close

తాజా వార్తలు

మిస్టర్‌ క్లీన్‌కు ఐదోసారి పగ్గాలు..

 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ 

న్యూదిల్లీ: ఐదోసారి.. మూడింట రెండొంతులకు పైగా సీట్లు అధికార పార్టీకే..  ఇదీ ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ సాధించిన విజయం. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని మరీ బిజద 45శాతం ఓట్‌ షేర్‌ను సాధించింది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి దక్కిన ఓట్‌ షేర్‌ 43.35శాతమే. ఈ సారి కూడా దేశవ్యాప్తంగా మోదీ పవనాలు వీచాయి.. ఒడిశాలోని పార్లమెంట్‌ స్థానాల్లో కూడా భాజపా గణనీయమైన విజయాలను నమోదు చేసింది. కానీ, ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకోలేదు. అందుకే బిజదకు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. 
కాంగ్రెస్‌ స్థానం భర్తీ చేసిన భాజపా..
ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ స్థానాన్ని భాజపా భర్తీ చేసింది. 22 స్థానాలతో ద్వితీయ స్థానంలో ఉంది. కాకపోతే ఓట్లశాతం మాత్రం గణనీయంగా పెరిగింది. గతంలో 18శాతం ఉన్న ఓట్లు.. ఇప్పుడు 30శాతానికి పెరిగాయి. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఓట్లు 26శాతం నుంచి 16శాతంకు పడిపోయాయి. దీంతో 12 సీట్లకే పరిమితమైంది. 

నిరాడంబర జీవితం..
నవీన్‌ పట్నాయక్‌ తండ్రి బిజూపట్నాయక్‌ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనో వ్యాపారవేత్త కూడా. కానీ, నవీన్‌ పట్నాయక్‌ ఎప్పుడూ తన ఆహార్యంలో సంపదను కనిపించనీయరు. కేవలం రెండు జతల దుస్తులు మాత్రమే ఆయనకు ఉంటాయి. హవాయి చెప్పులను ఆయన ధరిస్తారు. ఆయన్ను కొత్త వారు చూస్తే ఎవరో సాధారణ వ్యక్తి అనుకుంటారు. ‘దురాశ లేని వ్యక్తి’గా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజీ ఉంది. ఆయన చాలా జాగ్రత్తగా ఇమేజిని నిర్మించుకొన్నారని రాజకీయ పండితులు చెబతారు. ప్రజల్లో ఆయనపై ఉన్న మంచి అభిప్రాయం , క్లీన్‌ ఇమేజీ కారణంగానే అక్కడ మరొకరికి అధికారం కట్టబెట్టడంలేదు. ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లోని 83శాతం మంది ప్రజలు.. మరీ ముఖ్యంగా మహిళలు ఆయన్ను అభిమానిస్తారు. 

నమ్మకమైన ఓట్‌బ్యాంక్‌

నాలుగు పర్యాయలు అధికారంలో ఉన్న నవీన్‌ 60వరకు ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. రైతులకు కనీస ఆదాయం వచ్చేలా కాలియా, ది మధుబాబు పెన్షన్‌ యోజన, గర్భిణులకు మమత స్కీం వంటివి ఆయన ప్రవేశపెట్టినవే. ఈ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాలను చేరాయి. ముఖ్యంగా మహిళలు,శిశువులు, వికలాంగులు, వృద్ధులు, రైతులు, మత్స్యకారులు, యువత, కళాకారులుకు చేరాయి.  దీంతో రాష్ట్రంలోని మహిళా ఓటర్లు పట్నాయక్‌ పక్షాన నిలుస్తున్నారు. మహిళల కోసం బిజద ప్రభుత్వం మిషన్‌ శక్తి అనే కార్యక్రమాన్ని  ప్రారంభించింది. దీని కింద 7లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతున్నారు.   

ఒరియా తెలియకపోవడంతో లబ్ది
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్‌ పట్నాయక్‌కు ఒరియా తెలియదు. ఈ అంశం తన బలహీనత అని ఆయన ఏమాత్రం అనుకోరు. కానీ ఆయన ఆహార్యంతో స్థానిక ప్రజలతో కలిసిపోతారు. దీంతో ఆయన ఇమేజీని దెబ్బతీయడం ప్రతిపక్షాలకు ఏమాత్రం సాధ్యం కాలేదు. ఒక రకంగా ఇది ఆయనకు ప్రయోజనం చేకూరుస్తోంది. స్థానిక నేతలు చేసే అనవసరమైన ప్రకటనలపై స్పందించి వివాదాల్లో చిక్కుకోకుండా కాపాడుతోంది. ఫలితంగా ప్రజల్లో వివాదరహితుడన్న ఇమేజీ బలంగా నాటుకుపోయింది. వీటన్నిటి కంటే ముఖ్యమైనది ఆయన క్లీన్‌ ఇమేజ్‌. నవీన్‌ పట్నాయక్‌పై ఒక్క అవినీతి ఆరోపణ సంబంధించిన  కేసు కూడా లేదు. ఫలితంగా నిజాయితీ పరుడు అన్న పేరు ఉంది. ఇది భారత రాజకీయాల్లో చాలా ముఖ్యమైనది. 

వ్యక్తిగతం..

నవీన్‌ పట్నాయక్‌ 1946 అక్టోబర్‌ 16వ తేదీన కటక్‌లో బిజయానంద పట్నాయక్‌-జ్ఞాన్‌ దంపతులకు జన్మించారు. నవీన్‌ తండ్రి ఒడిశాలో బిజూగా చాలా సుపరిచితులు. ఆయన కాంగ్రెస్‌, జనతాపార్టీలో కీలక పాత్ర పోషించారు. బిజూ రెండు సార్లు  ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. నవీన్‌ పట్నాయక్‌ డెహ్రడూన్‌లోని వెల్హమ్‌ పాఠశాలలో చదువుకొన్నారు.  ఆ తర్వాత దిల్లీలోని కిరోరి మాల్‌ కళాశాలలో చదువుకొన్నారు.అప్పట్లో ఆయన్ను సన్నిహితులు పప్పు అని పిలిచేవారు. నవీన్‌ తండ్రి బిజూ 1997లో  కన్నుమూశారు. దీంతో నవీన్‌ పట్నాయక్‌ బిజూ జనతాదళ్‌ పేరుతో పార్టీని ప్రారభించారు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజద అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.