close

తాజా వార్తలు

మాధేపురా మాదే.. ఎవరైనా మా వారే..

మాధేపురా: బిహార్‌లోని మాధేపుర లోక్‌సభ నియోజకవర్గంలో యాదవుల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే ‘రోమ్‌ నగరం పోప్‌ సొంతమైతే మాధేపుర గోప్‌ (యాదవుల) సొంతం’ అనే నానుడి ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ఈ లోక్‌సభ స్థానం నుంచి యాదవేతర సామాజిక వర్గానికి చెందిన  ఒక్క వ్యక్తి కూడా ఎంపీగా ఎన్నిక కాకపోవడమే  ఇందుకు నిదర్శనం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ) అధినేత శరద్‌యాదవ్‌ ఇదే నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ఎంపికైన ఎంపీ  పప్పు యాదవ్‌ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఈ సారి ఆయనకు ఆర్జేడీ సీటు కేటాయించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ మద్ధతుతో శరద్‌ యాదవ్‌ బరిలోకి దిగుతున్నారు. ‘వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి’ అనే ఉద్దేశంతోనే లాలూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నిణుపులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరినీ సమర్థంగా ఎదుర్కొనేందుకు  ఎన్డీయే కూటమి నుంచి జేడీయూకు చెందిన దినేశ్‌ చంద్ర యాదవ్‌ పోటీ చేస్తున్నారు. దీంతో మాధేపుర ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

 

నితీశ్‌ అభివృద్ధి మంత్రం పని చేసేనా..!

ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ‘ నేను మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే నాకు జీతమివ్వండి ’ అంటూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రతి సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.  మరోవైపు ఆయనతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ.. ప్రధాని సాధించిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధి తప్ప మరే ఇతర అజెండా ఎన్డీయే కూటమికి లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.  కానీ, నితీశ్‌  అభివృద్ధి మంత్రం ఇక్కడ పని చేయదని స్థానికులు చెబుతున్నారు. మాధేపురలోని రహదారులంత అధ్వాన్నంగా దేశంలో మరెక్కడా ఉండవని వారు అంటున్నారు. ప్రధాన రహదారులు కూడా గోతులతో నిండిపోయాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే ‘ఇప్పటి వరకు జేడీయూను గెలిపించినవి రోడ్లే కాదు కదా!’ అనే వాదన కూడా ప్రచారంలో ఉంది. 

విజయంపై పప్పు ధీమా

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పప్పు యాదవ్‌ విజయంపై ధీమాగా ఉన్నారు. మాధేపుర యువత అంతా తనకు అండగా ఉంటుందని ఆయన అంటున్నారు. ‘నేను ఇదే గడ్డపై పుట్టాను. దాని అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతాను’ అంటూ ప్రజల్లోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆర్జేడీ తనను మాత్రమే బయటకు పంపలేదు.. శరద్‌ యాదవ్‌కు సీటు కేటాయించడం ద్వారా మాధేపుర ప్రజానీకాన్నే పక్కన పెట్టింది. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారంటూ’ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నితీశ్‌ కుమార్‌ సామాజికవర్గమైన కుర్మితో పాటు ఎస్సీ, కొన్ని ఆర్థికంగా వెనకబడిన కులాలు  అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్డీయే కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ ఓటర్లను తమ వైపు పూర్తిగా తిప్పుకోవడంతో పాటు యాదవ వర్గం నుంచి కొన్ని ఓట్లు వచ్చినా విజయం తథ్యం అనే యోచనలో వారు ఉన్నారు.

 

‘మాధేపుర స్థానంలో భాజపా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అందువల్ల ఇక్కడ పోటీ చేయడం కత్తిమీద సామే అని ముఖ్యమంత్రి నితీశ్‌కు తెలుసు. అయినప్పటికీ ఎలాగైనా గెలుపొందాలనే  ఉద్దేశంతో ప్రజల్లో కాస్తా పలుకుబడి ఉన్న దినేశ్‌ చంద్రయాదవ్‌ ను బరిలోకి దించారు. అంతేకాకుండా గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ (భాజపా) రామ్‌ విలాశ్‌ పాసవాన్‌ (ఎల్‌జేపీ) ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయినా విజయం సాధించడం అంత సులభమేమీ కాదు’అని కొందరు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వరదలు, గిట్టుబాటు ధర లేకపోవడం, రహదారుల నిర్వహణ తదితర సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఆ కారణాల వల్ల ఓట్లు చీలే అవకాశమే లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి గెలుపొందిన పప్పు యాదవ్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉందని, ఆర్జేడీ అతనికి సీటు కేటాయించనప్పటికీ ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరి కొందరు తెలిపారు. మరోవైపు ఎన్డీయే అభ్యర్థి దినేశ్‌ చంద్ర యాదవ్‌ నుంచి కూడా గట్టి పోటీ ఎదుయ్యే అవకాశాలున్నాయి.

ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. మే 23న వెల్లడయ్యే ఫలితాల్లో ఈ నియోజవర్గం నుంచి విజయం సాధించేది మాత్రం ఓ ‘యాదవ్‌’ అని ఇప్పటికే తేలిపోయింది. యాదవుల కంచుకోటైన ఈ నియోజవర్గానికి మూడవ విడతలో ఏప్రిల్‌ 23 న పోలింగ్‌ జరగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.