
తాజా వార్తలు
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. అయితే సంఖ్యలతో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవన్నీకేవలం అంచనాలు మాత్రమేనని అన్నారు. గతంలోనూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చెప్పాననీ అయితే 100 శాతం కచ్చితంగా వెల్లడించడం సాధ్యం కాదని తెలిపారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల పోల్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘గతంలోనూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. కాకపోతే తెలంగాణలో దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పాను. కానీ, ఇద్దరే విజయం సాధించారు. మిగతా వారంతా రెండో స్థానంలో నిలిచారు. అయితే వారంతా ఎందుకు రెండో స్థానంలో నిలిచారో, మాకు అందిన సమాచారం ఎందుకు తప్పయిందో చెబుతాను’’ అని అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు లగడపాటి సమాధానమిచ్చారు.
ఈ రోజు మీరు చెప్పిన అంశాలు మీ సర్వే రిపోర్టులోనే తేలిందా? లేదా మీరు అనలైజ్ చేసి చెబుతున్నారా?
లగడపాటి: ఇవాళ నేను చెబుతున్నది నాకున్న అంచనా. రేపు చెప్పబోయేది మా టీం చాలా శాస్త్రీయంగా, లోతుగా పరిశీలించి, వారు నాకు అందజేయబోయే రిపోర్టు. ఎవరు గెలుస్తారని చెప్పడం నాకు ముఖ్యం కాదు. ఎన్నిసీట్లు గెలుస్తారని చెప్పడమే నాకు ముఖ్యం. అప్పుడే నా క్రెడిబిలిటీని రుజువు చేసుకోగలుగుతాను. తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి. ఏపీ పార్లమెంట్, అసెంబ్లీల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయని చెప్పడమే నాకు ముఖ్యం.
కేంద్రంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?
లగడపాటి: అవన్నీ వాళ్లని అడగండి. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధాన మంత్రి అనే విషయం నాకు సంబంధించినది కాదు.
మీరు రాష్ట్రానికే పరిమితమా.. కేంద్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడిస్తారా?
లగడపాటి: అవును.. సర్వే రూపంలో కాదు గానీ, నేను దేశవ్యాప్తంగా చాలా చోట్లకు వెళ్లాను కాబట్టి.. వివిధ ప్రాంతాల్లో గెలుపోటములపై నాకు ఓ అంచనా ఉంది. కాకపోతే సంఖ్యా పూర్వకంగా చెప్పడం ముఖ్యం. ఇప్పటికే కేంద్రంలో రెండు కూటములున్నాయి. మూడో కూటమి కూడా తయారవుతోంది. నాలుగో కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రాదన్నది ఓ వాదన. అయితే ఎంతమేర ఇతర కూటములకు చెందిన పార్టీలపై ఆధారపడతారన్నది ముఖ్యం. అది కూడా అంచనా వేస్తున్నాం. అయితే నేను నా దృష్టంతా ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పైనే పెట్టాను. దేశవ్యాప్తంగా నాకు ఓ అంచనా ఉన్నప్పటికీ ప్రస్తుతం దాన్ని పరిశీలించుకుంటున్నాను. ఒక వేళ నాకు స్పష్టమైన అంచానా వస్తే రేపు అది కూడా చెప్తాను.
గతంలో మీరు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దాదాపు రూ.870 కోట్ల మేర బెట్టింగులు జరిగినట్లు అంచానా. ప్రస్తుతం ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..!
లగడపాటి: ఇవాళ ఇది కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ మేము ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూసి చెప్పడం లేదు. కొంత అటూ ఇటూ తేడాలుంటాయనే విషయాన్ని పరిశీలించుకోవాలి. బెట్టింగ్ అనేది నేరపూరితమైనది. అది జరగకుండా పోలీసు యంత్రాంగం చూసుకోవాలి. నేను నెలరోజుల నుంచి అమెరికాలో ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలీదు. నిన్న రాత్రే ఇక్కడికి వచ్చాను. కేవలం ఎన్నికలపైనే కాదు.. ఏ విషయంలోనూ బెట్టింగ్ మంచిది కాదు. జూదం అంతకన్నా మంచిదికాదు. ధర్మరాజుకు ఏమైందో తెలుసుకదా..ఇంద్రప్రస్థం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎలాంటి బెట్టింగులు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు, పోలీసు యంత్రాంగం తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను చెప్పేదేంటంటే.. ఎన్నికల ఫలితాల ఏ ఎగ్జిట్‌పోల్స్ అయినా పూర్తిగా 100 శాతం కచ్చితంగా వస్తాయని అనుకోవద్దు. వీటి ఆధారంగా ఎవరూ బెట్టింగ్ జోలికి పోవద్దు.
గతంలో జరిగిన విధంగా ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో మీ అంచనా తప్పితే ఏం చేయబోతున్నారు?
