close

తాజా వార్తలు

17 స్థానాలు మావే.. ఉత్తమ్‌

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


ఇంటర్నెట్‌ డెస్క్‌ : రాజకీయాల్లో పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ఒడుదొడుకులు సహజమని.. 2014లో నూతన రాష్ట్రాల ఆవిర్భావంతో తమ పార్టీ అదే పరిస్థితిని ఎదుర్కొందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడడం వారి తీరుకు నిదర్శనమన్నారు. నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్‌వేసిన ఉత్తమ్‌ తన అభిప్రాయాలను ఈటీవీతో పంచుకున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ నల్గొండ పరిస్థితులు,  రాష్ట్ర స్థితిగతులు, కేంద్రంలోని రాజకీయాలపై ముచ్చటించారు.

ఇప్పుడు  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాల విషయంలో కొంతమంది పేర్లు ప్రకటించింది. అటు తెరాస కూడా ప్రకటించినప్పటికీ  అభ్యర్థిత్వాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం ఏమిటి. మీరు ఈ ఎన్నికల్లో ఏమి చేయబోతున్నారు?

కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటుకు వెళ్లే ఎంపీ తన ప్రాంతం, రాష్ట్రం, దేశ సమస్యలపై మాట్లాడే సమర్థత ఉన్న వ్యక్తినే ఎంపిక చేసింది. తెలంగాణ ప్రజలను చులకన భావనతో వారిని అవమానించే విధంగా తెరాస అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఇది చాలా స్పష్టంగా కన్పిస్తుంది. నల్గొండలాంటి పోరాట గడ్డమీద ఒక చెల్లని రూపాయిలాంటి అభ్యర్థి, రాజకీయాలు తెలియని, భూకబ్జాలకు మారుపేరైన వ్యక్తిని తెరాస ఇక్కడ నిలబెట్టింది. తెలంగాణ, నల్గొండ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. దానికి దీనికి భేదం ఎలా ఉండబోతుంది. ఎంపీగా పోటీ చేస్తూ వీరందరిని  ఏవిధంగా కలుపుకుని ముందుకు వెళతారు. కొంతమందిలో మీలోనే స్పర్థలు ఉన్నాయనే భావన ఉంది.  దానిని ఏ విధంగా పరిష్కరిస్తారు?

మాలో ఎలాంటి విభేదాలు, స్పర్థలు లేవు. మేమందరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నవిషయం మీరు గమనిస్తున్నారు. అదే విధంగా ఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఏ ప్రాంతానికైతే ప్రాతినిధ్యం వహిస్తానో ఆ ప్రాంతానికి న్యాయం చేస్తానని మీరు హుజూర్‌నగర్‌, కోదాడలో ఎవరిని అడిగినా చెప్తారు.  రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడగలుగుతాననే నమ్మకం ప్రజల్లో ఉంది.

మీ సతీమణిగానీ, కోమటిరెడ్డి ఎన్నికల్లో పరాజయం చవి చూశారు.  అయితే మీరు ఒక్కరే విజయం సాధించారు. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యూహాన్ని అవలంబించబోతున్నారు?

మనస్ఫూర్తిగా  ప్రజల విజ్ఞతకే అన్ని విషయాలు వదిలేసే వ్యక్తిని నేను. ఒక ప్రజాస్వామ్య దేశంలో మన డ్యూటీ మనం చేయాలి.  దానికి అనుగుణంగా నిస్వార్థంగా నిజాయితీగా ప్రజాసేవకు అంకితమైతే ప్రజలు గుర్తిస్తారనేది నా భావన.

రాష్ట్రానికి మీరిచ్చే ప్రాధాన్యత ఏమిటి? ఎంపీగా మీరు గెలిస్తే ఏమీ చేయబోతున్నారు?

రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తాం. ఖాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌లను తీసుకువస్తాం. ఐటీఆర్‌ను పునరుద్ధరిస్తాం. ట్రైబల్‌ యూనివర్సిటీలను తీసుకువస్తాం.  గిరిజనులకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.

మీ పార్టీ హయాంలోనే రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలేదనే కోణంలో అక్కడ మీ పార్టీ బాగా నష్టపోయింది. ఇటు  తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మీ పార్టీ పుంజుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి?

రాజకీయాల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి బ్యాడ్‌ లక్‌ అవుతుంది. ఎప్పటికీ ఇదేవిధంగా ఉండదనేది నా భావన.

మీరు తెరాసను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ పార్టీ వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. కానీ మీ పార్టీలోని చాలా మంది తెరాసలోకి వెళ్తున్నారు. మీ అభిప్రాయమేంటి?

పార్టీ ఫిరాయింపులు, ఈ స్థాయిలో రాజకీయాలు నైతికంగా దిగజారిపోవడానికి కారణం కేసీఆర్‌ ఘనతే. నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయాలు ఇంత దిగజారిపోలేదు. రాజకీయ నాయకుల గురించి ప్రజలు ఛీ కొట్టుకునే విధంగా కేసీఆర్‌, తెరాస పార్టీ దిగజార్చింది. ఇది సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగ పరంగా విరుద్ధం. తప్పనిసరిగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పార్టీని వీడేవాళ్లంతా గతంలో కాంగ్రెస్‌లో ఉన్నత పదవులు అనుభవించిన వారే. ఈ విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.

పార్టీలోని కొందరి వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నామని ఒక ఆరోపణ వినపడుతుంది. దీనికి మీరేమంటారు?

ఏమీ లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నాం. పార్టీ  కష్టకాలంలో ఉంది కాబట్టి పారిపోతున్నారు. దానికి వేరే కారణమేమి లేదు.

