close

తాజా వార్తలు

భారత ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్‌ ‘హస్త’వ్యస్థం

రాహుల్‌ గాంధీలో ఎంతో మార్పు కనిపిస్తోంది. వాగ్ధాటి పెరిగింది. ప్రసంగాలు వేడెక్కాయి. నరేంద్ర మోదీపై ఎక్కుపెట్టిన విమర్శల్లో గాంభీర్యం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఆయనిప్పుడు మారిన మనిషి. పాత వ్యక్తి కాదు. పరిణతి కలిగిన ‘దేశ్‌కీ నేత’గా ఎదుగుతున్నారు. ఇక మోదీకి ఓటమి ఖాయం! ఇవీ ఎన్నికల ముందు ఏఐసీసీ అధ్యక్షుడిపై కొందరి అభిప్రాయాలు. చివరికి ఫలితాలు చెప్పిందేమిటి? రాహుల్‌ గాంధీ నాయకత్వంలో చేసుకోవాల్సిన మార్పులు ఇంకా చాలా ఉన్నాయని! నేర్చుకోవాల్సింది మరెంతో ఉందని! ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవ కారణాలకు కేంద్ర బిందువు ఆయనే!!

వట్టి మాటలే..!

నాయకుడు అంటే చేతల మనిషి. తాను ముందుండి అందరినీ తన వెంట నడిపించాలి. దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్‌ను ఏకతాటిపై నడిపించడం ఆషామాషీ కాదు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యలు నిర్వహించిన సమయంలోనూ రాహుల్‌ తన సమర్థత నిరూపించుకోలేదు. వారసత్వంగా 2017లో అధ్యక్ష పదవిని చేపట్టారు. అంతేగానీ పార్టీపై పూర్తిగా పట్టు సాధించలేదు. ప్రజా బాహుళ్యంలోకి వెళ్లలేదు. నాయకుడికి దేహభాష అత్యంత కీలకం. చెప్తున్న మాటలకు దేహభాషకు పొంతన లేకుంటే ప్రజలు సులభంగా కనిపెట్టేస్తారు. రాహుల్‌ విషయంలో ఇదే జరిగింది. కాంగ్రెస్‌ తరఫున తానే ప్రధాని అభ్యర్థిననే ఆత్మవిశ్వాసమే ఆయనలో కనిపించలేదు. పొత్తుల విషయంలో తేలిపోయారు. బతిమిలాడే స్థితిలోనే ఉండిపోయారు.

రాహుల్‌కు మార్గనిర్దేశం చేసే వ్యూహకర్తలూ కనిపించలేదు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాను అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడం నష్టమే కలిగించింది.  రాహుల్‌కు సత్తా లేకపోవడంతోనే ఆమెను రంగంలోకి దించారని అనిపించింది. విపక్ష నేతగా పార్లమెంటులోనూ రాహుల్‌ తన ప్రభావం చూపలేదు. జీఎస్టీకి మద్దతిచ్చిందీ ఆయనే. గబ్బర్‌సింగ్‌ టాక్స్‌గా విమర్శించిందీ ఆయనే. రాహుల్‌ అనుభవ రాహిత్యం కాంగ్రెస్‌కు ఒక రకంగా నష్టం కలిగించిందని చెప్పవచ్చు. యూపీఏ పాలనలో ఆయన మంత్రి కాలేదు. దాంతో పాలనపై అనుభవమూ రాలేదు. ప్రభుత్వ నిర్వహణలో వాస్తవిక సమస్యలు తెలిసి రాలేదు. మొత్తంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థి కాదనిపించింది.

గోరంతలో కొండంత ఎలా?

ప్రధాని నరేంద్రమోదీని విమర్శించాలంటే రాహుల్‌కు కేవలం రఫేల్‌ మాత్రమే దొరికింది. సాధారణ ప్రజలకు రఫేల్‌పై అవగాహనే లేదు. ఈ ఒప్పందం విలువ రూ.30,000 కోట్లైతే రాహులేమో పదేపదే అంబానీలకు మోదీ ఆయాచితంగా రూ.లక్ష కోట్లు ధారపోశారని విమర్శించారు. భాజపా దీనిని తెలివిగా తిప్పికొట్టింది. రూ.30వేల కోట్ల ఒప్పందంలో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించడం కాస్త ఆలోచించేలా చేసింది. ఇక ‘చౌకీదార్‌ చోర్‌ హై’ విమర్శ విషయంలోనూ రాహుల్‌ సుప్రీం చేతిలో మొట్టికాయ తిన్నారు. దేశంలో మరే సమస్య లేనట్టు దీనినే పట్టుకున్నారు. సాధారణ ప్రజల సమస్యలేంటో ఎత్తి చూపలేకపోయారు.

గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి జీఎస్టీతో కూరగాయాలు, పప్పులు, నూనెలు, వంట సామగ్రి ధరలు అదుపులో ఉండటంతో రాహుల్‌కు ఆ సమస్య దొరకలేదు. పెట్రోలు, డీజిల్‌ ధర పెరుగుదలను ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇక జీఎస్టీపై రాహుల్‌ శైలి సరిగ్గా లేదు. ఉభయసభల్లో బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఆ పార్టీ పాలిత రాష్ట్ర సీఎంలు జీఎస్టీ పాలక మండలిలో సభ్యులు. వీరు అన్నిటికీ అంగీకరించి బయటకొచ్చి గబ్బర్‌సింగ్‌ టాక్స్‌ అని ఫోకస్‌ చేయడాన్ని ప్రజలు బాగానే గుర్తించారు.

పొడవని పొత్తులు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వ్యూహాత్మక వైఫల్యాలు వెంటాడాయి. ప్రణబ్‌ ముఖర్జీలా చైతన్యవంతుడైన ట్రబుల్‌ షూటర్‌ ఇప్పుడా పార్టీకి లేరు. అనారోగ్యంతో సోనియా చురుగ్గా లేరు. చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌, అహ్మద్‌పటేల్‌, కమల్‌నాథ్‌, గులామ్‌నబీ ఆజాద్‌, జైపాల్‌ రెడ్డి ఇంకా మరికొందరు సీనియర్లు ఎన్నికల తెరపై కనిపించలేదు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వృద్ధనేతలను పక్కన పెట్టారు సరే! జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌ పైలట్‌ వంటి యువ నేతలనైనా ప్రోత్సహించారా? అంటే అదీ లేదు. అంతా రాహుల్‌ మయం. లేదంటే ప్రియాంక. అటు ప్రచారంలో ఇటు పొత్తులు కుదుర్చుకోవడంలోనూ విఫలమే.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ ఒక్కటై కాంగ్రెస్‌ను కన్నెత్తి చూడలేదు. దిల్లీలో పొత్తుకు ఆమ్‌ఆద్మీ చివరి వరకు ఊగిసలాడి పక్కనపెట్టేసింది. భాజపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయలేకపోయింది. ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, ఎండీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉన్నప్పటికీ పెద్దగా లాభం లేదు. బెంగాల్‌లో పరిస్థితి అందరికీ తెలిసిందే. రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వానికి అంగీకరించని మాయావతి, మమతా బెనర్జీ ఏకంగా ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలగన్నారు. రాహుల్‌ను పట్టించుకోలేదు. ఇవన్నీ అంతిమంగా కాంగ్రెస్‌నే దెబ్బకొట్టాయి. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించేందుకు రాహుల్‌ నాయకత్వ చరిష్మా సరిపోలేదు.

‘స్వీయ’ మెరుపు దాడులు

కాంగ్రెస్‌ ఓటమికి మరో ముఖ్య కారణం మోదీతో జాతీయవాదాన్ని ముడిపెట్టడం. ఉరిలో పాక్‌ ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రజలు ముక్తకంఠంతో కోరారు. శత్రువులు మన కదలికలు గుర్తించొద్దని మోదీ ప్రభుత్వం కొన్నిరోజులు వ్యూహాత్మక మౌనం పాటించింది. ఈ సమయంలో విపక్షాలు భాజపాను విమర్శించాయి. చివరికి మోదీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ రూపంలో జవాబు చెప్పారు. ఇది ఎన్నికల్లో  భాజపాకు ఉపయోగపడుతుందని మెరుపు దాడులకు సాక్ష్యాలేవి అని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. గతంలో తామూ దాడులు చేశామని కాంగ్రెస్‌ ఊదరగొట్టింది. దీనికి రక్షణ శాఖ అధికారులే తగిన జవాబులు ఇవ్వడంతో ముఖం చాటేసింది. ఈ ఏడాది పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పాక్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి బదులుగా పాక్‌లో ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసినప్పుడూ  కాంగ్రెస్‌, ప్రతిక్షాలు వితండవాదం ప్రదర్శించాయి. చాకచక్యంగా ఆలోచించిందే లేదు. మోదీకి పేరు రాకూడదని చెలరేగారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ నష్టం జరిగిందని చెప్పనేలేదనడంతో ప్రజలు నవ్వుకున్నారు. మొత్తానికి మోదీకీ జాతీయవాదానికీ ముడిపెట్టారు.

