకాలందించే కేకులు, బైట్స్‌, గ్రనోలాబార్స్‌, స్మూథీలు, బక్వీస్‌ సేవరి వంటివీ తయారుచేస్తున్నాం. ఇప్పటి వరకు 25 రకాల సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేశాం. వీటి ధర 250 రూపాయల నుంచి మొదలవుతుంది.

మార్కెటింగ్‌ అంతా మాధ్యమాల్లోనే... ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో మార్కెటింగ్‌ చేస్తున్నాం. రకరకాల ప్రదర్శనల్లోనూ మా పదార్థాలు ఉంచుతున్నాం. స్నేహితులు మార్కెటింగ్‌ పరంగా సాయం చేశారు. ఎవరైనా ఆర్డరు ఇస్తే అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. వీటిల్లో వాడే పదార్థాలన్నీ పోషకాలు అందించేవే. ప్లాస్టిక్‌ను వాడకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా ప్యాకింగ్‌ను ఎంచుకుంటున్నాం. తక్కువ సమయంలోనే మా ఉత్పత్తులకు మంచి స్పందన వచ్చింది. చాలామంది సినీ, క్రీడా ప్రముఖులు మా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. వారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లోనూ మా గురించి పోస్ట్‌ చేశారు. చెన్నైలో అఖిల, హైదరాబాద్‌లో నేను వ్యాపారం చూసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకూ విస్తరించే ఆలోచన ఉంది. పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసాహారానికి పూర్తి దూరంగా ఉండే వేగన్‌ డైట్‌ చేసే వారికి మేం ప్రత్యేకంగా స్వీట్లు, కేకులు, బిస్కెట్లు వంటివి తయారు చేసి ఇస్తాం. గ్లూటెన్‌ అలర్జీ ఉన్నవారికి అది లేని పదార్థాలు అందిస్తున్నాం. పిల్లలు, పెద్దలందరికీ నచ్చేలా చిరుధాన్యాల లడ్డూలు, ఉబకాయం, మధుమేహం ఉన్న వారికి ప్రత్యేక స్వీట్లు, స్నాక్స్‌ చేసివ్వడం మా ప్రత్యేకత. ఈ పదార్థాల సంఖ్యను ఇంకా పెంచే ప్రయత్నంలో ఉన్నాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన