close

తాజా వార్తలు

ఈ సారి తప్పితే మళ్లీ సర్వే చెప్పను: లగడపాటి

తిరుపతి: ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే అంచనాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల రీత్యా రాష్ట్ర ప్రజలు మరోసారి తెదేపా వైపే మొగ్గుచూపినట్టు  తమ సర్వేలో తేలినట్టు వెల్లడించారు. పవన్‌ రాకతో ఈసారి ఏపీలో త్రిముఖ పోరు నెలకొందన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని అక్కడి ప్రజలు భావించారని విశ్లేషించారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చెప్పిన అంచనాలు తలకిందులైన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. ఈ నెల 23 తర్వాత తన విశ్వసనీయత పెరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.ఈ సారి తన సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పనని లగడపాటి స్పష్టంచేశారు. తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు లగడపాటి సమాధానాలు ఆయన మాటల్లోనే..   

సర్వేలో ఎన్ని సాంపిల్స్‌ తీసుకున్నారు?
‘‘జనవరి నుంచి ఎన్నికల పోలింగ్‌ జరిగిన తర్వాత కూడా ఇంచుమించు 110 నుంచి 120 స్థానాల వరకు వివిధ దశల్లో ప్రజల నాడి తెలుసుకుంటూ వచ్చాం. మహిళలు, మగవాళ్లు, యువకులు ఓటు ఎటువేశారనేది అంచనాలు వేసి శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాం. సుమారు 1200 సాంపిల్స్‌ చేస్తే పారదర్శకంగా ఉంటుందని, ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న ఉద్దేశంతో చేశాం. ఏపీలో 13 జిల్లాల్లో ఈ నాలుగైదు నెలల్లో సుమారు లక్షా 50వేల మందిని సర్వేచేసి నాడి పసిగట్టాం. 

తెలంగాణలో అంచనాలు ఎందుకు ఫెయిలయ్యాయి? 
‘‘ఈ ఫలితాలు వచ్చిన రోజు నా సర్వేను బేరీజు వేసుకున్నాక చెప్తా. నాపై విశ్వసనీయత పెరుగుతుంది. ఈ ఫలితాలపై లోతుగా అధ్యయనం చేశాం. అనేక జాగ్రత్తలు తీసుకున్నాం.  మా అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా లోతైన అధ్యయనం చేశాం. 15ఏళ్ల నుంచి సర్వే చేస్తున్నాం. తెలంగాణ విషయంలో ఒకేసారి ఎందుకు తప్పింది? ఎందుకు తేడా వచ్చిందనేది ఆ రోజు తెలియజేస్తా. నేను ఈ రోజు చెప్పిందే వాస్తవం. నా పేరుతో ఏవైనా సర్వేలు సర్క్యులేట్‌ అయితే నాకు సంబంధంలేదు. నేను నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితేనే అదినేను చెప్పినట్టు. మీడియాలో కథనాలు రాసినా, సోషల్‌మీడియాలో వచ్చినా నమ్మొద్దు. నా వాయిస్‌ లేకపోతే నాకు సంబంధించింది కాదు. 

తెదేపాకు ఏంటి ప్లస్‌ అయ్యాయి?
‘‘సంక్షేమ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రం. వద్దనుకుంటే రుద్దిన రాష్ట్రం. 60శాతం జనాభాకు 40శాతం నిధులు మాత్రమే వచ్చిన రాష్ట్రం. రాజధాని లేదు. అనుభవం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే బాగుంటుందని గత ఎన్నికల్లో చంద్రబాబుకు అవకాశం కల్పించారు. అలాగే ఈ ఐదేళ్లలో చేపట్టిన రాజధాని నిర్మాణం, చుట్టూ కొండల మధ్యలో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున 40వేల ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంలో ప్రపంచ శ్రేణి నగరాన్ని నిర్మించాలన్న సంకల్పంతో  ప్రభుత్వం పనిచేస్తోంది గనక అది పూర్తయితే బాగుంటుందని ప్రజలు భావించారు. ఉన్న ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగితే బాగుంటుందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ప్రజలు నమ్మారు. చివరి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, మేనిఫెస్టోలో వాగ్దానాలు పనిచేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగితే సాఫీగా ఉంటుందని ఆ విధంగా తీర్పు ఇచ్చారు. మహిళలు ఎక్కువగా అధికార పక్షానికి ఓటు వేసినట్టు మా అంచనాల్లో తేలింది. ఈసారి కుర్రోళ్లు పవన్‌, వైకాపా వైపు నిలబడినట్టు మాకు కనబడింది’’  

‘‘నా సర్వేను నమ్మాలని నేను ఎవరినీ కోరడంలేదు. బల్లగుద్ది చెప్పట్లేదు. కత్తిపెట్టి ఇది వినండని అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నా వాయిస్‌ వెళ్లింది. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైంది. దాంతోనే అంతమైంది. అన్ని పార్టీలూ నాకు సమానమే. ఏ పార్టీతోనూ నన్ను ముడిపెట్టొద్దు. స్వతంత్రంగా ఉండదలుచుకున్నా’’