భారత్‌ అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేసే సామర్థ్యం సంపాదించిందని ప్రధాని జాతికి ఉపదేశం చేసినప్పుడూ ఇలాగే గగ్గొలు పెట్టాయి. శాస్త్రవేత్తలను అభినందించి సంయమనం పాటించాల్సింది పోయి మళ్లీ మోదీపై విమర్శలే చేశాయి. దీనికీ మళ్లీ రక్షణ అధికారులే కాంగ్రెస్‌ హయాంలో చేద్దామంటే అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. వీటికి తోడు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ విడుదల సమయంలో ప్రధానిపై అవాకులు చవాకులు పేలారు. వ్యవహారమంతా తెరవెనక చక్కగా జరుగుతోంటే అర్థం చేసుకోకుండా విమర్శించారు. అమెరికా, సౌదీ, జపాన్‌ వంటి దేశాలు పాక్‌పై ఒత్తిడి తేవడంలో మోదీ నెరిపిన దౌత్యమే కారణమన్న సంగతిని విస్మరించాయి. శత్రువును దెబ్బకొట్టాలంటే ప్రధాని స్థాయి వ్యక్తి ఎలా ఉంటాడో అర్థం చేసుకోకుండా అభినందన్‌కు స్వాగతం చెప్పలేదంటూ తిట్టిపోశాయి. వీటిన్నిటితో పాక్‌కు బుద్ధి చెప్పేది మోదీ మాత్రమే అన్నట్టు ప్రజలు గ్రహించారు.

మరి ఇన్నాళ్ల అ‘న్యాయ్‌’?

కాంగ్రెస్‌ ఈ సారి ‘న్యాయ్‌’తో ముందుకొచ్చింది. దేశంలోని పేద కుటుంబాలకు ఏటా రూ.72,000కు తగ్గకుండా ఖాతాల్లో వేస్తామని వెల్లడించింది. కనీస ఆదాయ పథకంగా వర్ణించింది.   విధి విధానాలు, నిధుల సంగతి చెప్పలేదు. జీడీపీపై పథక ప్రభావం అంచనా వేయలేదు. ఓట్లే లక్ష్యంగా ప్రకటించినట్టు కనిపించింది. దీనికి విస్తృతం ప్రచారం కల్పించడంలోనూ విఫలమైంది. ఇక భాజపా ‘న్యాయ్‌’ ప్రభావం కనిపించకుండా చేసింది. పేదరిక నిర్మూలనపై ప్రకటించిన ‘గరీబీ హఠావో’ ఏమైందని ప్రశ్నించింది. 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పేదలకు జరిగిన అన్యాయం మాటేంటని ప్రశ్నించింది. పేదరికాన్ని ఎందుకు అంతం చేయాలని ప్రచారం చేయడంతో ‘న్యాయ్‌’పై నీలినీడలు కమ్ముకున్నాయి. పైగా కాంగ్రెస్‌ దిగువస్థాయి నాయకుల్లోనే దీనిపై నమ్మకం కుదరలేదు!

రాహుల్‌ @ 2024

ఉత్తర భారతంలో బలంగా ఉన్న భాజపాను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్‌ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లలేదు. భాజపా త్వరత్వరగా ప్రచారానికి పూనుకుంటే కాంగ్రెస్‌ ఆలస్యం చేసింది. మరో కీలక విషయం ఏంటంటే తమ లక్ష్యం ఈ ఎన్నికలు కాదు 2024 అన్నట్టు కాంగ్రెస్‌ ప్రవర్తించింది. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీ ఇంకా పూర్తిగా సంసిద్ధం కాలేదన్నట్టు కనిపించింది. ఎక్కడా దూకుడు కనబరచలేదు. పొత్తుల్లో జాప్యంతో ఓడింది. ప్రచారంలో ప్రజాసమస్యల్ని ప్రస్తావించలేదు. కీలక నేతలను కలుపుకుపోలేదు. యువ నాయకత్వాన్నీ ప్రోత్సహించలేదు. రాహుల్‌ తానే ప్రధానమంత్రి అభ్యర్థిని అని బలంగా చాటుకోలేదు. మిత్రపక్షాలూ ఆయనను గుర్తించకపోవడం మరో కారణం.

-ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.