close

తాజా వార్తలు

భవిష్యత్తు నగర విస్తరణ ఎటూ?

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగానికి మౌలిక వసతులే చోదక శక్తులు. నగరంలో ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు వచ్చినా ఆ చుట్టు పక్కల నివాస, వాణిజ్య నిర్మాణాల కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అవుటర్‌రింగ్‌ రోడ్డు రాకతో సిటీ రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్‌ నగరమంటే బాహ్యవలయం బయట, లోపల మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మెట్రోతో దూరం కాస్త దగ్గరైంది. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు దాటి అభివృద్ధి పరుగులు పెడుతోంది. భవిష్యత్తులో నగరం ఎటువైపు విస్తరించే అవకాశం ఉంది? వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏవి? స్థిరాస్తి మార్కెట్‌ను నడిపించే మౌలిక వసతులు ఏం కావాలి?

జనసాంద్రత పెరిగి హైదరాబాద్‌ పశ్చిమం హైటెక్‌సిటీ ప్రాంతం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ అనుభవాలతో స్థిరాస్తి సంఘాలు కొన్నేళ్లుగా ప్రభుత్వానికి పలు సూచనలు చేశాయి. ఎప్పటికప్పుడు తమ ప్రతిపాదనలను అందజేస్తున్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించడం, నగర జనసాంద్రత పెరగకుండా.. శివార్లలో పట్టణాలను అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని సుస్థిరాభివృద్ధి సాధ్యం అవుతుందని అంటున్నాయి.

గ్రోత్‌ కారిడార్‌..
* నగరంలో ఉపాధికి ఆయువుపట్టుగా ఉన్న సైబరాబాద్‌ ప్రాంతం రాబోయే రోజుల్లో మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నగరానికి అన్ని వైపుల ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అవుటర్‌ గ్రోత్‌ కారిడార్‌లో ఐటీ కేంద్రాలు విస్తరించేలా మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడున్న ప్రాంతంపై ఒత్తిడి తగ్గుతుంది. అందుకు గ్రిడ్‌ రోడ్‌లను వేయాల్సి ఉంది. ఇప్పటికే ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు, హోటల్స్‌, రిసార్ట్స్‌, వినోద కేంద్రాలు ఉండటంతో ప్రత్యామ్నాయ రహదారులతో కొత్త ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.
* అవుటర్‌ రింగురోడ్డు ఇరువైపుల ఒక కి.మీ. మేర గ్రోత్‌ కారిడార్‌ ప్రాంతంగా ఉంది. ఇది బహుళ జోన్‌. ఇక్కడ పరిశ్రమలు మినహా గృహ, వాణిజ్య ఏదైనా నిర్మాణం చేసుకోవచ్చు.
* సర్వీసు రహదారిపై అక్కడక్కడ మాత్రమే ప్రవేశించే అవకాశం ఉండటంతో.. ఉప సర్వీసు రోడ్డుతో ఎక్కడైనా అనుసంధానానికి వీలవుతుంది. ఆయా ప్రాంతాలు సహజంగానే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఓఆర్‌ఆర్‌ వెంట ఇప్పుడున్న సర్వీసు రహదారి తర్వాత బఫర్‌ జోన్‌లో స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ 40 అడుగుల ఉప సర్వీసు రోడ్డు నిర్మిస్తే అవుటర్‌ లోపల, బయట ఉన్న ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.

నగరం చుట్టూ..
వలసలతో సిటీపై భారం పడకుండా శివార్లలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.. ఏటా నగరానికి మూడు లక్షల మంది వలస వస్తున్నారు. వీరికి ఉపాధి, ఆవాసాలు కావాలంటే ప్రణాళికబద్దమైన అభివృద్ధితోనే సాధ్యమని నిపుణులు అంటున్నారు.
* నగరం వెలుపల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. వీటిని శాటిలైట్‌, రీజినల్‌ శాటిలైట్‌ టౌన్స్‌గా గుర్తించి అక్కడ మౌలిక వసతులు కల్పిస్తే చాలు. ప్రతి శాటిలైట్‌ టౌన్‌కు ఆసుపత్రులు, విద్యాలయాలు, క్రీడా మైదానాలకు మాస్టర్‌ ప్లాన్‌లో కొంత భూమిని ప్రత్యేకించి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. ఒకసారి వీటిని ఏర్పాటు చేస్తే ప్రైవేటు మాల్స్‌, సముదాయాలు వాటంతట అవే వస్తాయి.
* అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఎంపిక చేసిన ఒక్కో పట్టణం పరిధిలో ఐదు నుంచి పది లక్షల జనాభా నివసించవచ్చు.. రెండు పడకల గదుల ఇళ్లతో కొల్లూరులో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ అభివృద్ధి చెందుతోంది. శామీర్‌పేట- మేడ్చల్‌, శంషాబాద్‌, పోచారం, శంకర్‌పల్లి శాటిలైట్‌ టౌన్లు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.
* బాహ్య వలయ రహదారి బయట ఇప్పటికే పట్టణాలుగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వీటిని ప్రాంతీయ శాటిలైట్‌ పట్టణాల అర్హత ఉంది. 2 లక్షల జనాభాకు తగ్గట్టుగా వీటిని అభివృద్ధి చేయవచ్చు. బీబీనగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ ప్రాంతాలకు అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ జోరుగా నడుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.