ఆ తేడా స్వల్పం.. ఎందుకు?
‘‘గత ఎన్నికల్లో 2.8శాతం తేడా ఉంది. వైకాపాకు 44.6 శాతం వస్తే.. తెదేపాకు 47.3 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ఓటింగ్‌ మూడో పార్టీ వల్ల తగ్గింది. అందుకే తేడా పోటాపోటీగా ఉంది. జగన్‌కు అవకాశం వస్తే ఏవైనా కొత్త మార్పులు చేస్తారేమో అని చూసేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ పోటా పోటీలో ఒకరిదే పైచేయి అవుతుంది. తమిళనాడులో 2016లో 1శాతమే ఓట్ల తేడా అయినా 30సీట్ల తేడాతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పులివెందుల, మంగళగిరి, కుప్పం.. ఇలా విడివిడిగా నియోజకవర్గాల వారీగా చెప్పను.  తమిళనాడు, బిహార్‌, యూపీలో మేం చెప్పినట్టే దాదాపు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో 2004 నుంచి మా సర్వేలు ఎక్కడా తప్పుకాలేదు. ఒకేసారి తెలంగాణలో తేడా వచ్చింది. ఎందుకలా జరిగిందో మరోసారి చెబుతా. 

ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది?
గతంలో ఒక్కో జిల్లా ఒక్కొక్కరికి అండగా నిలిచింది. ఈసారి అవే జిల్లాలు అలాగే అండగా నిలుస్తాయని కాదు. మార్పులు చేర్పులు ఉంటాయి. జిల్లాల జోలికి వెళ్లడం లేదు. 13 జిల్లాలూ ముఖ్యమే. ఏపీలో నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఒక జట్టుగా ఉంటాయి.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి మరో జట్టు.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో ఇంకో జట్టు. ఈ మూడు జట్లలో ఏ రెండు జట్లు కలిసినా ప్రభుత్వం వాళ్లదే. ఆయా జిల్లాల్లో కాస్త అటూఇటుగా తేడా ఉంటుంది.  అవి ఈ నెల 23న చూడబోతున్నాం.

జగనే నాకు బాగా దగ్గర!
‘‘నాకు జగన్‌, చంద్రబాబు, పవన్‌ అంతా తెలుసు. జగన్‌ నాకు బాగా దగ్గర. వైఎస్‌కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అదంతా వ్యక్తిగతమైన అనుబంధమే తప్ప రాజకీయంగా కాదు. నేను ఏ పార్టీలోకీ వెళ్లను. నా అంచనాలో ఎమ్మెల్యేలపై అనుకూలత, ప్రతికూలతను దృష్టిలో పెట్టుకున్నాం. అలాగే, ప్రతిపక్షాల పనితీరు, వారి పోరాటాలు.. ప్రజల ఆలోచనల్ని లోతుగా అధ్యయనం చేసి మాకు వచ్చిన అంచనాను చెబుతున్నాం. వినాలని ఎవరినీ బలవంతపెట్టడం లేదు. నేను చెప్పేది కరెక్టో కాదో 23 తర్వాత  తెలుస్తుంది. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్య ఉంది. ఇతర పార్టీల గురించి ప్రస్తావించడం అవసరం లేదనుకుంటున్నా. ఎవరి అంచనాలువారివి. ఎవరి అంచనాల్నీ నేను విభేదించను. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ప్రయత్నాలు వారివి. ఈసారి నా అంచనా తప్పితే నాపై నమ్మకం పోతుంది. మళ్లీ తప్పిందంటే నాపై విశ్వసనీయత పోతుంది. అలాగైతే నేను చెప్పే అవకాశం కూడా ఉండదు’’

కేసీఆర్‌కు ధన్యవాదాలు
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ముందు ప్రత్యేక హోదాకు మద్దతిస్తామన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఇదే వైఖరిని కొనసాగిస్తే మాత్రం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదాసాధించొచ్చు. మొత్తం 42 మంది ఎంపీల సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారు. సంతోషిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది.’’ 

పవన్‌ ఓ కులానికి చెందిన వ్యక్తి కాదు
‘‘ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కులానికి సంబంధించిన వ్యక్తికాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆయనో పవర్‌స్టార్‌. అనేక కులాల్లో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ ఉన్నారు. సామాజికవర్గంతో సంబంధంలేకుండా చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నా హృదయానికి దగ్గరున్న పార్టీ. ఎల్లవేళలా నేను ఆ పార్టీకి రుణపడి ఉంటా. మా పోరాటాల వల్ల కాంగ్రెస్‌ కనుమరుగైంది. పూర్తిగా క్షీణించింది. ఆ బాధ మాకు ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ పుంజుకోవాలన్న ఆశ ఎప్పుడూ ఉంటుంది.’’ అని లగడపాటి వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.