లగడపాటి: ఏం చేయమంటారో చెప్పండి. ఆరోజు నేను బలంగా పోరాడాను. ఇవాళ నేను ఎవ్వరినీ ఛాలెంజ్ చెయ్యట్లేదు. ఈ ఫలితం నా పోరాటం కాదు. పోరాటం వేరేవాళ్లది.. నాది అంచనా మాత్రమే. పోరాటం చేసిన వాళ్లు వేరు.. ఓట్లు వేసిన వాళ్లు వేరు. కేవలం నేను అంచనా మాత్రమే చెప్పాను. అందువల్ల ఏ పార్టీ గెలిచినా గెలవక పోయినా.. నాకు వ్యక్తిగతంగా ఏమీ తేడా రాదు. కాకపోతే రాష్ట్ర ప్రజలు కొంతమంది ఈ పార్టీ గెలిస్తే బాగుంటుందని, కొందరు ఆ పార్టీ గెలిస్తే బాగుంటుందని వాళ్లు అనుకుంటారు.అందువల్ల ఇది నా ఛాలెంజ్ కాదు. అంతేకాకుండా ఫలానా పార్టీ గెలుస్తుందని నేను బల్లగుద్ది వాదించడం లేదు. ఆ పార్టీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేయలేదు. కేవలం అంచనా మాత్రమే చెబుతున్నాను.
మీ అంచనాల ప్రకారం పవన్ కల్యాణ్ ఏ స్థాయిలో ఉండొచ్చు?
లగడపాటి: ఆయన మెగాస్టార్ బ్రదర్. చిన్న తమ్ముడు. మెగాస్టార్ కంటే కొంచెం తక్కువగానే ఉంటారు. అయితే పవర్‌స్టార్ కచ్చితంగా వెలగపూడిలోని శాసనసభలోకి అడుగుపెడతారు.
హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాలేమైనా ఉన్నాయా?
లగడపాటి: కచ్చితమైన మెజార్టీతో కూడిన ప్రభుత్వమే ఏర్పడుతుంది. హంగ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు చెబుతున్నానంటే తెలుగు ప్రజలు సమైక్య రాష్ట్రంలో గానీ, విడిపోయిన తర్వాత గానీ ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారు.
కొత్తగా పవర్‌స్టార్ ఎన్నికల బరిలో నిలవడం వల్ల.. ఇతర పార్టీల అవకాశాలేమైనా సన్నగిల్లాయా?
లగడపాటి: కచ్చితంగా.. గతంలో ఆ రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓటింగ్ శాతం మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. అది పెద్దగా మనుగడలో లేదు. గతంలో ఒకరికి 44.6, మరొకరికి 44.9, వారి మిత్రపక్షాలకు 2.9శాతం ఓట్లు సాధించాయి. కానీ, ఇప్పుడు మూడో పార్టీ వచ్చినపుడు కచ్చితంగా ఇరుపక్షాల వారికి ఓటింగ్ శాతం తగ్గుతుంది. అందులో సందేహం లేదు.
ఎవరికి తగ్గే అవకాశముంది?
లగడపాటి: అదంతా నేను రేపు చెబుతాను. ఇంకా స్పష్టత రావాలంటే 23న వెలువడే ఫలితాలు చూసుకోండి.
మీరు ఏ పార్టీకీ చెందను అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో మీరు చాలా సార్లు చంద్రబాబును కలిశారు. అవతలి పార్టీ వాళ్లు దీనిని ఎలా తీసుకోవచ్చు?
లగడపాటి: గత ఐదేళ్లలో నేను చంద్రబాబును కలిశాను. అలాగే జగన్మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్‌ను కూడా చాలా సార్లు కలిశాను. అయితే నేను వాళ్లని కలవడానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.
గత ఆరు నెలల్లో మీపై తెదేపా ముద్ర ఉంది. ఆ పార్టీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు?
లగడపాటి: ఒక వేళ అలా జరిగితే ఎన్నికల్లో పోటీ చేసేవాడిని కదా. రాజకీయం వద్దనుకున్నాను. పోటీ వద్దనుకున్నాను. అన్నిటికీ దూరంగా ఉన్న నేను ఎందుకు ఒకరికి దగ్గరగా ఉండాలి. అలాగైతే జగన్మోహన్రెడ్డి కుటుంబం ఒక విధంగా నాకు సన్నిహితం. వివేకానందరెడ్డిగారు చనిపోయినప్పుడు నేను పులివెందుల వెళ్లి వచ్చాను. రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి నాకు బాగా సన్నిహితం. ఇద్దరం కలిసి వ్యాపారం చేశాం. కుటుంబ అనుబంధాలు వేరు.. పార్టీల అనుబంధాలు వేరు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