డీకే అరుణ లాంటి సీనియర్‌ వ్యక్తులను కోల్పోవడం మీ పార్టీకి ఇబ్బందికర పరిణామమా? దీనివల్ల మీరు నష్టపోయామనుకుంటున్నారా?

ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగానే అనిపించింది. అధికారం కోల్పోయినప్పుడు నష్టం జరిగిందని అనుకుంటుంన్నారు. ఎవరూ ఏమి నష్టం చేయలేదు. ఉన్నత పదవులు అనుభవించిపోయిన వాళ్ల పట్ల ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని నేను భావిస్తున్నా.

పవర్‌ ప్లాంటును మీ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తోంది?

పవర్‌ప్లాంటుకు వ్యతిరేకం కాదు. అభివృద్ధికి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు. పవర్‌ ప్లాంటులో ఉన్న అవకతవకలను వ్యతిరేకిస్తున్నాం.

జానారెడ్డి, కోమటిరెడ్డిలాంటి నేతలు ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వారిని ఏ విధంగా కలుపుకుని  పోయే అవకాశం ఉంది?

జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, దామోదర్‌రెడ్డి అందరం కలిసే ముందుకు పోతున్నాం. మీరే(మీడియా) ఏమైనా క్రియేట్‌ చేస్తే చెప్పలేం. అంతా బాగానే ఉంది. మేను యూనిటీగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు వెళ్తున్నాం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. కానీ మీరు చాలా స్థానాలు కోల్పోయారు. కేవలం ఒక్కస్థానంలో మీరు తప్ప ఎవరూ గెలవలేదు. భువనగిరిలో నకిరేకల్‌, మునుగోడు మాత్రమే కైవసం చేసుకున్నారు. అందులో నకిరేకల్‌ను కోల్పోయారు.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఏవిధంగా పడతాయని మీరు అనుకుంటున్నారు. మీకు ఎమ్మెల్యేల బలం లేదు కదా?

అప్పుడున్న ప్రజల ఓటింగ్‌ సరళి వేరే విధంగా ఉంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌ జరిగిందని మా అందరి అనుమానం. ఇప్పుడు అవన్నీ ఉండవు. ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికల సరళి వేరేవిధంగా ఉంటుంది.  ఫ్రీ ఫెయిర్‌ అండ్‌ న్యూట్రేలక్షన్స్‌ జరిగితే పార్లమెంటులో మేము గెలుస్తాం.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్లే రాష్ట్రానికి అపకీర్తి వస్తుంది. అంటే రాష్ట్రానికి మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. జిల్లాను పట్టించుకోవడంలేదని కార్యకర్తల్లో ఒక భావన ఉంది.  ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా ఏవిధంగా జిల్లాలో సమన్వయం చేసుకుంటారు. నియోజకవర్గం పరిధిలో ఏవిధంగా తిరుగుతారు?

వాస్తవానికి నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం జరిగింది. జిల్లాల్లో ఎక్కువ మంది సమర్థులైన నాయకులు ఉన్నారు కాబట్టి నేను సమయం కేటాయించలేదు. ఎక్కువగా రాలేదు. కానీ  ఏడు నియోజకవర్గాలు తిరుగుతాను. రాష్ట్రమంతా పర్యటిస్తాను. 21 రోజులు కూడా కష్టపడతా.

మీ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న తెరాస అభ్యర్థి వేంరెడ్డి నరసింహరెడ్డి కొత్త వ్యక్తి. ఎవరికీ పరిచయం లేదని మీరు అంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన తెరాస తరుపున అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్నారు. మీ మధ్య పోటీ ఎలా ఉండబోతుందంటారు?

వార్‌ వన్‌ సైడ్‌. అసలు పోటీ లేదు. దేశం కోసం పోరాడిన సైనికుడికి, భూ కబ్జాదారుడికి ఏమీ పోటీ ఉంటుంది. ఏమీ ఉండదు. అధిక స్థానాలు గెలుస్తాం. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలను మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తాం.

శాసనసభలో మీ ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదం ఉందన్న మాటలు వినబడుతున్నాయి. దీన్ని ఏవిధంగా కట్టడి చేస్తారు. ఏవిధమైన చర్యలు తీసుకుంటారు?

తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడడం అందరి బాధ్యత. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి.. ఆయనే యథేచ్ఛగా చట్టవ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు బహిరంగంగా వేరే పార్టీ కండువా కప్పితే మీడియాలో ఎక్కడా విమర్శలు కనిపించట్లేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ మీపై ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అనుకోవచ్చు. కానీ నకిరేకల్‌ ఎమ్మెల్యే  పార్టీ వీడే ముందు మీపై తీవ్ర విమర్శలు చేశారు. మీ వల్లే పార్టీ వీడాల్సి వచ్చిందని అన్నారు?

ఇది పూర్తిగా అబద్దం. ఆయనకు నాకు సంబంధంలేదు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో వేరే వాళ్లతో ఉండేవారు. అతను ఆ విధంగా ఎందుకు విమర్శలు చేశారో నాకు అర్ధం కాలేదు.

ప్రస్తుత ఎన్నికల్లో 17కు 16 స్థానాలు గెలుచుకుంటామని తెరాస అంటుంది. మీ పార్టీ ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు?

 17లో మెజారిటీ ఎంపీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోబోతోంది. అంతవరకు మేము పరిమితం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ఏవిధంగా జరుగుతోంది.  సమయం ఎలా కేటాయిస్తారు?

అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలోని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారం చేయబోతున్నాము. అదేవిధంగా సోషల్‌మీడియా ద్వారా ప్రచారం మొదలైంది.

 

 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.